ప్రజలకేదీ స్వాతంత్ర్యం: విజయమ్మ

హైదరాబాద్ 15 ఆగస్టు 2013:

స్వాతంత్ర్యం వచ్చింది కాంగ్రెస్ పార్టీలోని అగ్రనేతలకే కానీ ప్రజలకు కాదని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ స్ఫష్టం చేశారు. తమ ప్రశ్నలకు సమాధానం చెప్పే పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ విభజించు- పాలించు సిద్ధాంతాన్ని అమలు చేస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ ఏం చేసిందని ప్రజలకు ఓటేయాలని విజయమ్మ ప్రశ్నించారు. రాజ్యాంగం ఇచ్చిన అధికారాన్ని కాంగ్రెస్ దుర్వినియోగం చేస్తోందన్నారు. కాంగ్రెస్‌ అధిష్టానాన్ని ఎదిరిస్తే జైలులో పెడుతున్నారు తెలిపారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా  పార్టీ ప్రధాన కార్యాలయంలో శ్రీమతి విజయమ్మ గురువారం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ప్రజలకు స్వాతంత్ర్య దిన శుభాకాంక్షలు తెలిపారు.

కాంగ్రెస్ పార్టీ కుట్రలు చేధించడానికి ప్రజలే ఒక సైన్యంగా,  ఉప్పెనలా వచ్చే రోజు త్వరలోనే ఉందని   హెచ్చరించారు.  ఓట్లు- సీట్లే పరమావధిగా తీసుకున్న  నిర్ణయాలను ఏ ఒక్కరూ హర్షించరని ఆమె చెప్పారు. చంద్రబాబు పూటకో మాట, రోజుకో తీరులా వ్యవహారిస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు సహకారం వల్లే రాష్ట్ర విభజనకు కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుందన్న సంగతి బహిరంగ రహస్యమని పేర్కొన్నారు. విభజనను సమర్థిస్తూ చంద్రబాబు కాకి లెక్కలు చెప్పారన్న సంగతిని ఆమె గుర్తు చేశారు. దివంగత మహానేత డాక్టర్ వైయస్‌ఆర్‌ను ప్రేమించేవారికీ,  శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి, శ్రీమతి వైయస్ షర్మిలలను అక్కున చేర్చుకున్న ప్రతిఒక్కరికీ ఆమె ధన్యవాదాలు  తెలిపారు.
స్వాతంత్ర్యం సిద్ధించిన అనంతరం దేశం గర్వించతగ్గ విజయాలు సాధించిందన్నారు. ఆసియాలోనే శక్తిమంతమైన దేశంగా రూపొందిందని చెప్పారు. ప్రపంచంలో ఎక్కడ చూసినా దేశ ప్రజలు విస్తరించి ఉన్నారన్నారు. అంతరిక్ష రంగంలో కానీ, ఏ ఇతర రంగాలలో కానీ దేశం దూసుకువెడుతోందని తెలిపారు. ఐఎన్ఎస్ విక్రాంత్ రూపకల్పనతో దేశ నావికా దళం అగ్రరాజ్యాల సరసన నిలిచిందన్నారు. ఐటీ, తదితర రంగాల్లో దేశం ప్రపంచంలో బలమైన ముద్ర వేసుకుందని చెప్పారు.

ప్రస్తుత తరుణంలో దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందా అని అనేక గొంతుకలు ప్రశ్నిస్తున్నాయన్నారు. దేశంలో పేదరికాన్ని చూస్తే గుండె తరుక్కుపోతుందన్నారు.  తొలుత దేశంలో సోషలిజం.. తదుపరి లిబరలైజేషన్ కొనసాగాయని ఇప్పుడు ప్రైవైటైజేషన్ నడుస్తోందని ఆమె విమర్శించారు. ఈ సమయంలో మంచి మనసున్న ప్రభుత్వాలుండాలని అభిప్రాయపడ్డారు. బాధ్యత కలిగిన నాయకులు కూడా ఉండాలని పేర్కొన్నారు. గాంధీజీలాంటి నాయకుడు ప్రస్తుతం అవసరమని శ్రీమతి విజయమ్మ తెలిపారు. దేశంలో 70 శాతం వరకూ పేదరికం తాండవిస్తోందన్నారు. ఆదాయ లెక్కలతో చూసుకుంటే పేదరికం తగ్గినట్లు కనిపిస్తున్నప్పటికీ పేదలకు పౌష్టికాహారం పూర్తిస్థాయిలో అందటం లేదన్నారు. పేదరికం మానవాళికి మాయని మచ్చలాంటిదన్నారు. పేదవాడి మోములో ఎప్పుడూ చిరునవ్వును చూడాలని దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డిగారు అభిలషించారని శ్రీమతి విజయమ్మ చెప్పారు. తను చేపట్టిన పథకాల ద్వారా ఆయన ఆ పని చేసి చూపించారని తెలిపారు. కటిక దరిద్రంలో ఉన్నవారు మనకు స్వాతంత్ర్యం వచ్చిందని చెబితే ఏ స్పందించగలరని ఆమె ప్రశ్నించారు. దివంగత మహానేత అధికారంలో ఉన్నా.. లేకున్నా.. గ్రామీణ ప్రాంతాల గురించి, సామాన్య ప్రజల గురించి ఆలోచించేవారని చెప్పారు.

దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి అభివృద్ధి, సంక్షేమాలను  రెండు కళ్లుగా భావించారని చెప్పారు.  అన్ని ప్రాంతాలకు మేలు చేసేలా ఆ మహానేత సంక్షేమ పథకాలు అమలు చేశారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట విభజన జరిగితే అటు సీమాంధ్ర, ఇటు తెలంగాణ ప్రాంతాలకు సమన్యాయం జరగాలని తమపార్టీ మొదటినుంచి కోరున్న విషయాన్ని శ్రీమతి విజయమ్మ జ్ఞాపకం చేశారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేతలతోపాటు పలువురు కార్యకర్తలు జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి హాజరయ్యారు.

తాజా వీడియోలు

Back to Top