ఉద్యోగులపై దాడులు...యూనియన్ నాయకులకు కానుకలు..!

హైదరాబాద్ : చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉద్యోగుల విషయంలో రెండు కళ్ల సిద్దాంతం పాటిస్తోంది. కొందరు యూనియన్ నాయకుల్ని గుప్పిట్లో పెట్టుకొని ఆడింది ఆట పాడింది పాట గా వ్యవహరిస్తోంది. దీంతో ఉద్యోగుల వైపు నిలుద్దామని ఇతర యూనియన్ నాయకులు ప్రయత్నించినా కానీ, చివరకు ప్రభుత్వ పంతమే నెగ్గుతోంది.
మొన్నటికి మొన్న ఇసుక మాఫియాను అడ్డుకొనేందుకు మహిళా తహశీల్దార్ వనజాక్షి ప్రయత్నించారు. ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ తన అనుచరులతో కలిసి ఆమె పై దాడి చేయించారు. అందరి ఎదుట జుట్టు పట్టించి ఇసుకలోకి దొర్లించారు. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు నిరసన తెలిపారు. ఆందోళనలు చేశారు. వెంటనే ముఖ్యమంత్రి రంగంలోకి దిగారు. ఉద్యోగ సంఘాల నాయకులతో మంత్రుల్ని పంపించి రాయబారం నడిపారు. ఐఎఎస్ అధికారితో విచారణ జరిపిస్తామన్న కంటి తుడుపు హామీ తో సరిపెట్టేశారు. తర్వాత జరిగిన మంత్రి మండలి సమావేశంలో మరింతగా బిగించేశారు. అసలు తప్పంతా వనజాక్షిదే అని, ఆమె సరిహద్దులు దాటడం వల్లనే సమస్య తలెత్తిందని క్యాబినెట్ లో తీర్మానించేశారు. మహిళలపై దాడులు చేయించిన చింతమనేని కి క్లీన్ చిట్ ఇచ్చేశారు.
చిత్తూరు జిల్లా లో మహిళా తహశీల్దార్ నారాయణమ్మ మీద టీడీపీ సర్పంచ్ నేరుగా దాడులకు దిగారు. దుర్భాషలాడుతూ బెదిరించారు. దీనిపై ఆమె ఫిర్యాద చేసినా ఏమీ ఉపయోగం లేకుండా పోయింది.
ఇప్పుడు గుంటూరు జిల్లా మంగళగిరిలో తెలుగుదేశం రియల్ ఎస్టేట్ మాఫియా రెచ్చిపోయింది. అక్రమ కట్టడాలు కట్టడమే కాకుండా అదేమని అడిగిన రెవిన్యూ సిబ్బంది మీద దాడులు చేసింది. కొట్టవద్దని చేతులెత్తి మొక్కుతున్నా, పట్టించుకోకుండా కొట్టి కొట్టి వదిలి పెట్టారు. అయినా సరే, టీడీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు.
మొత్తం మీద చంద్రబాబు నాయుడు మాత్రం తన పార్టీ శ్రేణులకు ఇదే సందేశాన్ని అందించారు. ఉద్యోగుల మీదే కాదు, ఎవరి మీద దాడులు చేసినా చర్యలు ఉండబోవన్న సంకేతాన్ని పంపిస్తున్నారు. ఉద్యోగ సంఘాల్లోని కొందరిని అదుపులోకి తెచ్చుకొని వాళ్ల సాయంతో ఎటువంటి ఆందోళనలు తలెత్తకుండా దిద్దుబాటు చర్యలు తీసుకొంటున్నారు. దీంతో ఉద్యోగులకు రక్షణ లేని వాతావరణం నెలకొంది.

Back to Top