వెనుకడుగు వేసే ప్రసక్తే లేదు

పొదలకూరు : ప్రతిపక్షంలో ఉన్నా, అధికారంలో ఉన్నా అభివృద్ధి పనులు చేపట్టడంలో వెనుకడుకేసే ప్రసక్తే లేదని సర్వేపల్లి ఎమ్మెల్యే, వైయస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని సంగం–పొదలకూరు రహదారి పనులను శనివారం తాటిపర్తి గ్రామ సమీపంలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... కాంగ్రెస్‌ ప్రభుత్వంలో సంగం–పొదలకూరు ఆర్‌అండ్‌బీ రోడ్డు పనులను మంజూరు చేయడం జరిగిందన్నారు. తర్వాత ప్రభుత్వం మారీ టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రోడ్డు పనులకు నిధులను విడుదల చేశారన్నారు. ప్రస్తుతం 21.7 కి.మీ దూరం రహదారిని మూడు బిట్లుగా రూ.17.7 కోట్లతో చేపడుతున్నట్టు తెలిపారు. తాను ఈ ప్రాంత శాసనసభ్యునిగా అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో సంగం–పొదలకూరు రహదారి విస్తరణ పనులకు ఎందుకు నిధులు మంజూరు చేయడం లేదని ప్రశ్నించినట్టు వెల్లడించారు. దీంతో సంబంధిత శాఖ మంత్రి స్పందించి పెండింగ్‌లో ఉన్న పనులకు నిధులను మంజూరు చేయడం జరిగిందన్నారు. ఎన్నో సంవత్సరాలుగా సంగం–పొదలకూరు రహదారి విస్తరణ పనులకు నోచుకోలేదన్నారు. కాంగ్రెస్‌ప్రభుత్వంలో సైతం తాను పట్టుపట్టి రోడ్డు పనులను సాధించడం జరిగిందన్నారు. ఈ మార్గంలో ఉన్న విరువూరు గ్రామం రోడ్డు ఇరుకుగా ఉండడం వల్ల బైపాస్‌రోడ్డు నిర్మాణానికి ప్రతిపాదనలు తయారు చేయాల్సిందిగా అధికారులను కోరడం జరిగిందన్నారు. గ్రామం విస్తరిస్తున్న క్రమంలో గ్రామంలో నుంచి వాహనాలు వెళ్లకుండా బైపాస్‌రోడ్డు ద్వారా సంగంకు వెళితే ట్రాఫిక్‌సమస్యలు ఉండవన్నారు. 

పనుల నాణ్యతలో రాజీపడే ప్రసక్తే లేదుః
సంగం–పొదలకూరు రహదారి విస్తరణ పనుల్లో రాజీపడే ప్రసక్తే లేదని ఎమ్మెల్యే కాకాణి వెల్లడించారు. మార్గమధ్యలో కల్వర్టులు, బ్రిడ్జిల నిర్మాణంలో అధికారులు నాణ్యతాప్రమాణాలు పాటించాల్సిందిగా సూచించారు. రోడ్డు పనుల్లో నాణ్యత లోపిస్తే ఉన్నతస్థాయి అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లడం జరుగుతుందన్నారు. అలాగే ఆయా గ్రామ ప్రాంత ప్రజలు రోడ్డు పనుల నాణ్యతపై దృష్టి సారించాల్సిందిగా సూచించారు. ఎమ్మెల్యే వెంట ఎంపీపీ కోనం బ్రహ్మయ్య, పొదలకూరు సర్పంచ్‌తెనాలి నిర్మలమ్మ, వైఎస్సార్‌సీపీ జిల్లా స్టీరింగ్‌కమిటీ సభ్యుడు పామూరు లచ్చారెడ్డి, నాయకులు వూకోటి లక్ష్మీనారాయణ, వాకాటి శ్రీనివాసులురెడ్డి, ఆర్‌అండ్‌బీ డీఈ, ఏఈ ఎల్‌.మాల్యాద్రి, ఖాజాషఫీ తదితరులు ఉన్నారు.

Back to Top