నాణ్యతలో రాజీపడే ప్రసక్తి లేదు

మదనపల్లె రూరల్‌: నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా చేస్తున్న పనుల నాణ్యతపై ఎలాంటి పరిస్థితుల్లోనూ రాజీపడే ప్రసక్తి లేదని ఎమ్మెల్యే డా.దేశాయ్‌తిప్పారెడ్డి చెప్పారు. మంగళవారం మండలంలోని చీకిలబైలు పంచాయతీ బార్లపల్లె నుంచి జోళ్ళపేట చెరువు కట్ట వరకు వేస్తున్న 3.2కి.మీల బీటీ రోడ్డు పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన హామీ ప్రకారం బార్లపల్లె రోడ్డును వేయించడం జరుగుతోందన్నారు. పంచాయతీరాజ్‌ ఆధీనంలో ఉన్న రోడ్డును నాణ్యతతో ఉండాలనే ఉద్దేశంతో ఆర్‌అండ్‌బీ శాఖకు మార్పించడం జరిగిందని చెప్పారు. రూ.2కోట్ల వ్యయంతో పనులు ప్రారంభం చేశామని, ప్రస్తుతం పనులు గ్రావెల్‌దశలో ఉండటంతో పరిశీలించేందుకు వచ్చినట్లు చెప్పారు. రోడ్డు వేయడంలో స్థానికంగా రైతులతో సమస్యలు ఎదురవుతున్నాయని ఆర్‌అండ్‌బీ అధికారులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. దీంతో ఎమ్మెల్యే స్వయంగా బాధితరైతులను కలిసి సమస్యలను తెలుసుకుని, ఎవరికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా సామరస్యంగా పరిష్కరించారు. రోడ్డు నాణ్యత విషయంలో రాజీ పడవద్దని, నాలుగుకాలాల పాటు మన్నేలా, ప్రజలందరికీ ఉపయోగపడేలా పనులు చేయాలని కాంట్రాక్టర్‌కు సూచించారు. కార్యక్రమంలో ఆర్‌అండ్‌బీ డీఈ విశ్వనాథ్, బాలాజీ కన్‌స్ట్రక్షన్స్‌ కాంట్రాక్టర్, వైఎస్సార్‌సీపీ నాయకులు చంద్ర, భగవాన్‌రెడ్డి, నాగార్జున, దొరస్వామిరెడ్డి, జయచంద్రారెడ్డి, విశ్వనాథ్, వెంకటరమణ, రెడ్డెప్ప, శ్రీనివాసులు, రవి, శ్రీకాంత్, నాగవేణి తదితరులు పాల్గొన్నారు.

తాజా ఫోటోలు

Back to Top