నాడు నాన్న రాజన్న.. నేడు షర్మిల

శ్రీకాకుళం :

రాష్ట్రానికి చిట్టచివరి సరిహద్దు జిల్లా శ్రీకాకుళం. ఈ జిల్లాలోని ఒరిస్సా సరిహద్దులో ఉంది ఇచ్ఛాపురం. మహానేత డాక్టర్ వై‌యస్ రాజశేఖరరెడ్డి పాదయాత్ర ‌చివరి మజిలీ అయినా,‌ ఆయన తనయుడు శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి రెండవ విడత ఓదార్పు యాత్ర ప్రారంభ ప్రాంతమైనా, రాజన్న ముద్దుల తనయ శ్రీమతి షర్మిల మరో ప్రజాప్రస్థానం ముగింపు అయినా ఇచ్ఛాపురంలో జరిగాయి. ‘ఎందుకో తెలీదు గాని.. వైయస్ కుటుంబం ఇచ్ఛాపురంతో‌ అనుబంధం పెనవేసుకుంది. ముఖ్యమైన అన్ని కార్యక్రమాలను ఇచ్ఛాపురం నుంచి ప్రారంభించడమో.. ఇక్కడే ముగించడమో వారికి ఆనవాయితీగా మారింది’ అని హర్షం వ్యక్తం చేస్తున్నా స్థానికులు. శ్రీమతి షర్మిల పాదయాత్ర ముగింపు సందర్భంగా నిర్వహించిన భారీ బహిరంగ సభ, స్తూపం ఆవిష్కరణ కార్యక్రమాల సందర్భంగా వైయస్‌ఆర్ కాంగ్రె‌స్‌ పార్టీ శ్రేణులు, పార్టీ అగ్రనేతలు భారీ సంఖ్యలో తరలిరావడంతో ఆదివారం ఇచ్ఛాపురం జనసంద్రంగా మారింది.

ఇచ్ఛాపురం మొత్తం ఆదివారం ఉత్సవ వాతావరణం కనిపించింది. ఎక్కడ చూసినా శ్రీమతి షర్మిల మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర పైనే ప్రజలు చర్చించుకున్నారు. సుమారు పది సంవత్సరాల క్రితం అప్పట్లో ప్రతిపక్ష నేతగా ఉన్న మహానేత డాక్టర్‌ వైయస్ రాజశేఖరరెడ్డి ప్రజల కష్టాలు తెలుసుకునేందుకు చే‌సిన ప్రజాప్రస్థానం యాత్రను ఈ సందర్భంగా స్థానికులు గుర్తుచేసుకున్నారు. అప్పటి నుంచే ఆ కుటుంబానికి ఇచ్ఛాపురంపై మమకారం పెరిగిందని వారంటున్నారు. ‌రాజన్న హఠాన్మరణాన్ని తట్టుకోలేక ప్రాణాలు విడిచిన వారి కుటుంబాలకు భరోసా ఇచ్చేందుకు శ్రీ వైయస్ జగ‌న్మోహన్‌రెడ్డి రెండవ విడత ఓదార్పు యాత్రను కూడా ఇచ్ఛాపురం నుంచే ప్రారంభించిన వైనాన్ని.. ఇప్పుడు శ్రీమతి షర్మిల మరో ప్రజాప్రస్థానం పాదయాత్రను ఇచ్ఛాపురంలోనే ముగించడాన్ని ప్రస్తావిస్తున్నారు. ఈ మూడు ఘటనలు తమ పట్టణానికి వైయస్ఆర్ కుటుంబంతో విడదీయరాని అనుబంధాన్ని ఏర్పరచాయని అంటున్నారు.

గతంలో వైయస్ఆర్‌ను, ఆ తర్వాత శ్రీ జగన్‌ను, ఇప్పుడు శ్రీమతి షర్మిలను చూడగలిగానని బోయిన భారతి అనే చిరు వ్యాపారి ఆనందం వ్యక్తం చేసింది. పాదయాత్రలో ఇచ్చిన హామీలను మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి అమలు చేశారు. ఇప్పుడు శ్రీమతి షర్మిల ఇచ్చిన హామీలు కూడా అమలవుతాయన్న నమ్మకం ఉందని ఇడ్లీల వ్యాపారి పూర్ణా సాహు చెప్పారు. జగనన్న సిఎం కావాలని ఆయన ఆకాంక్షించారు. మహానేత వైయస్‌లోని తెగువ, సాహసం శ్రీమతి షర్మిలలోనూ కనిపించాయని టీ కొట్టు నడిపే దామిచెట్టి పార్వతి అభిప్రాయపడ్డారు.

వైయస్ఆర్ జ్ఞాపకాలు.. ఉద్విగ్న క్షణాలు‌:
2012 అక్టోబర్ 18న వైయస్‌ఆర్ జిల్లా ఇడుపులపాయ నుంచి మొదలైన శ్రీమతి షర్మిల మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలోని వైయస్ఆర్ ‘విజయవాటిక’ వద్ద ముగిసింది. ఆదివారం ఇచ్ఛాపురం నియోజకవర్గం బలరాంపురం నుంచి పాదయాత్ర ప్రారంభించిన ‌ఆమె 4.6 కిలోమీటర్లు నడిచి లొద్దపుట్టి వద్ద భోజన విరామం తీసుకున్నారు. అక్కడి నుంచి సరిగ్గా 3.15 గంటలకు శ్రీమతి షర్మిల తుది మజిలీ చేరుకునేందుకు బయలు దేరారు. ఆకాశం అంతా మేఘావృతమయింది. ఒక్కో చినుకు రాలుతోంది. 1.7 కిలోమీటర్లు నడిచి వైయస్ఆర్ విజయవాటిక వద్దకు చేరుకున్నారు.

ఆ నేల దివంగత మహానేత డాక్టర్ వై‌యస్‌ రాజశేఖరరెడ్డి నడిచిన ప్రాంతం. ‘ప్రజాప్రస్థానం’ పేరుతో ఆయన 68 రోజుల్లో 1,476 కిలోమీటర్లు నడిచి జయకేతనం ఎగురవేసిన స్థలం. వైయస్ఆర్‌కు జనం జయజయ ధ్వానాలు పలికిన ప్రదేశం. వైయస్ఆర్ జ్ఞాపకాలన్నింటినీ పదిలంగా దాచుకున్న ఆ ప్రదేశానికి రాగానే‌ శ్రీమతి షర్మిల ఉద్వేగానికి గురయ్యారు. ఉబికి వస్తున్న ఉద్వేగాన్ని గుండెల్లో దాచుకొని, చెరగని చిరునవ్వుతో ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. వైయస్ఆర్ విజయవాటిక వద్దకు చేరుకున్నారు. మహానేత డాక్టర్‌ ‌వైయస్ఆర్‌కు నివాళులు అర్పించారు. అక్కడితో 3,112 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తయింది. అక్కడ్నుంచి ‘విజయవాటిక’కు ఎదురుగా ఏర్పాటు చేసిన మరో ప్రజాప్రస్థానం ముగింపు చిహ్నం ‘విజయ ప్రస్థానం’ స్తూపం వద్దకు వెళ్లారు. స్తూపాన్ని ఆవిష్కరించారు. అనంతరం వేదిక మీదకు వచ్చి బహిరంగ సభలో ప్రసంగించారు.

Back to Top