చంద్రబాబు చిలుక పలుకులు

నిరుద్యోగుల పాలిట యమపాశంలా బాబు
నోటిఫికేషన్ల కోసం నెలల తరబడి ఎదురుచూస్తున్న నిరుద్యోగులు
ఉద్యోగాల ప్రకటన ఊసెత్తని సర్కార్
ప్రైవేటు ఉద్యోగాలు చూసుకోవాలంటుూ కొత్తబాస్ సలహా

ఏపీపీఎస్సీ
నో వేకెన్సీ బోర్డు పెట్టేసింది. చంద్రబాబు పుణ్యమాని రాష్ట్రంలో ఒక్క
ఉద్యోగమూ ఖాళీ లేదని ప్రకటించేస్తోంది. రాష్ట్రంలోని ఉద్యోగాల ఖాళీల
వివరాలను ప్రకటించడంలో  తాత్సారం చేస్తూ చంద్రబాబు నిరుద్యోగుల ఆశల మీద
నీళ్లు చల్లుతున్నాడు. ఏపీపీఎస్సీ నుంచి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు
ఎపుడు విడుదలవుతాయా అని లక్షలాది మంది నిరుద్యోగులు ఆశగా
ఎదురుచూస్తున్నారు. ఇటీవల ఏపీపీఎస్సీకి రాష్ర్ట ప్రభుత్వం కొత్త చైర్మన్‌గా
పి.ఉదయభాస్కర్‌ను నియమించడంతో నోటిఫికేషన్లు వెలువడడమే తరువాయి అని
నిరుద్యోగులు భావించారు. కానీ, చంద్రబాబు నిరుద్యోగుల పాలిట యమపాశంలా
తయారయ్యాడు. 

ఏపీపీఎస్సీ వచ్చిన కొత్త బాస్ తో
చంద్రబాబు చిలుక పలుకులు పలికిస్తున్నారు. ప్రభుత్వంతో మాట్లాడి
నోటిఫికేషన్లు జారీచేస్తామంటూనే ప్రభుత్వ ఉద్యోగాల కన్నా ప్రైవేటు రంగంలోనే
మంచి అవకాశాలున్నాయంటూ ఉదయ్ భాస్కర్ నిరుద్యోగులకు ఉచిత సలహాలు
ఇస్తున్నారు.  ఇంత మాత్రం దానికి  ఏపీపీఎస్సీకి కొత్త చైర్మన్‌ను
నియమించడమెందుకని, గుర్రానికి కాళ్లు కట్టేసి రౌతును ఎక్కించినట్లుగా
ప్రభుత్వ తీరు ఉందని నిరుద్యోగులు మండిపడుతున్నారు.

రాష్ట్ర
విభజనకు ముందు వివిధ ఖాళీల భర్తీకోసం వివిధ శాఖలనుంచి ఏపీపీఎస్సీకి
నివేదికలు వచ్చాయి. వాటి ప్రకారం 16వేల పోస్టులకు నోటిఫికేషన్లు
సిద్ధమయ్యాయి. ఆ తరుణంలో ఎన్నికలు రావడంతో అవి నిలిచి పోయాయి. తరువాత ఖాళీల
భర్తీకి సంస్థ ముందుకు వెళ్లకుండా ప్రభుత్వం కళ్లెం వేసింది. రాష్ట్రంలో
జిల్లా, జోనల్, మల్టీ జోనల్ ఉద్యోగ ఖాళీలు 1.42 లక్షలు ఉన్నాయని కమలనాథన్
కమిటీ గుర్తించింది. విభజన సమయంలో నాటి ఉమ్మడి రాష్ర్ట ప్రభుత్వమే తెలంగాణ,
ఏపీల్లో ఉన్న వివిధ పోస్టులు, వాటి వివరాలను కమలనాథన్ కమిటీకి అందించింది.
ఆ వివరాలు కావాలని ఇప్పటివరకు ఎన్ని లేఖలు రాసినా ప్రభుత్వం నుంచి ఉలుకూ
పలుకూ లేకుండా పోయిందని ఏపీపీఎస్సీ వర్గాలంటున్నాయి.

చంద్రబాబు
అధికారంలోకి వచ్చి ఏడాదిన్నరయినా ఇప్పటివరకు ఏ ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదు.
జాబు రావాలంటే బాబు రావాలంటూ ఎన్నికల ముందు ఊదరగొట్టిన చంద్రబాబు..పీఠం
దక్కేసరికి ప్లేటి ఫిరాయించాడు. ఇంటికో ఉద్యోగం, ఉద్యోగం లేని వారికి నెలకు
రూ.2 వేల నిరుద్యోగ భృతి ఇస్తామని ఢంకా బజాయించారు. కొత్త ఉద్యోగాల సంగతమే
గానీ ఉన్న ఉద్యోగాలు పీకేస్తున్నారు. తాము చెప్పేవరకూ ఒక్క నోటిఫికేషన్
కూడా ఇవ్వవద్దంటూ అధికారంలోకి వచ్చిన తొలిరోజే చంద్రబాబు ఏపీపీఎస్సీకి
హుకూం జారీ చేశారు. 

ఇప్పటికే  చంద్రబాబు 15వేల
మంది ఆదర్శ రైతులను తొలగించారు. 7వేల మంది గృహనిర్మాణ వర్క్
ఇన్‌స్పెక్టర్లను ఇంటికి పంపించారు. 2వేల మంది ఉపాధి హామీ కాంట్రాక్టు
కార్మికులను తొలగించారు. వైద్య ఆరోగ్యశాఖలో 1,500 మంది కాంట్రాక్టు
కార్మికులను తొలగించారు. బాబు అధికారంలోకి వచ్చాక మొత్తంగా  25వేల మందికి
ఉద్యోగాలు కోల్పోయారు. ఉద్యోగాల భర్తీపై ఆశలు  నీరుగారిపోతుండడంతో
నిరుద్యోగుల్లో ఆగ్రహావేశాలు పెల్లుబుకుతున్నాయి. డీఎస్సీ ఫలితాలు వెల్లడై
ఆరు మాసాలు అవుతున్నా ఇంతవరకు పోస్టింగ్ లే ఇవ్వలేదు. ప్రభుత్వం మెరిట్
జాబితాను ప్రకటించకపోవడంతో టీచర్ పోస్టుల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్ధులు
నిరాశా నిస్పృ హల్లో ఉన్నారు. 
Back to Top