ప్రత్యేకహోదా సాధించేవరకు రాజీలేని పోరాటం

మునగపాక: రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చే వరకు రాజీలేని పోరాటం చేయాలని వైయస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త బొడ్డేడ ప్రసాద్‌ పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో గురువారం విశాఖ ఆర్‌కె బీచ్‌లో జరగనున్న కొవ్వొత్తుల ప్రదర్శనను విజయవంతం చేయాలని కోరారు. స్థానిక పార్టీ కార్యాలయంలో బుధవారం మండల కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రసాద్‌ మాట్లాడుతూ... రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావడం ద్వారా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. అంతేకాకుండా వేలాది పరిశ్రమలు ఏర్పాటు చేయడం ద్వారా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయన్నారు. ప్రత్యేక హోదాకోసం కేంద్రం వద్ద ఒత్తిడి తీసుకురావడంలో చంద్రబాబునాయుడు విఫలమయ్యారన్నారు. పక్కనే ఉన్న తమిళనాడులో జల్లెకట్టు ఉధ్యమానికి అధికార, ప్రతిపక్ష పార్టీలు ఆందోళనలు చేయడం ద్వారానే కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్‌ను తీసుకువచ్చిందన్నారు. తమిళనాడును ఆదర్శంగా తీసుకొని రాష్ట్రానికి హోదా వచ్చేవరకు రాజకీయాలకు అతీతంగా ఉధ్యమించాలన్నారు. 

గురువారం విశాఖలో వైయస్సార్‌సీపీ నేతృత్వంలో నిర్వహించనున్న కొవ్వొత్తుల ప్రదర్శనను ప్రభుత్వం అణచివేయాలని చూడడం సమంజసం కాదన్నారు. పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహనరెడ్డి స్వయంగా విశాఖబీచ్‌లో జరగనున్న కొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొంటారన్నారు.   ఈ ప్రదర్శనకు నియోజకవర్గం నుంచి వేలాదిగా తరలిరావాలని కోరారు. సమావేశంలో పార్టీ మండల కన్వీనర్‌ మళ్ల సంజీవరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి మళ్ల నాగసన్యాశిరావు,పార్టీ నాయకులు పెంటకోట అప్పలనాయుడు, రామరాజు, గుంట్ల అప్పారావు, రాజాన బుజ్జి, అచ్చుతాపురం మండలం పూడిమడక మాజీ సర్పంచ్‌ చేపల వెంకటరమణ, చోడపల్లి అప్పారావు తదితరులు పాల్గొన్నారు.
Back to Top