ఉచిత విద్యుత్‌కు మంగళం పాడితే తస్మాత్

హైదరాబాద్, 9 ఏప్రిల్‌ 2013: వ్యవసాయానికి అందించే ఉచిత విద్యుత్‌ పథకాన్ని ఎత్తివేస్తే ఊరుకోబోమని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ శాసనసభాపక్షం హెచ్చరించింది. ఆ పథకానికి తూట్లు పొడిచే ప్రయత్నాలు చేసినా, నిర్వీర్యం చేయాలని చూసినా ప్రతిఘటిస్తామని, రైతుల తరఫున పోరాటం చేస్తామని స్పష్టం చేసింది. రైతుల సంక్షేమం కోసం దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైయస్ రాజశేఖరరెడ్డి ప్రారంభించిన ఉచిత విద్యు‌త్ పథకానికి తూట్లు పొడిచేందుకు కాంగ్రె‌స్ ప్రభుత్వం ప్రయత్నించడాన్ని పార్టీ తీవ్రంగా ఖండించింది. వై‌యస్‌ఆర్‌ కాంగ్రెస్‌ శాసనసభా పక్షం ఉప నాయకులు మేకతోటి సుచరిత, ధర్మాన కృష్ణదాస్, భూమా శోభా‌ నాగిరెడ్డి సోమవారం విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో ఈ హెచ్చరిక చేశారు.

కొత్త కొత్త నిబంధనలు తెరపైకి తేవడం ద్వారా ఉచిత విద్యుత్ పథకాన్ని నిర్వీర్యం చేయ‌డంతో పాటు లక్షలాది కనెక్షన్లు రద్దు చేయడానికి సన్నాహాలు చేస్తోందని ఆ ప్రకటనలో వారు పేర్కొన్నారు. ఉచిత విద్యుత్ కనెక్షన్లు రద్దు చేయడమే కాకుండా రై‌తుల నుంచి పాత బకాయిల పేరిట వసూళ్లకూ దిగడం సిగ్గుచేటు అని విమర్శించారు. పేద రైతాంగానికి ఇప్పటికే నోటీసులు జారీ చేయడం రాష్ట్ర ప్రభుత్వ దివాళాకోరుతనానికి నిదర్శనమని, దీనివల్ల ఒక్కొక్క రైతుపై రూ. 15 వేల భారం పడుతుందని వారు పేర్కొన్నారు. పాత బకాయిలు చెల్లించాలని నోటీసులు జారీ చేయడమే కాకుండా 2004 సంవత్సరం నుంచి సర్వీస్ చార్జీలు రాబట్టాలని‌ కిరణ్‌ ప్రభుత్వం చూస్తోందన్నారు.

పాత బకాయిలు చెల్లించకపోతే విద్యుత్ కనెక్షన్లు తొలగిస్తామని, కేసులు నమోదు చేస్తామని ప్రభుత్వం హెచ్చరించడాన్ని‌ వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ నాయకులు తప్పుపట్టారు. రైతులకు గొడ్డలిపెట్టుగా మారిన బకాయిల వసూళ్లను నిలిపివేయాలని, ఉచిత విద్యుత్ కనెక్షన్ల తొలగింపు ఆలోచనను విరమించుకోవాలని, 2009 ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన విధంగా రైతాంగానికి 9 గంటల‌ పాటు విద్యుత్ సరఫరా చేయాలని వారు డిమాండ్ చేశారు.‌

తాజా ఫోటోలు

Back to Top