సమైక్య రాష్ట్రమే జగనన్న అభిమతం

హైదరాబాద్, 22 సెప్టెంబర్ 2013:

సమైక్యాంధ్ర ఉద్యమంలో మరింత ఉధృతంగా పాల్గొనాలని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి సోదరి శ్రీమతి షర్మిల పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సమన్వయకర్తలు, ఇతర ముఖ్య నాయకులు ఉద్యమంలో చురుగ్గా పాల్గొంటున్నారని ఆమె అభినందించారు. సీమాంధ్ర ఉద్యమం నేపథ్యంలో వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ విస్తృత స్థాయి సమావేశం శనివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి విజయమ్మ అధ్యక్షతన జరిగింది. ఈ భేటిలో శ్రీమతి షర్మిల పార్టీ శ్రేణులకు పలు విధానపరమైన సూచనలు చేశారు.

ఈ సందర్భంగా శ్రీమతి షర్మిల మాట్లాడుతూ... ‘రాష్ట్ర విభజన జరగరాదన్నది, అప్పుడే ప్రజలందరికీ మేలు జరుగుతుందన్నది జగనన్న ప్రగాఢ అభిమతం. అందుకు అనుగుణంగా పార్టీ రూపొందించిన ఉద్యమ కార్యాచరణను ముందుకు తీసుకెళ్లండి. అన్నిచోట్లా ఒకే రోజున ఒక్కసారిగా ఆందోళన కార్యక్రమాలు చేపడితే దాని ప్రభావం తీవ్రంగా ఉంటుందని జగనన్న చెప్పమన్నారు. అందుకే నెల రోజుల పాటు ఉద్యమ కార్యాచరణను పార్టీ ప్రకటిస్తోంది. విభజనకు కారణమైన కాంగ్రెస్, టిడిపిల నాయకులే మళ్లీ ప్రజల్లోకి వచ్చి సమైక్యాంధ్ర అంటున్నారు. వారి ద్వంద్వ వైఖరిని ఎండగట్టండి' అని శ్రీమతి షర్మిల ఉద్బోధించారు.

మరింత ఉధృతంగా ఉద్యమించే బాధ్యత మనపైనే ఉంది :
కేంద్రంలో కాంగ్రెస్ ఎత్తుగడలు చూస్తుంటే సమైక్యాంధ్ర ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాల్సిన అవసరం ఉందని పార్టీ గౌరవ‌ అధ్యక్షురాలు శ్రీమతి విజయమ్మ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ‘ఈ బాధ్యత మనపైనే ఎక్కువగా ఉంది’ అని వారికి ఉద్బోధించారు. రాష్ట్ర విభజన విషయంలో అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం టిడిపిల వైఖరిని ఆమె తీవ్రంగా ఎండగట్టారు. సమైక్యాంధ్ర విషయంలో అవి రెండు పార్టీలూ నాటకాలాడుతున్నాయని దుయ్యబట్టారు. ‘వారి వాలకం చూస్తూంటే హఠాత్తుగా పార్లమెంటులో తెలంగాణ బిల్లు పెట్టి ఆమోదించేలా ఉంది. అలా జరగకుండా ఉండేందుకు, ‘కాంగ్రెస్, టిడిని నేతలు ముందే పదవులకు రాజీనామాలు చేయాలి’ అని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు ఎక్కడికక్కడ డిమాండ్ చేయాలి’ అన్నారు.

‌‘రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటే రాజకీయ సంక్షోభం సృష్టించడం తప్పనిసరి. అందుకోసం సిఎం, కేంద్ర, రాష్ట్ర మంత్రులు, రాజీనామా చేయాలి. అదేవిధంగా టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు విభజనకు అనుకూలంగా ఇచ్చిన లేఖను వెనక్కి తీసుకోవడంతో పాటు కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు ఆయనతో పాటు టిడిపి ఎంపిలు, ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలి’ అని శ్రీమతి విజయమ్మ డిమాండ్ చేశారు. ‘ఆంటోనీ కమిటీ వేశాం, సమస్యలు చెప్పుకోండి అని కాంగ్రె‌స్ పార్టీ ‌ఒక వైపున చెబుతూ.. మరో వైపున రాష్ట్ర విభజన ప్రక్రియ కొనసాగుతుందంటోంది. కేంద్ర హోంమంత్రి షిండే నోట్ తయారైందంటున్నారు. ఇలాంటి సమయంలో సమై‌క్య ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మనపైనే ఎక్కువగా ఉంది’ అని పార్టీ నాయకులకు ఆమె వివరించారు. దివంగత మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి నినాదమే పార్టీ విధానం అన్నారు. వైయస్ఆర్ ఆశయాలకు అనుగుణంగా అదే స్ఫూర్తి, బాధ్యతతో 2014 ఎన్నికల్లో పనిచేయాలని‌ పార్టీ శ్రేణులను ఆమె కోరారు.

పార్టీ విస్తృత స్థాయి భేటీలో రాజకీయ వ్యవహారాల కమిటీ కో ఆర్డినేటర్ కొణతాల రామకష్ణ, ఎం‌.పి. మేకపాటి రాజమోహన్‌రెడ్డి, రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు బాజిరెడ్డి గోవర్ధన్, ముఖ్య నేతలు భూమా శోభా‌ నాగిరెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, జూపూడి ప్రభాకరరావు, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, వాసిరెడ్డి పద్మ, దాడి వీరభద్రరావు‌, తమ్మినేని సీతారాం తదితరులు మాట్లాడారు. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా కన్వీనర్లు, అసెంబ్లీ నియోజకవర్గాల కో ఆర్డినేటర్లు, కేంద్ర పాలక మండలి, సీఈసీ సభ్యులు, రాష్ట్ర అనుబంధ విభాగాల అధ్యక్షులు పాల్గొన్నారు.

అసెంబ్లీలో ‘సమైక్య’ తీర్మానం చేయాలి :
వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ విస్తృతస్థాయి సమావేశం పలు డిమాండ్లతో కూడిన తీర్మానాలను చర్చించి ఏకగ్రీవంగా ఆమోదించింది. ఆ వివరాలను పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అనంతరం మీడియాకు వివరించారు. అవి...

- తక్షణమే అసెంబ్లీని సమావేశపరచాలి. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ తీర్మానం చేసి కేంద్రానికి పంపాలి.
- విభజనపై సిడబ్ల్యుసి తీర్మానాన్ని ఏ దశలోనూ అడ్డుకోలేకపోయిన సిఎం కిరణ్, తీరా ప్రకటన వచ్చాక సమైక్యవాదం ఆలపించడం కంటితుడుపే. ఆయనకు ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా అసెంబ్లీలో తీర్మానం చేయాలి. ఆంటోనీ కమిటీ నివేదిక వచ్చేదాకా కేబినెట్ నో‌ట్ రాదంటూ ఇంతకాలం కాలయాపన చేసిన కేంద్ర మంత్రులు, కాంగ్రె‌స్ ఎం‌.పిలకు చిత్తశుద్ధి ఉంటే తక్షణం రాజీనామాలు చేసి విభజనను అడ్డుకోవాలి.
- రాష్ట్ర విభజనకు అనుకూలంగా బ్లాంక్ చె‌క్కు మాదిరిగా టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఇచ్చిన లేఖను వెనక్కి తీసుకోవాలి. ఆయన, ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపిలు రాజీనామాలు చేసి రాష్ట్రం విడిపోకుండా చూడాలి.

- విభజనకు వ్యతిరేకంగా సీమాంధ్ర ప్రాంతంలో పెల్లుబికిన ప్రజా ఉద్యమంలో ముందు వరుసలో ఉన్న వివిధ రాజకీయేతర జేఏసీలకు పార్టీ అభినందనలు తెలపాలి. సమైక్యాంధ్రపై స్పష్టత ఇవ్వకుండా డ్రామాలాడుతున్న పార్టీలు సమైక్యాంధ్రకు అనుకూలంగా వైఖరిని మార్చుకునేలా జేఏసీలు మరిన్ని చర్యలు తీసుకోవాలి. ఆ పార్టీల ప్రజాప్రతినిధులంతా రాజీనామాలు చేసేలా ఒత్తిడి చేయాలి.
- నిర్బంధంలో ఉన్న పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి బయటకు రాలేని పరిస్థితుల్లో 3,112 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్ర చేసిన ఆయన సోదరి శ్రీమతి షర్మిలకు, ఆమెతో పాటుగా అడుగులో అడుగు వేసి నడిచిన నాయకులు, కార్యకర్తలు, ప్రజలకు పార్టీ అభినందనలు తెలియజేసింది.

Back to Top