వరదలతో రాజధానికి ముప్పు

న్యూఢిల్లీ :ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని నిర్మాణంపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌లో వాదనలు కొనసాగుతున్నాయి. వరదలనివారణకు అమరావతిలోని 10 వేల ఎకరాల భూమిని 25 మీటర్ల ఎత్తు పెంచుతామంటున్నారని, అది ఎలా సాధ్యమని పిటిషనర్ తరఫున వాదిస్తున్న న్యాయవాది సంజయ్ పరేఖ్ ప్రశ్నించారు. రాజధాని నిర్మాణానికి తాము వ్యతిరేకం కాదని, ఎంచుకున్న స్థలం విషయంలోనే అభ్యంతరాలు ఉన్నాయని అన్నారు. కొండవీటి వాగు, కృష్ణా వరదలతో రాజధానికి ముప్పు ఏర్పడుతుందని వివరించారు.

అమరావతి ప్రాంతం సముద్రమట్టానికి 21.7 మీటర్ల ఎత్తులో ఉందని.. కానీ వరదల సమయంలో కృష్ణానది 25 మీటర్ల ఎత్తు పెరుగుతుందని సంజయ్ పరేఖ్ వివరించారు. అమరావతిలో 10వేల ఎకరాలకు ముంపు ప్రమాదం ఉందని పర్యావరణ మదింపు నివేదికలో స్పష్టంగా ఉన్నట్లు ఆయన తెలిపారు. ఆ పదివేల ఎకరాల భూమిని 25 మీటర్ల ఎత్తు ఎలా పెంచుతారని పరేఖ్ ప్రశ్నించగా.. దానికి సమాధానం చెప్పేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున వాదించిన న్యాయవాది గంగూలీ తడబడ్డారు. అనంతరం విచారణ రేపటికి వాయిదా పడింది.
Back to Top