తిరుపతిలో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్ ఆందోళన

తిరుపతి‌, 8 జూన్‌ 2013:

పాత తిరుచానూరు రోడ్డులో వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ ‌నాయకులు శనివారం ఆందోళన చేపట్టారు. దశాబ్దాలుగా ప్రజల రాకపోకలకు అనువుగా ఉన్న రైల్వేగేటును అధికారులు రెండేళ్ళ క్రితం శాశ్వతంగా మూసివేశారు. దీనితో స్థానికులు పలు ఇబ్బందులు పడుతున్నాఉ. ఈ రైల్వే గేటును తక్షణమే తెరవాలని డిమాండ్ చేస్తూ ‌వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ ఎమ్మెల్యే భూమన కరుణాక‌రరెడ్డి శనివారంనాడు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. చాలాసేపు రైల్‌ రోకో కార్యక్రమం కూడా నిర్వహించారు. వందలాది మంది వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా భూమన మాట్లాడుతూ.. అధికారుల అనాలోచిత చర్యల కారణంగా వేలాది మంది ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ గేటు మూసివేసిన కారణంగా పక్కనే ఉన్న బస్‌స్టాండుకు వెళ్ళాలన్నా సుమారు యాభై, వంద రూపాయలు అదనంగా చెల్లించుకోవాల్సిన దుస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తంచేశారు. ఇదే మార్గంలో శ్రీ వేంకటేశ్వరస్వామివారి సారెను, పంచమి రోజున ఈ మార్గంలోనే వందలాది సంవత్సరాలుగా అమ్మవారిని తీసుకువెళుతున్న సాంప్రదాయానికి అధికారులు గండికొట్టి తీరని అపచారం చేశారని భూమన దుమ్మెత్తిపోశారు. ఈ గేటుకు అవతలి వైపున ఉన్న అంకాళమ్మ దేవతతో తిరుపతి వాసులకు సంబంధాలు పూర్తిగా తెగిపోయాయని ఆవేదన వ్యక్తంచేశారు.

ఇది చాలా చిన్న సమస్య అని, గేటు మూసివేసిన కారణంగా వందలాది మంది చిరు వ్యాపారుల పొట్ట కొట్టేసినట్లయిందని భూమన విచారం వ్యక్తంచేశారు. అండర్ వే బ్రిడ్జి నిర్మాణానికి రూ. 10 కోట్లు కూడా ఖర్చు కాబోవన్నారు. రైల్వేగేటు మూసివేసిన కారణంగా ప్రభుత్వం ఇక్కడ అండర్‌ వే బ్రిడ్జిని నిర్మించాలని భూమన డిమాండ్ చేశారు. మరో మూడు నెలల్లో ఈ సమస్యను పరిష్కరించకపోతే వేలాది మంది కార్యకర్తలతో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని ఆయన హెచ్చరించారు.

Back to Top