శివారెడ్డిని చంపించింది పరిటాల కుటుంబీకులే

శ్రీరామ్, మహేంద్ర, మురళిల పేర్లు ఎఫ్‌ఐఆర్‌లో చేర్చాలి
స్థానిక సీఐ.. మంత్రికి తొత్తుగా వ్యవహరిస్తున్నాడు
తక్షణమే సీఐని సస్పెండ్‌ చేయాలి
బాధిత కుటుంబానికి న్యాయం చేయాలి
ఎస్పీ ఆఫీస్‌ ఎదుట తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి నిరసన

రాప్తాడు: పరిటాల కుటుంబీకులే వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్త శివారెడ్డిని హత్య చేయించారని  రాప్తాడు నియోజకవర్గ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి అన్నారు. హత్యతో మంత్రి పరిటాల సునీత కుమారుడు శ్రీరామ్‌కు సంబంధం ఉందని మృతుడి కుమారుడు ఫిర్యాదు చేసినా పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో పేరు నమోదు చేయలేదని మండిపడ్డారు. రాప్తాడు నియోజకవర్గం కందుకూరులో వైయస్‌ఆర్‌ సీపీ కార్యకర్త శివారెడ్డిని టీడీపీ నేతలు వేట కొడవళ్లతో హత్య చేసిన విషయం విధితమే. ఈ మేరకు హత్యకు సంబంధించిన వారిపై కేసు నమోదు చేయ‌కుండా స్థానిక సీఐ పరిటాల కుటుంబానికి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ ఎస్పీ కార్యాలయం ఎదుట తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి నిరసనకు దిగారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పరిటాల శ్రీరామ్, కందుకూరు మండల ఇన్‌చార్జి పరిటాల మహేంద్ర, మంత్రి సోదరుడు ధర్మవరపు మురళిలకు హత్యతో సంబంధం ఉన్నా.. పోలీసులు వారిని తప్పించే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. 
బాలుతో ప్రాణహాని ఉందన్నా...
బాలు అనే ఒక నేరస్తుడిని స్థానిక టీడీపీ నాయకుడిగా చలామణి చేస్తున్నారన్నారు. గ్రామంలో పది మందిపై దాడి చేసినా.. ఇద్దరు మహిళలపై అత్యాచారాలకు పాల్పడినా పోలీసులు పట్టించుకోవడం లేదన్నారు. బాలుతో ప్రాణహాని ఉందని శివారెడ్డి పోలీసులకు చెప్పినా ఎలాంటి రక్షణ కల్పించలేదని విరుచుకుపడ్డారు. టీడీపీ నేతలు ఎంతటి అఘాయిత్యాలకు పాల్పడినా... పరిటాల మహేంద్ర ఆదేశాలతో సీఐ పది నిమిషాలకే బయటకు పంపిస్తున్నాడన్నారు. అదే విధంగా మంత్రి తమ్ముడు మురళి ఎంపీపీ దగ్గుపాటి ప్రసాద్‌ పేరుతో కురుమ, కుర్వల భూములను రూ. 5, 10 వేలకు సీఐ బ్రోకర్‌ మాదిరి కొనుగోలు చేయిస్తున్నాడన్నారు. ఇలాంటి వ్యక్తులతో  సామాన్యుల‌కు ఎలా ర‌క్ష‌ణ ల‌భిస్తుంద‌ని  ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తక్షణమే సీఐని సస్పెండ్‌ చేయాలని, హత్యతో సంబంధం ఉన్న పరిటాల శ్రీరామ్, మహేంద్ర, మురళి పేర్లు ఎఫ్‌ఐఆర్‌లో చేర్చాలని డిమాండ్‌ చేశారు.
Back to Top