గ్యాస్‌ ధర పెంచి జనం నడ్డి విరిచిన ప్రభుత్వం

హైదరాబాద్‌ :‌

కొత్త సంవత్సరం తొలి రోజున కేంద్ర ప్రభుత్వం పెంచిన వంట గ్యాస్ ధరలను తక్షణమే తగ్గించాలని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు డాక్టర్‌ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు డిమాండ్‌ చేశారు. గ్యాస్ ధరను ప్రభుత్వం అమాంతం‌ భారీగా పెంచడం దారుణమని ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మహానేత డాక్టర్‌ వైయస్ రాజశేఖరరెడ్డి ‌సీఎంగా ఉన్నప్పడూ గ్యాస్ ధరలు పెరగలేదని గుర్తుచేశారు. ఒక సారి కేంద్ర సిలిండర్‌పై 50 రూపాయలు పెంచితే ఆ భారం ప్రజలపై పడనివ్వకూడదన్న సదుద్దేశంతో ఆ సొమ్మును రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించేలా చర్యలు తీసుకున్నారని ఉమ్మారెడ్డి గుర్తుచేశారు. గ్యాస్‌ ధరలు ఒక్కసారిగా రూ. 200 పైచిలుకు పెంచినట్లు మీడియాలో వార్తలు వచ్చిన వెంటనే ఆయన పార్టీ కేంద్ర కార్యాలయం ఆవరణలో మీడియా ముందు ప్రభుత్వం తీరుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

అవినీతి గురించి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని ఉమ్మారెడ్డి హితవు పలికారు. టీడీపీ నాయకులు చౌకబారు సవాళ్లు విసరడం సమంజసం కాదన్నారు. చంద్రబాబు నాయుడు కోర్టుల్లో స్టేలు తెచ్చుకుని తనపై విచారణ జరగకుండా కాలం వెళ్ళబుచ్చుతున్నారని ఉమ్మారెడ్డి ఆరోపించారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో తీసుకున్న ప్రతీ నిర్ణయంపైనా బహిరంగ చర్చకు టీడీపీ నాయకులు సిద్ధమా? అని ఆయన సవాల్‌ చేశారు. ఈ విషయంలో వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ బహిరంగ చర్చకు సిద్ధంగా ఉందని ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు.

Back to Top