'మంత్రిగారి ఆసుపత్రి ప్రచారానికే తప్ప రోగులకు ఉపయోగం లేదు'

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ చేపట్టిన ఆసుపత్రిలో నిద్ర కార్యక్రమం... ప్రచారానికే తప్ప రోగులకు ఉపయోగం లేదని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఎద్దేవా చేశారు. గురువారం హైదరాబాద్ లోటస్ పాండ్లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు విలేకర్లతో మాట్లాడుతూ... గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో శిశువుని ఎలుకలు పీక్కుతిన్న ఘటన సభ్య సమాజం తలదించుకునేలా ఉందన్నారు. ఈ ఘటనకు నైతిక బాధ్యత వహించాల్సిన మంత్రులు.. బాధను వ్యక్తం చేస్తున్నారని ఆరోపించారు.

రూ. 2 లక్షల ఎక్స్గ్రేషియా ఇచ్చి ప్రభుత్వం చేతులు దులుపుకుంటుందని విమర్శించారు. ప్రభుత్వాసుపత్రుల్లో సౌకర్యాలపై హైలెవల్ కమిటీ వేసి తక్షణమే చర్యలు తీసుకోవాలని చంద్రబాబు సర్కార్కు సూచించారు. డిప్యూటీ సీఎం కేఈ వ్యాఖ్యలపై సీఎం చంద్రబాబు స్పందించాలని డిమాండ్ చేశారు. అసలు భూ సేకరణకు కేబినెట్ ఆమోదం ఉందా ? అనే అనుమానం కలుగుతుందన్నారు. ప్రత్యేక హోదా కోసం ఆత్మహత్యలకు పాల్పడవద్దని సీమాంధ్ర ప్రజలకు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు విజ్ఞప్తి చేశారు. మన నిరసన కేంద్రానికి తెలియజేద్దామని ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు పేర్కొన్నారు.
Back to Top