కరువు పేరుతో వేల కోట్లు స్కాం

()బాబు ప్రాజెక్టులన్నీ జేబులు నింపడానికే
()సీమ ప్రాజెక్ట్ ల పేరుతో వేల కోట్లు దోచేస్తున్నారు 
()ప్రజలను మోసం చేయడం మానుకోవాలి
()వైయస్‌ఆర్‌ సీపీ నేత తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి చంద్రబాబు తలపెట్టిన ప్రాజెక్టులన్నీ టీడీపీ నేతల జేబులు నింపడానికేనని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాప్తాడు నియోజకవర్గ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి విమర్శించారు. పట్టిసీమ తరహా డబ్బులు దండుకోవడానికి బాబు ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రాజెక్టుల పేరుతో చంద్రబాబు చేస్తున్న అవినీతిని ప్రకాష్‌రెడ్డి బట్టబయలు చేశారు. హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లోని వైయస్‌ఆర్‌ సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు.  అనంతపురం జిల్లా హంద్రీనీవా నిర్మాణానికి నిధులు ఇవ్వలేని చంద్రబాబు ఆగస్టు 15న హంద్రీనీవా నుంచి బైరవాంతిప్ప ప్రాజెక్టుకు నీళ్లు ఇవ్వడం కోసం రూ. 450 కోట్లు, పేరూర్‌ డ్యాంకు రూ. 850 కోట్లు ప్రకటించారని మండిపడ్డారు. 2014లో బాబు ప్రకటించిన గుండ్రేవుల ప్రాజెక్టే ఫీజుబుల్టి రిపోర్టుకు నోచుకోలేదని చెప్పారు. పేరూర డ్యాంకు నీళ్లు ఇవ్వాలనే చిత్తశుద్ది చంద్రబాబుకు ఉంటే కేవలం రూ. 10 కోట్లతో హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌ నుంచి మడకశిర బ్రాంచ్‌ కెనాల్‌ నుంచి పెన్నా నదికి నీళ్లు వదిలితే పేరూర్‌ డ్యాంకు నీళ్లు చేరుతాయని అనేక సందర్భాలు ప్రభుత్వానికి సూచించామన్నారు.

 రూ. 1140 కోట్లతో పట్టిసీమలో నిధులు దోపిడీ చేసిన విధంగా ఈ రెండు నిర్మాణాల పేరుతో డబ్బులు దోచుకునేందుకు రంగం సిద్ధం చేస్తోందన్నారు. కర్ణాటక నుంచి రూపాయి కూడా ఖర్చు లేకుండా నీళ్లు తీసుకొచ్చే ప్రయత్నం చేయకుండా వందల కోట్ల ప్రతిపాదనలు ఎందుకని ప్రకాష్‌రెడ్డి చంద్రబాబును ప్రశ్నించారు. కర్ణాటక ప్రభుత్వం అపర్‌తుంగ రిజర్వాయర్‌ నుంచి 10 టీఎంసీల నీటిని తీసుకొని అపరభద్ర కాలువ నిర్మాణం చేస్తుందన్నారు. ఆ ప్రాజెక్టు నుంచి కేవలం రూ. 500 కోట్ల రూపాయలతో బైరవాంతిప్ప, పేరూర్‌ ప్రాజెక్టులకు నీరొచ్చే అవకాశం ఉన్నప్పుడు రెండు వేల కోట్ల ప్రకటించడం ఎందుకని నిలదీశారు. రాయలసీమలో కరువును ఆసరాగా చేసుకొని వేల కోట్ల స్కాం చేసే విధంగా ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఆరోపించారు. 

కుప్పంకు నీళ్లు తరలించేందుకు బాబు కుట్రలు
అనంతపురం జిల్లా ఆయకట్టును ఎగురగొట్టి కుప్పంకు నీళ్లు తరలించే విధంగా చంద్రబాబు కుట్రలు పన్నుతున్నారని ప్రకాష్‌రెడ్డి మండిపడ్డారు. హంద్రీనీవా ప్రాజెక్టు రిపోర్టు ప్రకారం 40 టీఎంసీలు ఉండగా 12 టీఎంసీలకు మించి రాలేదని చెప్పారు. చంద్రబాబుకు రాయలసీమ నాలుగు జిల్లాలకు నీరు ఇవ్వాలనే చిత్తశుద్దే ఉంటే రూ. వెయ్యి కోట్లతో 6 లక్షల ఎకరాలకు డిస్టిబ్యూటరీ వ్యవస్థను ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. దివంగత మహానేత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో కర్నూలు 80 వేల ఎకరాలు, అనంత లక్షన్నర ఎకరాలు, కడప 35 వేల ఎకరాలు, చిత్తూరు లక్షన్నర ఎకరాలకు నీళ్లు ఇచ్చే విధంగా డిస్టిబ్యూటరీ వ్యవస్థను ఏర్పాటు చేస్తే టీడీపీ అధికారంలోకి వచ్చి దాన్ని రద్దు చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ఇప్పటికైనా ప్యాకేజీలు, రెయిన్‌గన్‌లతో ప్రజలను మోసం చేయడం మానుకోవాలని సూచించారు. కర్ణాటక సర్కార్‌తో చర్చలు జరిపి నీటి వాటాలను సాధించాలని డిమాండ్‌ చేశారు. 

Back to Top