షరతులు లేకుండా రైతు రుణ మాఫీ చేయాలి

హైదరాబాద్:

ఎన్నికలకు ముందు ప్రజలకు చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ మేరకు ఎలాంటి షరతులు లేకుండా వ్యవసాయ రుణాలు, డ్వాక్రా రుణాలను పూర్తిగా రద్దుచేయాలని వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ డిమాండ్ చేసింది. చంద్రబాబు‌ నాయుడు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రోజునే ఆయన హామీ ఇచ్చినట్టు ఆ రుణాల రద్దుకు సంబంధించిన ఫైలుపైనే తొలి సంతకం చేయాలని పార్టీ కేంద్ర పాలకమండలి సభ్యుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు కోరారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం తనను కలిసిన మీడియా ప్రతినిధులతో ఆయన మాట్లాడారు.

- అధికారంలోకి వస్తే తొలి సంతకంతో వ్యవసాయ రుణాలు మొత్తం రద్దు చేస్తామని ఎన్నికల ప్రచారంలో ఊదరగొట్టిన టీడీపీ నేతలు ఇప్పుడు మీనమేషాలు లెక్కించే ప్రయత్నం చేస్తున్నారు. రుణాల రద్దు గురించి కాకుండా వాటిని కొంతకాలం చెల్లించకుండా వాయిదా వేయించాలన్న అంశం చుట్టే ఆ పార్టీ నేతలు ఆలోచన చేస్తున్నారు. కొద్ది రోజుల్లో కొత్త వ్యవసాయ సీజను ప్రారంభం కానున్న దృష్ట్యా రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పాత రుణాలు రద్దు చేసి కొత్త రుణాలు ఇచ్చేలా చర్యలు చేపట్టాలి. వ్యవసాయ రుణాలు ఏ రూపంలో ఉన్నా రద్దుచేయాలి. వ్యవసాయం కోసమే బంగారంపై తీసుకున్న రుణాలను పక్కన పెట్టడం, 50 వేల లోపేనని ఆంక్షలు విధించడం మానుకోవాలి.

అది దుష్ర్పచారం :

వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీని కొంతమంది ఎమ్మెల్యేలు వీడుతున్నారంటూ జరుగుతున్నదంతా కేవలం అబద్ధపు ప్రచారం మాత్రమే. ఒక రకమైన దుష్ర్పచారం చేస్తూ టీడీపీ నేతలు మైండ్‌గేమ్ ఆడుతున్నారు. ఇలాంటి వాటిని పార్టీ శ్రేణులు ఎవరూ పట్టించుకోవద్దు. ఈ నెల 21న ఇడుపులపాయలో ‌వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి ఏర్పాటు చేసిన ప్లీనరీ సమావేశంలో గెలిచిన, ఓడిన వారందరూ హాజరయ్యారు. సమావేశం తరువాత అందరిలో మునుపటికన్నా మరింత పట్టుదల పెరిగింది. పార్టీ మొదటి ఎన్నికల ప్రయత్నంలో ఓటమి చెందినప్పటికీ సీమాంధ్రలోనే 67 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలను గెలుచుకోగ లిగాం. రాబోయే ఎన్నికలకు పార్టీని ఎలా సంసిద్ధం చేయాలనే ఆలోచన, అంకితభావం తప్ప పార్టీ నేతల్లో మరొక ఆలోచన లేదు. పార్టీని, శ్రీ జగన్మోహన్‌రెడ్డిని వీడి ఏ ఒక్కరూ వెళ్లడానికి సిద్ధంగా లేరు'.

'నేను, మైసూరారెడ్డి టీడీపీలో చేరతామని అడుగుతున్నట్టు కొందరు టీడీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఎక్కడ బాగుంటే అక్కడకు వెళ్లే అలవాటు మాకు లేదు. టీడీపీ నేతలు, ఒక వర్గం మీడియా ఇలాంటి దుష్ర్పచారం చేస్తున్నాయి. ఎన్నికల సంఘం వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీని గుర్తిస్తూ సోమవారం‌ కల్లా లేఖ ఇచ్చే అవకాశం ఉంది. శ్రీ జగన్మోహన్‌రెడ్డి ఇడుపులపాయ నుంచి వచ్చిన తర్వాత హైదరాబాద్‌లో తెలంగాణ పార్టీ ఎమ్మెల్యేల సమావేశం ప్రత్యేకంగా జరుగుతుంది' అని ఉమ్మారెడ్డి చెప్పారు.

Back to Top