రమేష్! డిటెక్టివ్ సంస్థ నడుపుకో!!

హైదరాబాద్ 28 సెప్టెంబర్ 2013:

టీడీపీ నేతలు, ముఖ్యంగా సీఎం రమేష్ తమ పార్టీపై చేసిన నిరాధార ఆరోపణలు చాలా దురదృష్టకరమని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఖండించారు. శుక్రవారం శ్రీమతి విజయమ్మ గారితో పాటు ఢిల్లీ వెళ్ళామనీ, అక్కడ ఇంటికెళ్ళి అక్కడినుంచి జంతర్ మంతర్ దగ్గర ధర్నాలో పాల్గొని తిరిగి ఇంటికెళ్లి అక్కడినుంచి నేరుగా విమానాశ్రయానికి వచ్చి హైదరాబాద్‌కు పయనమయ్యామని వివరించారు. ఈ కార్యక్రమం కూడా గురువారం నిర్ణయించినదేనన్నారు. సోనియా గాంధీకి కృతజ్ఞతలు చెప్పడానికి రాత్రి పది గంటలకు టైము తీసుకున్నారని ఆరోపించడం సరికాదన్నారు. తిరిగి వచ్చేటప్పుడు లోఢీ హొటల్లో మాట్లాడుకుని వచ్చారని సీఎం రమేష్, బృందం అంటున్నారన్నారు. అబద్ధాలను కూడా నిజమని నిరూపించే సాంకేతికతను వీరు అభివృద్ధి చేశారని ఆయన ఎద్దేవా చేశారు. ఇది సామాన్యమైన విషయం కాదన్నారు. ఆయనకు సమాచారం అందించేందుకు ఓ ఆగంతుకుణ్ణి నియమించుకున్నారట.. ఆతగాడు సీఎం రమేష్‌కు నిముషనిముషానికీ సమాచారం అందించారట.. ఇదంతా చూస్తుంటే... ఆయనో ఇన్వెస్టిగేషన్ సంస్థనే నడుపుకుంటే బాగుంటుందని ఉమ్మారెడ్డి హితవు పలికారు. హిట్లర్ ప్రభుత్వంలో గోబెల్ ఒక్కడే ఉండేవాడన్నారు. కానీ టీడీపీలో గోబెల్సు లెక్కకు మిక్కిలిగా పెరిగిపోయారని ఎద్దేవా చేశారు. బురద జల్లడం.. మీరే కడుక్కోండని చెప్పడం వారికి అలవాటుగా మారిందన్నారు. రాబోయే రోజుల్లో ఇలాంటి వారికి నాయకులమని చెప్పుకునే పరిస్థితి కూడా ఉండదని స్పష్టంచేశారు. సమైక్యాంధ్రకు టీడీపీ మద్దతిస్తుందా లేదా అనే అంశపై చర్చ జరగకుండా చేస్తున్న దురుద్దేశపూర్వకమైన ఆలోచనలు ఇవని చెప్పారు.

తాజా వీడియోలు

Back to Top