<strong>నరసరావుపేట (గుంటూరు జిల్లా) :</strong> ఉనికిని కాపాడుకునేందుకే టిడిపి నాయకులు శ్రీమతి షర్మిలపై అవాస్తవాలతో విమర్శలు చేస్తున్నారని నరసరావుపేట నియోజకవర్గం వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి సోదరి శ్రీమతి షర్మిల చేస్తున్న మరో ప్రజాప్రస్థానం పాదయాత్రకు నరసరావుపేట ప్రజలు బ్రహ్మరథం పట్టారని ఆయన పేర్కొన్నారు. శ్రీమతి షర్మిల పాదయాత్రకు పెద్ద ఎత్తున ప్రజల నుంచి వస్తున్న ఆదరణను చూసిన టిడిపి నాయకుల గుండెల్లో రైళ్ళు పరిగెడుతున్నాయని డాక్టర్ శ్రీనివాసరెడ్డి అన్నారు.<br/>నరసరావుపేటలోని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో డాక్టర్ శ్రీనివాసరెడ్డి మాట్లాడారు. గుంటూరు జిల్లాలో శ్రీమతి షర్మిల పాదయాత్రకు వస్తున్న ప్రజల స్పందన చూసి అధికార, ప్రతిపక్ష పార్టీలకు ముచ్చెమటలు పడుతున్నాయన్నారు. తమలో వచ్చిన భయాన్ని తట్టుకోలేకే టిడిపి నాయకులు ఇప్పుడు శ్రీమతి షర్మిల భర్త బ్రదర్ అనిల్‌కుమార్‌పై ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.<br/>శ్రీమతి షర్మిల పాదయాత్రను జయప్రదం చేసిన నాయకులు, కార్యకర్తలకు వైయస్‌ఆర్‌సిపి నరసరావుపేట పట్టణ అధికార ప్రతినిధి బాపతు రామకృష్ణారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో పట్టణ ఎస్.సి. సెల్ కన్వీనర్ కందుల యజ్రా, కార్యదర్శులు మల్లెల లింగయ్య, మద్దిరెడ్డి నరసింహారెడ్డి, బి.సి. నాయకులు వేముల శివ, టి.భుజంగరావు చౌదరి, మైనార్టీ నాయకులు షేక్ ఖాదర్ బాషా, సయ్యద్ ఖాదర్ బాషా తదితరులు పాల్గొన్నారు.