పేదవాడి గుండెచప్పుడు వైయస్ఆర్

  • అన్ని వర్గాల ప్రజలను ఆదుకున్న మహానేత
  • హైదరాబాద్ లో తెలంగాణ వైయస్సార్సీపీ ప్లీనరీ
  • 31 జిల్లాల నుంచి తరలివచ్చిన పార్టీ శ్రేణులు
  • వైయస్ జగన్ నాయకత్వంలో పార్టీ బలోపేతం కోసం కృషి
  • వైయస్సార్సీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి
హైదరాబాద్ః తెలంగాణను ఎన్ని సర్కార్ లు పాలించినా, ఎంతమంది వెన్నుపోటు దారులు వచ్చిపోయినా...ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన వ్యక్తి మహానేత, దివంగత ముఖ్యమంత్రి డా. వైయస్ రాజశేఖరరెడ్డి అని తెలంగాణ వైయస్సార్సీపీ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రం బతికున్నంత కాలం వైయస్ఆర్ ప్రతి ఒక్కరి హృదయాల్లో బతికే ఉంటారని చెప్పారు.  తెలంగాణ వైయస్సార్సీపీ రాష్ట్ర ప్లీనరీ సమావేశం హైదరాబాద్ చంపాపేటలోని సామ నర్సింహారెడ్డి ఫంక్షన్ హాల్ లో ఘనంగా జరిగింది. పార్టీ తెలంగాణ శాఖ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ ప్లీనరీకి తెలంగాణలోని 31 జిల్లాల నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. వైయస్సార్సీపీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి రాజకీయ కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ప్లీనరీకి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మహానేత, దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. 

అనంతరం గట్టు శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ...ప్లీనరీకి తరలివచ్చిన పార్టీ ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, అధ్యక్షులు వైయస్ఆర్, వైయస్ జగన్ అభిమానులు, కార్యకర్తలు వివిధ జిల్లాల నుంచి వచ్చిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదములు తెలిపారు. తెలంగాణ రాష్ట్రానికి దేశంలోనే ప్రత్యేకస్థానం ఉందంటే అది వైయస్ఆర్ ఘనతేనని శ్రీకాంత్ రెడ్డి అన్నారు. ప్రతీ పేదవాడి గుండెచప్పుడు వైయస్ఆర్ అని అన్నారు. ఆయన చేపట్టిన సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయన్నారు. కార్మికుడు, కర్షకుడు, అక్కాచెల్లెల్లు, కూలీ నాలీ అన్ని వర్గాల ప్రజలకు లబ్ది చేకూర్చిన నాయకుడు వైయస్ఆర్ అని కొనియాడారు. రైతు, మహిళ, విద్యార్థి, వృద్ధుడికి ఆసరాగా నిలిచి సమాజాన్ని బలోపేతం చేశారని పేర్కొన్నారు. 

ఈ ప్రపంచంలోనే ఎక్కడా లేనివిధంగా మహిళలకు పావలా వడ్డీ ఇచ్చిన ఘనత వైయస్ఆర్ ద అని శ్రీకాంత్ రెడ్డి అన్నారు. ప్రతీ కుటుంబాన్ని తన కుటుంబంగా భావించి  ఇంటికి పెద్దదిక్కుగా ఉన్నారన్నారు.  వైయస్ఆర్ ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్ మెంట్ పథకం  లక్షలాది మంది విద్యార్థులకు బంగారు బాట వేసిందన్నారు. వైయస్ఆర్ చలవ వల్ల ఇవాళ ఎంతోమంది ఇంజినీర్లుగా, డాక్టర్లుగా ఇతర వృత్తులలో కొనసాగుతున్నారన్నారు. ఆవిధంగా విద్యార్థుల తల్లిదండ్రుల కళ్లలో వైయస్ఆర్ వెలుగులు నింపారన్నారు.  రైతన్నకు చేతినిండా పనికల్పించారని గుర్తు చేశారు. రైతులకు ఉచిత కరెంటు,  గిట్టుబాటు ధర, రుణమాఫీ చేసిన ఘనత వైయస్ఆర్ ది అని శ్రీకాంత్ రెడ్డి చెప్పారు రూ. 2 కిలో బియ్యం ఇచ్చి పేదవాడి కడుపునింపారన్నారు. దేశంలోనే ప్రతీ పార్టీకి వైయస్ఆర్ దిక్సూచిగా మారారని శ్రీకాంత్ రెడ్డి స్పష్టం చేశారు. వైయస్ఆర్ ఆశయ సాధన  కోసం జగనన్న నాయకత్వంలో తెలంగాణలో పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేద్దామని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
Back to Top