ఆలయాల తొలగింపు అమానుషం

  • రాష్ట్రానికి కీడు శంకించేలా బాబు పనులు
  • భక్తుల మనోభావాలను కించపరుస్తున్న చంద్రబాబు
  • ఆలయాల కూల్చివేతపై మండిపడుతున్న ప్రజలు
  • టీడీపీకి తగిన గుణపాఠం తప్పదని హెచ్చరిక
విజయవాడ: హిందూ సంప్రదాయాలను మంటగల్పుతూ, భక్తుల మనోభావాలను దెబ్బతీస్తూ టీడీపీ అమానుషంగా ప్రవర్తిస్తోంది. పుష్కరాల అభివృద్ధి మాటున దేవుని గుళ్లను కూల్చివేస్తూ రాష్ట్రానికి అపఖ్యాతిని తీసుకొస్తోంది. రాష్ట్రానికి కీడు శంకించేలా చేస్తున్న చంద్రబాబు వికృత క్రీడలపై రాష్ట్ర ప్రజలు మండిపడుతున్నారు. ఐనా కూడా బాబు ప్రజల మనోభావాలను ఏమాత్రం పట్టించుకోవడం లేదు. నగరంలో అడ్డగోలుగా ప్రార్థనామందిరాలను కూల్చివేయిస్తున్నారు. 

ఇప్పటికే దాదాపు 30కి పైగా దేవుడి గుళ్లను కూలదోసిన టీడీపీ... అర్థరాత్రి సమయంలో  రోడ్డుపక్కన ఉన్న గుళ్లను పడగొట్టేస్తోంది. తాజాగా బుధవారం అర్ధరాత్రి దుర్గగుడి గోశాల వెనుక భాగంలోని శంకరమఠాన్ని పూర్తిగా కనుమరుగుచేసింది. గాయత్రిదేవి, శివాలయంతో, ఆంజనేయస్వామి గుడులతో పాటు మరికొ న్ని ఆలయాలను తొలగించారు. మొదటి అంతస్తులో ఉన్న ప్రవచనా మందిరాన్ని పూర్తిగా తొలగించగా, కింద అంతస్తులో ఉన్న ఆలయాలను తొలగించేందుకు గడువు ఇచ్చారు. 

ఆలయాలతో పాటు మసీదులను కూలదోస్తూ టీడీపీ సర్కార్ మత సంప్రదాయాలను కించపరుస్తోంది. దేవుని విగ్రహాలను రోడ్డున పడేస్తూ, మురికికాలువల్లో విసిరిపారేస్తూ నీచ పనులకు ఒడిగడుతోంది. దుర్గగుడికి వెళ్లే అర్జున వీధి మొదట్లో ఉండే హజరత్ సయ్యద్ షా ఖాద్రీ దర్గా ప్రాంగణాన్ని బుధవారం అర్ధరాత్రి కూల్చివేశారు. దర్గా మరమ్మతులు పూర్తయి కనీసం ప్రారంభోత్సవం కూడా జరుపుకోకుండానే ఇలా ధ్వంసం చేయడంపై ముస్లింలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  

ఓ పక్క పుష్కరాలను ఘనంగా నిర్వహిస్తామని చెబుతూ దాని ముసుగులో దోపిడీకి పాల్పడుతూనే...మరో పక్క గుళ్లను కూల్చివేస్తూ టీడీపీ నీచాతి నీచంగా ప్రవర్తిస్తోందని భక్తులు నిప్పులు చెరుగుతున్నారు. బాబు చేస్తున్న పాపపు పనుల కారణంగా ప్రజలు బలైపోతున్నారని ఆందోళన చెందుతున్నారు.  గోదావరి పుష్కరాల్లో చంద్రబాబు 29 మంది ప్రాణాలను బలితీసుకున్న ఘటనే అందుకు ఉదాహరణగా చెబుతున్నారు. 

 యథావిధిగా కూల్చివేతల కొనసాగింపు..
గతంలో 30 దేవాలయాలను కూల్చివేసినందుకు నిరసనగా పీఠాధిపతులు, మఠాధిపతులు విజయవాడలో పెద్ద సభ నిర్వహించారు. ఆ సందర్భంగా ఇక నుంచి ఏ దేవాలయం, ప్రార్థనాలయం తొలగించాలన్నా ఆయా ప్రార్థనామందిరాల పెద్దలతో చర్చించి నిర్ణయాలు తీసుకుంటామని ప్రభుత్వం చెప్పింది. తొలగించిన దేవాలయాలను నిర్మించేందుకు ఐదుగురు మంత్రులతో కూడిన కమిటీని వేసింది. అయితే వీటిన్నంటినీ పక్కన పెట్టి యథావిధిగా దేవాలయాలు, దర్గాల కూల్చివేతను ప్రభుత్వం కొనసాగిస్తోంది. ఆలయాల కూల్చివేతలు ఇక లేవంటూ ప్రకటిస్తూనే మరో వైపు ప్రభుత్వం తన వైఖరిని కొనసాగించడాన్ని భక్తులు జీర్ణించుకోలేకపోతున్నారు. రానున్న రోజుల్లో టీడీపీకి తగిన గుణపాఠం తప్పదని హెచ్చరిస్తున్నారు. 
Back to Top