ఉద్యోగం లేదు.. ఉపాధీ లేదు

వెంకట్రామన్న గూడెం, 21 మే 2013:

‘చదువు చెప్పించడం ఎంత ముఖ్యమో, చదివిన తర్వాత వారికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడం కూడా అంతే ముఖ్యం. ఉద్యోగాలు కల్పించే బాధ్యతను ప్రభుత్వమే తీసుకోవాలి. మరో ఆరు నెలలు లేదా ఏడాదిలో మన ప్రభుత్వం వస్తుంది. అప్పుడు అందరి చదువులకు, ఉద్యోగాలకు సాయం అందుతుంది’ అని శ్రీమతి వైయస్ షర్మిల చెప్పారు. దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి సోదరి అయిన శ్రీమతి షర్మిలను సోమవారం పశ్చిమగోదావరి జిల్లా వెంకట్రామన్నగూడెంలోని వైఎస్సార్ ఉద్యాన వర్సిటీ విద్యార్థులు కలిసి.. ‘‘యూనివర్సిటీ నుంచి ఇప్పటికి 400 మంది హార్టికల్చర్ డిగ్రీలు తీసుకుని బయటకు వెళ్లారు. కానీ ఒక్కరికీ ఉద్యోగం రాలేదు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి యూనివర్సిటీకి వచ్చి మాతో మాట్లాడినపుడు ఈ విషయం చెబితే.. ఉద్యోగాల కోసం ఎదురుచూడకుండా నర్సరీలు పెట్టుకోమని సలహా ఇచ్చారు. ఈ వర్సిటీకి వైయస్ఆర్ పేరు పెట్టడం వల్లే ప్రభుత్వం ఉద్యోగావకాశాలు కల్పించకుండా నిర్లక్ష్యం చేస్తోంది’’ అని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శ్రీమతి షర్మిల మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు.

పట్టించుకోవడం లేదు..
ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సలహా ఇచ్చినట్లు నర్సరీలు పెట్టుకుందామనుకున్నా.. అందులో చాలా నష్టాలు వస్తున్నాయని, ఆయన చెప్పింది ఎలా సాధ్యమని పి.సంతోష్ అనే విద్యార్థి షర్మిల వద్ద ఆవేదన వ్యక్తంచేశాడు. ‘దివంగత రాజశేఖర రెడ్డి యూనివర్సిటీని దేశంలోనే రెండోదిగా ఏర్పాటు చేశారు. ఇందులో చదువుకుని దేశానికి ఉపయోగపడదామనుకుంటే ఎవరూ సహాయం చేయడం లేదు. ధర్నాలు చేసినా పట్టించుకోవడంలేదు’’ అని వి.నాయక్ అనే మరో విద్యార్థి అన్నాడు. గత సంవత్సరం నెలరోజుల పాటు ధర్నా చేస్తే సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చి పట్టించుకోలేదని తెలిపాడు. అన్ని శాఖల్లోనూ పోస్టులను భర్తీ చేస్తున్న ప్రభుత్వం ఉద్యాన శాఖలో మాత్రం కొన్నేళ్లుగా ఒక్క పోస్టు కూడా భర్తీ చేయలేదని ఎం.సుందర్ రెడ్డి వాపోయాడు. హార్టికల్చర్ ఆనర్స్ కోర్సుకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉందని యూనివర్సిటీ పీఆర్‌ఓ రత్నకిషోర్ షర్మిలకు వివరించారు. హార్టికల్చర్‌ను సివిల్స్‌లో ఒక సబ్జెక్టుగా పెట్టాలని ప్రతిపాదన కూడా పంపామని తెలిపారు. దీనిపై షర్మిల స్పందిస్తూ ‘ఈ చదువులకు మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు కదన్నా. మరి ఎందుకు ఉద్యోగాలు రావడంలేదు’ అని ప్రశ్నించారు. ఉద్యోగాలకు వచ్చే నెలలో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని ఆయన సమాధానమిచ్చారు. దీనిపై ఎక్కడ ఉద్యోగావకాశాలు ఉన్నాయని ఆమె ప్రశ్నించగా గుజరాత్ తదితర రాష్ట్రాల్లో అవకాశాలు ఉన్నాయన్నారు. ‘‘మన విద్యార్థులు అక్కడికి వెళితే ఆ ప్రభుత్వం ఉద్యోగావకాశాలు ఇవ్వదుకదన్నా. వారి ఆశలు, ఆకాంక్షలకు తగినట్లుగా ప్రభుత్వం వారికి అవకాశాలు కల్పించాలి. జగనన్న వచ్చిన తర్వాతఅవన్నీ చేస్తారు’’ అని హామీ ఇచ్చారు.

తాజా ఫోటోలు

Back to Top