ధరూర్ (పాలమూరు జిల్లా), 28 నవంబర్ 2012: వచ్చే రోజుల్లో ఉచిత విద్యుత్ పథకాన్ని కిరణ్ ప్రభుత్వం ఎత్తేసినా ఆశ్చర్యం లేదని షర్మిల వ్యాఖ్యానించారు. రూ. 100 కోట్లతో గద్వాలలో మంచినీటి సమస్యను పరిష్కరించాలని దివంగత మహానేత వైయస్ సంకల్పించారన్నారు. రూ. 1200 కోట్లతో నెట్టెంపాడు ప్రాజెక్టును వైయస్ 75 శాతం పూర్తి చేస్తే మిగతా కొద్దిపాటి పనులు చేయడానికి ఈ ప్రభుత్వానికి తీరిక దొరకడంలేదని దుయ్యబట్టారు. తన మీద విచారణ జరిపిస్తారన్న భయంతోనే ప్రభుత్వంపై చంద్రబాబు అవిశ్వాసం పెట్టడంలేదని ఆరోపించారు. రాష్ట్రంలో మద్యం మాఫియా నడిపిస్తున్న బొత్సపై విచారణ జరగడంలేదని షర్మిల విమర్శించారు. బొత్స బినామీ మద్యం దుకాణాలపైన విచారణ చేయలేదేమని ప్రశ్నించారు. ఎసిబి కూడా బొత్సకు వంతపాడిన వైనాన్ని ఆమె ప్రస్తావించారు. చిరంజీవి తన పార్టీని హోల్‌సేల్‌గా కాంగ్రెస్‌కు అమ్మేశారని ఆరోపించారు. చిరంజీవి బంధువుల ఇంటిలో రూ. 80 కోట్లు దొరికినా ఎందుకు దర్యాప్తు చేయలేదని నిలదీశారు. చంద్రబాబు తీరు పులినిచూసి నక్క వాత పెట్టుకున్న చందంగా ఉందని, అయితే పులి పులే... నక్క నక్కే.. అని ఆమె అభివర్ణించారు. వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్‌రెడ్డి తరఫున మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర చేస్తున్న ఆయన సోదరి షర్మిల బుధవారంనాడు మహబూబ్‌నగర్ జిల్లా గద్వాల నియోజయవర్గంలోని ధరూర్‌లో నిర్వహించిన సభలో మాట్లాడారు.
నియోజకవర్గ ప్రజలకు మంచినీరు కూడా సరఫరా చేయలేని మంత్రి డి.కె. అరుణకు ఆ పదవిలో కొనసాగే అర్హత లేదని షర్మిల తీవ్రస్థాయిలో వ్యాఖ్యానించారు. మంత్రి అరుణకు చిత్తశుద్ధి లేని కారణంగానే గద్వాలకు తాగునీటిని అందించాల్సిన పథకం మూలన పడిందని దుయ్యబట్టారు. ఈ ప్రభుత్వ హయాంలో రైతులకు అప్పులు తప్ప ఇంకేమీ మిగలలేదని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. వైయస్ ప్రవేశపెట్టిన అన్ని పథకాలకూ కిరణ్ ప్రభుత్వం పాతరేస్తోందని నిప్పులు చెరిగారు. బీసీ మంత్రి మోపిదేవిని జైలులో పెట్టించిన ప్రభుత్వం ధర్మానకు మద్దతుగా నిలవడమేమిటని నిలదీశారు. ధర్మానను విచారణ చేయాల్సిన అవసరమే లేదని కాంగ్రెస్ మంత్రివర్గం, సిఎం చెప్పడం ఎక్కడి న్యాయం అన్నారు. ఎసిబి, సిబిఐ, ఇడి, ఐటి శాఖలు కాంగ్రెస్ చేతిలో కీలుబోమ్మలుగా వ్యవహరిస్తున్నాయని షర్మిల ఎద్దేవా చేశారు.
లక్షలాది కోట్ల రూపాయల విలువైన కేజీ బేసిన్‌ను చంద్రబాబు హయాంలోనే రిలయన్సుకు అప్పనంగా కట్టబెట్టేశారని షర్మిల విరుచుకుపడ్డారు. చంద్రబాబు అవినీతిపై కాంగ్రెస్ ప్రభుత్వం విచారణకు ఆదేశించదని, దానికి ప్రతిఫలంగానే చంద్రబాబు ఈ అసమర్ధ, ప్రజా వ్యతిరేక ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టడంలేదని దుయ్యబట్టారు. అవిశ్వాసం పెట్టమని మేం ఎన్నిసార్లు అడుగుతున్నా చంద్రబాబు పట్టనట్లు వ్యవహరిస్తున్నారన్నారు. విశ్వసనీయత అంటే చంద్రబాబుకు ఈ జన్మలో అర్థం కాదని ఎద్దేవా చేశారు. రెండెకరాల చంద్రబాబుకు ఇప్పుడు ఇన్ని వేల కోట్ల రూపాయల విలువైన ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయని షర్మిల నిలదీశారు.
జగనన్న కాంగ్రెస్ పార్టీలోనే ఉండి ఉంటే ఇప్పుడు ఇన్ని కష్టాలు వచ్చేవి కావని ఢిల్లీలోని కాంగ్రెస్ పెద్దలు చెబుతున్నారని, ఇంకా కేంద్రమంత్రి, ఆపైన ముఖ్యమంత్రి కూడా అయ్యేవారని వారు అంటున్న విషయాన్ని షర్మిల ఉటంకించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు అవసరం అయితే ఒకలా లేకపోతే మరోలా చూస్తారా? అని నిలదీశారు.
ఉదయించే సూర్యుడ్ని, జగనన్ననూ ఎవరూ ఆపలేరన్నారు. కోటి ఎకరాలకు సాగునీరు ఇవ్వాలని, గుడిసెలు లేని రాష్ట్రం కావాలన్నవైయస్ కలను జగనన్న నెరవేరుస్తారని అన్నారు. రూ.3 వేల కోట్లతో వ్యవసాయ స్థిరీకరణ నిధితో రైతులను ఆదుకుంటారని చెప్పారు. అంతకు ముందు షర్మిల ధరూర్ ఉన్న మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి, పాలతో అభిషేకం చేసి, పూలమాల వేసి నివాళులు అర్పించారు.