ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం వాస్తవాలు చెప్పకుండా ప్రజలను మభ్యపెట్టారుఅబద్దాలు గవర్నర్ చేత చెప్పించారు హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం అరచేతిలో వైకుంఠం చూపించే విధంగా ఉందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనమండలి పక్ష నేత, మాజీ మంత్రి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు విమర్శించారు. ఏపీ అసెంబ్లీ సమావేశాలు శనివారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా గవర్నర్ చేసిన ప్రసంగం అంతా అర్థసత్యాలు, అసత్యాలేనని ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ధ్వజమెత్తింది. అసెంబ్లీ వాయిదా అనంతరం ఉమ్మారెడ్డి మాట్లాడుతూ... ఉభయ సభలనుద్ధేశించి రాష్ట్ర ప్రగతి, ఎజెండా గురించి గవర్నర్ నరసింహన్ చేసిన ప్రసంగం పూర్తిగా అర్థసత్యాలు, అసత్యాలు, అరచేతిలో వైకుంఠం చూపెట్టారని మండిపడ్డారు. ప్రసంగంలో వాస్తవాలు ప్రతిబింబించలేదని దుయ్యబట్టారు. ప్రభుత్వం ఎంత గొప్పలు చెప్పుకోవాలన్న, గతంలో కేబినెట్ సమావేశంలోనే సీఎం ఓ విషయం చెప్పారని గుర్తు చేశారు. రాష్ట్రంలో ప్రగతి రెండంకెల్లో సాధించాలని అనుకున్నామని, కానీ అవినీతి రెండంకెల్లో సాధించామని ఆయన కేబినెట్ భేటీలోనే ఒప్పుకున్నారన్నారు. కానీ ప్రసంగంలో మాత్రం అవినీతిని సమూలంగా తుడిచిపెట్టినట్లు చెప్పడం చూస్తే ఆత్మను చంపుకోవడమేనన్నారు. జాతీయ వృద్ధిరేటు 7.31 శాతం ఉంటే ఇక్కడ మాత్రం 10.99 శాతం సాధించామని చెబుతుంటే అది ఎంతవరకు వాస్తవమని, ప్రజలు ఎంతవరకు నమ్ముతారని ప్రశ్నించారు. ఓ వైపు జీతాలకు కూడా డబ్బుల్లేని పరిస్థితి అని చెబుతూ, మరోవైపు జాతీయ స్థాయి కంటే ఎక్కువ వృద్ధిరేటు సాధించినట్లు చెప్పడం ప్రజలను మభ్యపెట్టడమేనన్నారు. వ్యవసాయ రంగంలో దిగుబడి ఎంత తగ్గిందో చెప్పలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సాగు విస్తీర్ణం, రైతుల ఆదాయం అన్నీ తగ్గాయని, నిత్యవసరాల ధరలు పెరిగిన అవేవీ చెప్పలేదన్నారు. ఇళ్ల నిర్మాణంలో తామిచ్చేది కేవలం లక్ష రూపాయలేనని, మిగిలింది రుణంగా అందజేస్తామనడం శోచనీయమన్నారు. కరువు లేదని చెబుతున్నారని, అనంతపురం జిల్లా నుంచి 4 లక్షల మంది ఎందుకు వలస వెళ్లారని నిలదీశారు.రుణమాఫీల గురించి ఎక్కడైనా మాట్లాడారా అని ప్రశ్నించారు. గవర్నర్ ప్రసంగం మొత్తం చంద్రబాబు అసత్యాలే ఉన్నాయని విమర్శించారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతూ, ప్రసంగం పూర్తి పాఠంపై సభలో మాట్లాడుతామని ఉమ్మారెడ్డి తెలిపారు.