త్వరలో మళ్ళీ షర్మిల పాదయాత్ర ప్రారంభం

హైదరాబాద్‌, 26 జనవరి 2013 : వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి సోదరి శ్రీమతి షర్మిల 'మరో ప్రజా ప్రస్థానం' పాదయాత్ర త్వరలో ప్రారంభం కానున్నది. ఆమె పాదయాత్రపై ఒకటి రెండు రోజుల్లో నిర్ణయం తీసుకోనున్నట్లు పార్టీ సలహాదారు డి.ఎ. సోమయాజులు స్పష్టం చేశారు. మోకాలికి కీ హోల్ శస్త్ర చికిత్స చేయించుకున్న శ్రీమతి షర్మిలను వైద్యులు రెండు రోజుల్లో పరీక్షిస్తారని, ఆమె నడవడంపై వారు తమ అభిప్రాయాన్ని వెల్లడిస్తారని సోమయాజులు శుక్రవారంనాడు మీడియా ప్రతినిధులకు చెప్పారు.

శ్రీమతి షర్మిల ఆరోగ్యంపైన, పాదయాత్ర చేయవచ్చని వైద్యులు సంతృప్తి వ్యక్తం చేస్తే ఆమె మరో ప్రజాప్రస్థానం ప్రారంభం అవుతుందని సోమయాజులు తెలిపారు. ఈ క్రమంలో శ్రీమతి షర్మిల మళ్ళీ పాదయాత్ర ప్రారంభించడానికి మరో వారం లేదా పది రోజులు సమయం పట్టవచ్చని ఆయన అన్నారు.

రంగారెడ్డి జిల్లాలో పాదయాత్ర చేస్తుండగా శ్రీమతి షర్మిల మోకాలికి గాయం తగిలింది. దీనితో మరో ప్రజాప్రస్థానానికి బ్రేక్‌ పడింది. మోకాలికి తగిలిన గాయం కారణంగా ఆమెకు కీ హోల్‌ శస్త్ర చికిత్స జరిగింది. శస్త్ర చికిత్స చేయించుకున్న అనంతరం శ్రీమతి షర్మిల ఫిజియో థెరపీ చేస్తున్నారు. పాదయాత్ర నిలిచిపోయే నాటికి ఆమె రాయలసీమలోని కడప, అనంతపురం, కర్నూలు జిల్లాల్లోను, తెలంగాణలోని మహబూబ్‌నగర్‌ జిల్లాలో పాదయాత్ర పూర్తి చేసి రంగారెడ్డి జిల్లాలో కొనసాగిస్తున్నారు.

Back to Top