ఏపీలో ట్రంప్ పాలన

  • వైయస్ జగన్ ను చూస్తేనే చంద్రబాబుకు దడ
  • ప్రభుత్వంలో అధికారులు కీలుబొమ్మలుగా మారడం బాధాకరం
  • బాబు సలహామేరకు పోలీసులు పనిచేయడం వ్యవస్థకే మాయని మచ్చ
  • ప్రభుత్వం ఎన్ని అక్రమ కేసులు పెట్టినా భయపడం
  • వైయస్ జగన్ సైనికులుగా ప్రజలకు అండగా ఉంటాం
  • చంద్రబాబు నిరంకుశ వైఖరిపై న్యాయపోరాటం చేస్తాం
  • వైయస్సార్సీపీ విజయవాడ నగర అధ్యక్షుడు వెల్లంపల్లి శ్రీనివాస్
విజయవాడః అమెరికాలో ట్రంప్ మాదిరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నిరంకుశ పాలన సాగిస్తున్నారని వైయస్సార్సీపీ విజయవాడ నగర అధ్యక్షుడు వెల్లంపల్లి శ్రీనివాస్ మండిపడ్డారు. వైయస్ జగన్ ను చూస్తేనే చంద్రబాబుకు దడ పుడుతోందని వెల్లంపల్లి అన్నారు. బస్సు ప్రమాద బాధితులను పరామర్శించడానికి వచ్చిన ప్రధాన ప్రతిపక్ష నాయకుడు వైయస్ జగన్ ను టీడీపీ నాయకులు, అధికారులు ఎన్ని ఇబ్బందులు పెట్టారో ప్రజలు అందరూ చూశారని చెప్పారు.  అమాయకుల ప్రాణాలు బలిగొన్న టీడీపీ ఎంపీ ట్రావెల్స్ మీద యాక్షన్ తీసుకోకుండా..ప్రజల కోసం పోరాడుతున్న తమ నాయకునిపై ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించడం దుర్మార్గమన్నారు. దానికి నిరసనగానే నిన్న రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు చేశామని చెప్పారు. తమ అధినేతపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని శాంతియుతంగా నిరసన తెలుపుతున్న మమ్ముల్ని అరెస్ట్ చేయడమేగాకుండా, ఇంకో అక్రమ కేసు బనాయించడంపై మండిపడ్డారు. తక్షణమే అక్రమ కేసులను ఉపసంహరించుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 

ఢిల్లలో జంతర్ మంతర్, హైదరాబాద్ ఇందిరాపార్కు మాదిరి విజయవాడలో ధర్నా చౌక్ లో నిరసన కార్యక్రమాలు చేయడం సహజమని వెల్లంపల్లి పేర్కొన్నారు. శాంతియుత నిరసన దీక్షకు పోలీసులు పర్మిషన్ ఇచ్చినట్టే ఇచ్చి తమపై దౌర్జన్యం చేయడం దారుణమన్నారు. ధర్నా చౌక్ కు వచ్చిన వితిన్ సెకన్ లోనే పర్మిషన్ లేదని చెప్పి  పశువులను తీసుకెళ్లినట్టు వ్యాన్ లో తనతో పాటు 20మంది వైయస్సార్సీపీ నేతలను 60 కి.మీ. తీసుకెళ్లారని వెల్లంపల్లి పోలీసుల దుశ్చర్యపై ధ్వజమెత్తారు. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 11గంటలదాకా పోలీస్ స్టేషన్ లో తమను హింసించారని, నైట్ వరకు హైడ్రామా నడిపి భయబ్రాంతులను చేయాలని చూశారని చెప్పారు. పర్మిషన్ ఇవ్వడం లేదని ముందే చెప్పొచ్చుగదా...? అప్పటికప్పుడు లేదని చెప్పి అరెస్ట్ చేయడమేంటి. మేం ఏం తప్పు చేశామని ఈవిధంగా చేస్తున్నారు..? పోలీసులు ప్రజలను కాపాడాలి గానీ ప్రభుత్వ తొత్తులుగా పనిచేయొద్దని వెల్లంపల్లి హితవు పలికారు.  మేం ఏం చేశామని ఇంతగా చేస్తున్నారని నిలదీశారు. క్షతగాత్రులకు నష్టపరిహారం ఎక్కువగా ఇవ్వమనడం తప్పా..? యాజమాన్యాన్ని శిక్షించాలని కోరడం తప్పా..? న్యాయవిచారణ చేయమనడం తప్పా..? ఎందుకు తమను అక్రమంగా అరెస్ట్ చేశారో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

ఏసీపీ శ్రావణి ప్రెస్ మీట్ పెట్టి తాము ఎస్సైపై దౌర్జన్యం చేశామని మాట్లాడడం, నోటీసులు ఇవ్వడం అన్యాయమన్నారు. ఎస్సై ప్రసాద్ అనే వ్యక్తే తన వద్దకు రాలేదని వెల్లంపల్లి స్పష్టం చేశారు.  చంద్రబాబు ప్రభుత్వంలో కీలుబొమ్మలా మారి ఓ ఐపీఎస్ అధికారి ఇలా అబద్ధాలు చెప్పడం బాధాకరమన్నారు. సెక్షన్  151, 353 కేసులు పెట్టి తమను భయపెట్టాలని చూస్తున్నారని, ప్రజల కోసం ఎన్ని కేసులు పెట్టినా సిద్ధమని అన్నారు. నగర అధ్యక్షుడిగా తాను చురుకుగా పనిచేస్తున్నాననే తనను అణగదొక్కాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందని వెల్లంపల్లి ధ్వజమెత్తారు.  ప్రభుత్వసలహా మేరకు పోలీసులు పనిచేయడం బాధాకరమన్నారు. తప్పుడు కేసులతో భయపెట్టడం ప్రజాస్వామ్యాన్ని అరికట్టడమేనని అన్నారు. జరిగిన అన్యాయాన్ని ప్రజలకు తెలియజేయాలి, జగన్ పై కేసులు ఎత్తివేయాలని కోరితే తనపై ఇంకో అక్రమ కేసు పెట్టడం దారుణమని అన్నారు. ఎవరిని దుర్భాషలాడకపోయినా తప్పుడు కేసులు బనాయించారని ప్రభుత్వ తీరును ఎండగట్టారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలపడం హక్కు అని, పోరాటం చేయకపోతే దేశానికి స్వాతంత్ర్యం వచ్చేదా..? అని ప్రభుత్వాన్ని నిలదీశారు. 

ప్రతి ఒక్కరిని టార్గెట్ చేసి మరి ప్రభుత్వం కక్షసాధింపుకు పాల్పడుతోందని వెల్లంపల్లి మండిపడ్డారు.  పోలీసులు నిజాయితీగా పనిచేయకపోతే వ్యవస్థకే మచ్చ అని అన్నారు. తమ నాయకుడితో పాటు పార్టీ నేతలపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలన్నారు. అప్పటిదాకా ప్రజల తరపున న్యాయపోరాటం చేస్తామన్నారు.  చంద్రబాబు మీటింగ్ లకు, మహిళా సదస్సుకు ఇంటర్ మీడియట్ పిల్లలను తీసుకెళ్తారు..? వారి చదువులను డిస్ట్రబ్ చేస్తారు..? ధర్నా చౌక్ వద్ద ఎలాంటి సెంటర్ లు లేకున్నా.. తమ ధర్నాకు ఇంటర్ ఎగ్జామ్స్ ఉన్నాయని సాకుగా చూపుతారా..? మీ అవసరం కోసం పిల్లలను బలిపశువులుగా వాడుకుంటారా..? అదే పిల్లల ద్వారా ప్రతిపక్షాలను అడ్డుకోవాలని చూస్తారా..? అని చంద్రబాబు ప్రభుత్వంపై వెల్లంపల్లి నిప్పులు చెరిగారు. వైయస్ జగన్ సైనికులుగా ప్రజలకు అండగా ఉంటామని,  వారికి జరిగే అన్యాయాలను నిలదీస్తామని వెల్లంపల్లి పేర్కొన్నారు. తాము తప్పు చేస్తే కేసు పెట్టండి.  అంతేగానీ ప్రజాసమస్యలపై పోరాడుతుంటే కేసులు పెడితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు.  
Back to Top