నాటకాల నాయకులకు త్వరలో గుణపాఠం

ఒంగోలు :

రాష్ట్ర విభజన విషయంపై రోజుకో డ్రామా ఆడుతున్న నాయకులకు ప్రజలు త్వరలోనే గుణపాఠం చెబుతారని వైయస్ఆర్‌ సిఎల్పీ విప్‌ బాలినేని శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు. ఇప్పటికైనా సీమాంధ్ర ప్రాంతంలోని ఆ నాటకాల నాయకులు తమ డ్రామాలు కట్టిపెట్టి రాజీనామాలు చేస్తే విభజన నిలుస్తుందని ఆయన అన్నారు. సమైక్య హోరు రోజు రోజుకూ ఉధృతం అవుతున్న నేపథ్యంలో వైయస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ‌ ప్రకాశం జిల్లా ప్రచార విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో బాలినేని పాల్గొని మాట్లాడారు. వందలాది మంది కార్యకర్తలతో కలిసి ఆయన స్థానిక సివిఎన్ రీడింగ్ రూ̴మ్ సెంట‌ర్‌లోని పొట్టి శ్రీరాములు విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు.  ఈ కార్యక్రమంలో వైయస్ఆర్‌ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు నల్లచొక్కాలు ధరించి నిరసన తెలిపారు.

‌ఈ సందర్భంగా బాలినేని మాట్లాడుతూ.. సిఎం కిరణ్‌కుమార్‌రెడ్డి వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ‌తెలంగాణ ప్రకటన రావడానికి బీజం వేసింది దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డే అంటూ కిరణ్‌కుమా‌ర్‌రెడ్డి మాట్లాడటం తగదన్నారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి తప్పుడు ప్రకటనలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. రాష్ట్ర విభజన ప్రకటన రాబోతోందని తెలియగానే వైయస్ఆర్‌ కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా రాజీనామా చేశారన్నారు. తాను సమైక్యవాదినని‌ సిఎం ఇప్పుడు చెప్పడం కాదని, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలోనే విస్పష్టంగా చెప్పి...‌ తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే రాజీనామా చేస్తానని ఉంటే విభజన ప్రకటన వెలువడి ఉండేది కాదన్నారు.

సమైక్యాంధ్ర విడిపోతే ఎదురయ్యే ఇబ్బందులను తాము రాజీనామాలు చేసే సమయంలోనే స్పష్టంగా చెప్పామని, ఆ రోజు నోరెత్తకుండా ఉన్న సిఎం.. నేడు ఆంటోని కమిటీ వస్తుందని అభ్యంతరాలు వ్యక్తం చేద్దామని ప్రకటించడం ప్రజలను మోసగించడమేనని బాలినేని దుయ్యబట్టారు. ఆంటోనీ కమిటీ కేవలం కంటి తుడుపు చర్యేనన్నారు. టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు ఇప్పటికీ తెలంగాణకే కట్టుబడి ఉన్నట్లు ప్రకటిస్తున్నారని, కానీ ఆ పార్టీ నాయకులు మాత్రం సమైక్యాంధ్రకు మద్దతుగా ర్యాలీలు నిర్వహించడం ప్రజలను మోసం చేయాలనే కుట్రలో భాగమేనన్నారు. ఇప్పటికైనా నాటకాలను ఆపివేసి సీమాంధ్రకు చెందిన కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు తమ పదవులకు, పార్టీలకు సైతం రాజీనామా చేస్తేనే రాష్ట్ర విభజన ఆగుతుందన్నారు.

ఇవేవీ చేయకుండా సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొన్నంత మాత్రాన జనం నమ్ముతారనుకుంటే పొరబాటని, నాటకాలాడే నాయకులకు సరైన గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధం కావాలని బాలినేని పిలుపునిచ్చారు. వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రకాశం జిల్లా ప్రచార విభాగం కన్వీనర్ వేమూరి సూర్యనారాయణ‌ తదితరులు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు.

తాజా ఫోటోలు

Back to Top