రుణంలేదు.. పంటల బీమాలేదు

ఏపీలో రైతన్న దీనస్థితి

అతివృష్టి లేదా అనావృష్టి పరిస్థితులు తలెత్తి పంటలకు
నష్టం వాటిల్లితే రైతన్నలను పంటల బీమా పథకం ఆదుకుంటుంది. మొత్తం కాకపోయినా జరిగిన నష్టంలో
సింహభాగం తిరిగివస్తుంది. అయితే ఆంధ్రప్రదేశ్‌లో రైతులకు ఇపుడు పంటల బీమా లేనట్లేనని
చెప్పాలి. రుణమాఫీ మాయలో మోసపోయిన రైతులు బ్యాంకులకు రుణాలు పూర్తిగా చెల్లించలేకపోయారు.
డిఫాల్టర్లుగా మారారు. దాంతో డిఫాల్టర్లయిన రైతులకు బ్యాంకులు రుణాలివ్వని పరిస్థితి.
రాష్ర్టంలో ఈ సీజన్‌లో 14శాతం మందికి మాత్రమే బ్యాంకులు రుణాలిచ్చాయని
గణాంకాలు చెబుతున్నాయి. రుణాలు తీసుకున్న రైతుల వద్ద బ్యాంకులు బీమా ప్రీమియంను మినహాయించి
పంటల బీమా సదుపాయాన్ని కల్పించాయి. మిగిలినవారికి రుణమూ లేదు.. పంటల బీమా కూడా లేదు.
రాష్ర్టంలో రాయలసీమ జిల్లాల్లో వేరుశనగ పంటకు, గుంటూరులో పత్తి,
మిర్చి, ప్రకాశంలో పత్తి, పశ్చిమగోదావరిలో ఆయిల్‌పామ్, కడపలో బత్తాయి, చిత్తూరులో టమాటా పంటలకు వాతావరణ బీమా పథకాన్ని వర్తింపజేయాలని నిర్ణయించారు.
వేరుశనగకు వాతావరణ బీమా ప్రీమియం గడువు ఈనెల 9తో ముగియనుండగా
మిగిలిన పంటలకు ఈనెల 31తో గడువు ముగియనున్నది. గతేడాది తరహాలోనే
ఈ ఏడాదీ ప్రీమియం చెల్లింపు గడువును పొడిగించకపోతే రైతులు తీవ్రంగా నష్టపోక తప్పదు.
గతేడాది బీమా ప్రీమియం చెల్లింపు గడువు పొడిగించకపోవడంతో 55శాతం
మందికి పైగా రైతులకు బీమా పథకం అందకుండాపోయింది. రైతు రుణ  మాఫీ హామీ నీరుగారిపోవడంతో రైతులను బ్యాంకులు డిఫాల్టర్ల
(ఎగవేతదారుల) జాబితాలో చేర్చాయి. ఈ జాబితాలో ఉన్న రైతులకు తిరిగి రుణం ఇచ్చేందుకు బ్యాంకులు
అంగీకరించడంలేదు. రుణం రీషెడ్యూలు చేసుకోని రైతులకూ బ్యాంకులు మొండిచేయి చూపిస్తున్నాయి.
ఇప్పటి వరకు రాష్ర్టంలో 14 శాతం మంది రైతులకు మాత్రమే రుణాలు
అందాయి. మిగిలిన వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.

Back to Top