అవి ప్రభుత్వ హత్యలే

కళ్లెదుటే లైసెన్సులు లేని బోట్లుతిరుగుతున్నా స్పందించరు

నిర్లక్షం వహించినందుకు  చంద్రబాబుపై కూడా కేసు నమోదు చేయాలి

సిఎం నుంచి మంత్రుల దాకా లంచాలు

తూతూ మంత్రపు విచారణలతో సరిపుచ్చుతున్నారు.

ప్రతిపక్ష నేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి 


దెందులూరు : తూర్పు గోదావరి జిల్లా దేవీ పట్నంలో
జరిగిన బోటు ప్రమాద ఘటన పూర్తిగా ప్రభుత్వ తప్పిదంతోనే జరిగిందనీ, ఇటువంటి  ఘటనలు  ప్రభుత్వ హత్యలే అని ప్రతిపక్ష నాయకులు వైయస్
జగన్ మోహన్ రెడ్డి అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈఘటనలో మరణించిన వారి
కుటుంబాలకు  25 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ పడవ ప్రమాదం ఘటన చాలా బాధ
కలిగించిందనీ, దాదాపు 40 మంది మరణించడం అత్యంత దురదృష్టకరమని ఆయన విచారం వ్యక్తం
చేశారు. అక్రమంగా తిరగుతున్న వంద బోట్లను కూడా నివారించలేని పరిస్థితుల్లో ప్రభుత్వ
యంత్రాంగం ఉన్నదంటే నిర్లక్షానికి నిదర్శనం అని అన్నారు.

రాష్ట్రంలో వరుసగా జరుగుతున్న పడవ ప్రమాదాల
నివారణలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ప్రభుత్వంపై హత్య కేసులు నమోదు చేసి
సమగ్ర విచారణ జరిపించాలని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై కూడా కేసు నమోదు
చేయాలన్నారు.  ఎలాంటి భద్రతా ఏర్పాట్లు
లేకుండా బోట్లను ఇష్టా రాజ్యంగా తిప్పుతున్నారంటే, మంత్రులు, ముఖ్యమంత్రి స్థాయి
వరకు కూడా లంచాలు ముట్టుతుండటమే కారణమనీ జగన్ ఆరోపించారు. అందుకనే సాక్షాత్తూ ముఖ్యమంత్రి
కళ్లెదుట నుంచే ఎటువంటి లైసెన్సులులేని బోట్లు యధేచ్చగా తిరుగుతున్నాయని అన్నారు.
గతంలో జరిగిన ఘటనలపై వేసిన విచారణలేమయ్యాయో అని, అవికూడా టీవీ సీరియళ్ల మాదిరిగా
సాగుతూ ఉంటాయని వ్యంగ్యంగా అన్నారు.

గత ఏడాది నవంబరులో సిఎం ఇంటి పక్కనుంచే కృష్ణా నదిలోపడవ
మునిగి 21 మంది చనిపోయారనీ, మళ్లీ అయిదు రోజుల కిందట బోటులో అగ్ని ప్రమాదం జరిగి
పూర్తిగా దగ్ధమైపోయిందని అదృష్టవశాత్తూ ప్రాణ నష్టం జరగని సంగతిని ఆయన గుర్తుచేశారు.ఆరు
నెలల కాలంలో మూడు సంఘటనలు జరగడం లైసెన్సులు, భద్రతా ఏర్పాట్లు వంటి వాటిపై ఏమాత్రం
దృష్టి సారించకపోవడానికి కారణం ముఖ్యమంత్రి ఆయన కుమారుడు,మంత్రులకు వాటాలు అందుతుండటమే
అని తీవ్రంగా మండిపడ్డారు.

విచారణలు సాగుతూ.....నే ఉంటాయి

ఇలాంటి విచారకమైన ఉదంతాలు చోటు చేసుకున్నప్పుడు
చంద్రబాబు నాయుడు మొసలికన్నీరు కారుస్తూ. డ్రామాతో సినిమా స్క్రిప్టును వినిపిస్తూ
, అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేయడం, ఇలాంటివి పనరావృత్తం కాకుండా చర్యలు తీసుకుంటామంటూ
చేసిన ప్రకటనలు మీడియాలో వచ్చేట్లుగా చూడటం తప్ప సీరియస్ గా వ్యవహరించడం లేదన్నారు.
అంతే కాకుండా వీటిపై విచారణ వేస్తున్నట్లుగా ప్రకటించి చేతులు
దులిపేసుకుంటారన్నారు. ఆ విచారణలు టీవీ సీరియళ్లగా కొనసాగుతూనే ఉంటాయని, అవి ఎప్పటికీ
పూర్తి కావనీ, పూర్తి అయి నివేదికలు వస్తే ముఖ్యమంత్రి తో పాటు, మంత్రుల పేర్లు
కూడా బయటకు వస్తాయి కాబట్టే వాటిని సాగతీస్తూ ఉంటారన్నారు. అప్పట్లో పుష్కరాల్లో
తన షూటింగ్ కోసం జనం కిక్కిరిసిపోయేట్లుగా చూపేందుకు చేసిన చర్య పర్యవసానంగా ఎంతో మంది
ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చిందనీ దాని విచారణ ఏమి తేల్చిందో ఇంతవరకు తెలీదన్నారు. ఇలాంటి
విచారణలన్నీ మోసం చేయడానికే చేస్తున్నారనీ, అసలు తప్పంతా ముఖ్యమంత్రి వద్దే
ఉందన్నారు. తన కళ్లెదుట నుంచే ప్రతి రోజూ లైసెన్సులులేని, భద్రతా ఏర్పాటులు లేని
బోట్లు తిరిగేందుకు అనుమతించడంలోనే ఆయన తప్పు ఉందని జగన్ మండిపడ్డారు.

ఇదిలా ఉంటే, పడవ ప్రమాదం ఘటనలో బాధితులకు అండగా
నిలవాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చామనీ, సహాయక చర్యల్లో పాల్గొనాలని
చెప్పామన్నారు.అంతేకాకుడా అందుబాటులో ఉన్న సీనియర్ నాయకులను అక్కడికి పంపించి ఘటన
పై నివేదిక రూపొందించమని కోరినట్లు చెప్పారు.

గోదావరి,కృష్ణా తీరంలోని కొన్ని గ్రామాలకు
రాకపోకలు సాగించాలంటే బోట్లే మార్గమంటూ అటు వంటి పరిస్థితుల్లో ప్రైవేటు బోట్ల
నివారణ సాధ్యమా అంటూ అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ ...రాష్ట్ర ప్రభుత్వం తలచుకుంటే
వంద సంఖ్యలో కూడా లేని బోట్లను తనిఖీ చేయలేదా, అంతటి అధికార వ్యవస్థ కూడా లేని
దుస్థితి ఉందా ఒకసారి ఆలోచించాలన్నారు. వాస్తవమేమిటంటే లంచాలు పుచ్చుకున్నందునే
ఎవరూ అడగడ లేకపోతున్నారన్నారు. 

Back to Top