నంద్యాలలో అంతిమ విజయం వైయస్సార్సీపీదే

వినుకొండ : నంద్యాల ఉప ఎన్నికల్లో అధికార పార్టీ ఎన్ని మూటలు పంచినా వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీనే అంతిమంగా విజయం సాధిస్తుందని పార్టీ రాష్ట్ర కార్యదర్శి కిలారి వెంకట రోశయ్య అన్నారు. వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి బొల్లా బ్రహ్మనాయుడు నూతన గృహ ప్రవేశ మహోత్సవానికి కిలారు రోశయ్య శనివారం హాజరయ్యారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో రోశయ్య మాట్లాడుతూ ఎన్నికలకు ముందు అలివికాని హామీలను వందల సంఖ్యలో గుర్తించిన చంద్రబాబు అధికారం చేపట్టిన తరువాత వాటి ఊసే మరచాడని ఎద్దేవా చేశారు. అధికారంలోకి వచ్చి మూడేళ్లు గడిచినా ఇప్పటికీ ముచ్చటగా మూడు హామీలను కూడా పూర్తిగా నెరవేర్చలేని పాలకుడిగా చరిత్రలో నిలిచిపోయాడన్నారు. ఇంతటి ఘన చరిత్ర కలిగిన చంద్రబాబు నంద్యాల ఎన్నికల్లో ప్రజల ఓట్లను ఏ మొహం పెట్టుకొని అడగగలరని ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో మాత్రమే నియోజకవర్గాలు గుర్తుకొస్తాయా, నంద్యాల వైపు కన్నెత్తి చూడని అధికార పార్టీ నాయకులు ఉప ఎన్నికల నేపథ్యంలో కట్టకట్టుకొని అక్కడ వాలిపోయారని, అడిగిన ప్రతి పనిని కాదనకుండా చేస్తామంటూ వరాలు కురిపిస్తున్నారన్నారు. ఎన్నికలు ముగిస్తే ఇచ్చిన వరాలు మురిగిపోవటం ఖాయమని జోస్యం చెప్పారు. చంద్రబాబు ఎంత మంది మంత్రులను, ఎమ్మెల్యేలను నంద్యాలకు దిగుమతి చేసినా వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీయే విజయకేతనం ఎగురవేస్తుందన్నారు. ఆయన వెంట పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.

Back to Top