సమీక్షలతో కాలక్షేపం

  • అప్పులతో 1150 మంది రైతుల బలి
  • ఐనా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోన్న సర్కార్
  • ఖరీఫ్‌ బాధలు, రబీకి రాకుండా చూడాలి
  • వైయస్‌ఆర్‌ ముందుచూపు వల్లే రాష్ట్రంలో జలకళ
  • టీ వైయస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి కొండా రాఘవరెడ్డి  
హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర సర్కార్‌ సమీక్షలతో కాలం వెల్లదీస్తూ, ప్రచార ఆర్భాటం చేస్తోందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొండా రాఘవరెడ్డి విమర్శించారు. నకిలీ విత్తనాలతో రైతులు తీవ్రంగా నష్టపోతే ఆ విషయంపై సమీక్ష నిర్వహించకుండా కాలక్షేపం చేస్తున్నారని మండిపడ్డారు. హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో కొండా రాఘవరెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... నీటి పారుదల శాఖామంత్రి హరీష్‌రావు రబీ పంటకు 30 లక్షల 90 వేల ఎకరాలకు నీళ్లు ఇస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్నారని, పంటలకు నీళ్లు ఇవ్వడానికి దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి ముందు చూపే కారణమన్నారు. వైయస్‌ఆర్‌ పుణ్యం వల్లే రాష్ట్రానికి జలకల వచ్చిందని గుర్తు చేశారు. రైతుల శ్రేయస్సు కోసం వైయస్‌ఆర్‌ తెలంగాణ రాష్ట్రంలో 36 ప్రాజెక్టులను నిర్మించారన్నారు. ఆ ప్రాజెక్టులను టీఆర్‌ఎస్‌ నేతలే కట్టి నీళ్లు ఇస్తున్నట్లుగా ఫోకస్‌ చేసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖరీఫ్‌లో రూ. 18 వేల 70 కోట్ల రుణాలు ఇవ్వాల్సివుండగా కేవలం రూ. 8 వేల 60 కోట్లు మాత్రమే ఇచ్చారన్నారు. ఎక్కడ తప్పిదం జరుగుతుందో దానిపై సమీక్షలు నిర్వహించాలని ప్రభుత్వానికి సూచించారు.

గిరిజనులను తుపాకులతో బెదిరిస్తున్న కేసీఆర్‌
నకిలీ విత్తనాలతో రైతులు తీవ్రంగా నష్టపోతే ప్రభుత్వం ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదని కొండా ఆగ్రహం వ్యక్తం చేశారు. యాదాద్రి, నీటి పారుదల సమీక్షలు అంటూ కాలం వెల్లదీస్తున్నారని మండిపడ్డారు. రుణమాఫీ, ఇన్‌పుట్‌ సబ్సీడీ లేక అధిక వడ్డీలకు బంగారం  తాకట్టుపెట్టి రైతులు పంట సాగు చేస్తే అందులో రూ. 400 కోట్ల నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల బాధలపై సమీక్షలు నిర్వహించకుండా ప్రచార ఆర్భాటాలకు సమీక్షలు చేస్తున్నారన్నారు. రైతుల సమస్యలపై చర్చించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని గుర్తు చేశారు. నీటిపారుదల సమీక్షలో మంత్రి హరీష్‌రావు అధికారులకు డైరెక్షన్‌లు ఇస్తూ బెదిరింపులకు దిగుతున్నారని ఆరోపించారు. నిజంగా రైతులకు మేలు చేయాలనే చిత్తశుద్ధి టీఆర్‌ఎస్‌ సర్కార్‌కు ఉంటే 90 శాతం పూర్తయిన వైయస్‌ఆర్‌ ప్రాజెక్టులకు నిధులు ఇచ్చి పూర్తి చేయాలని డిమాండ్‌ చేశారు. గిరిజన ప్రజలకు వైయస్‌ఆర్‌ పట్టా భూములు ఇస్తే కేసీఆర్‌ తుపాకులతో బెదిరింపులకు దిగుతూ పంటలు పండనివ్వకుండా తరిమికొడుతున్నారని ధ్వజమెత్తారు. మసిపూసి మారేడు కాయలు చేస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు. దయచేసి రైతుల సమస్యలు, నకిలీ విత్తనాలపై సమీక్షలు నిర్వహించాలని కోరారు. ఖరీఫ్‌ పంటలో అప్పులపాలై 1150 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్నారు. రైతులను ఇబ్బంది పెట్టకుండా రుణమాఫీ ఒకేసారి చేయాలని డిమాండ్‌ చేశారు. ఖరీఫ్‌ పంట బాధలు, రబీకి రాకుండా చూసుకోవాలని ప్రభుత్వానికి సూచించారు. 
 
Back to Top