అన్నదాతలకు కొండంత అండ వైఎస్సార్...!

రైతులు అధైర్యపడొద్దు..రాజన్న రాజ్యం వస్తుంది..!
వరంగల్ః అన్నదాతలకు అండగా నిలిచిన నాయకుడు మహానేత వైఎస్. రాజశేఖర్ రెడ్డి అని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ఖమ్మం ఎంపీ  పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని మండిపడ్డారు. రుణమాఫీ ఒకేసారి కాకుండా విడతల వారీగా విడుదల చేయడమే ఆత్మహత్యలకు కారణమన్నారు. వరంగల్ జిల్లాలో  పార్టీ నాయకురాలు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల పరామర్శ యాత్ర ముగిసిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.  రైతులు అధైర్యపడొద్దని , వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.  రైతులకు ధైర్యం చెప్పేందుకు వైఎస్సార్సీపీ ప్రణాళికలు రూపొందిస్తుందని..త్వరలోనే మళ్లీ రాజన్న రాజ్యం వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

పరామర్శయాత్రలో షర్మిల ఆరడుగుల ఇళ్లు కూడా లేనివారిని చూసి  చలించిపోయారని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆవేదన చెందారు. వైఎస్. రాజశేఖర్ రెడ్డి ఉంటే పక్కాగృహాలు వచ్చేవని పేద ప్రజలు అనుకుంటున్నారని పొంగులేటి తెలిపారు. రాజశేఖర్ రెడ్డి మరణించి ఆరేళ్లయినా ఆయన పేదలకోసం చేపట్టిన సంక్షేమ పథకాలే ప్రజల గుండెల్లో నిలిపాయని పేర్కొన్నారు. మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి మృతిని తట్టుకోలేక వరంగల్ జిల్లాలోనే అత్యధికులు చనిపోయారని స్పష్టం చేశారు.  
Back to Top