తెలుగు ఆత్మగౌరవానికి భంగం: వైయస్ఆర్ కాంగ్రెస్

హైదరాబాద్ 01 నవంబరు 2013:

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రావతరణ దినోత్సవం నాడు తెలంగాణ ప్రాంతాల్లో జిల్లా కలెక్టర్లు, ఇతర అధికారులతో జెండా ఆవిష్కరింపజేయడాన్ని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పుపట్టింది. అలాగే అభ్యంతరమూ చెప్పింది. తెలంగాణ ప్రాంతానికి చెందిన మంత్రులు రాష్ట్రావతరణ దినోత్సవానికి హాజరుకాకపోవడం సిగ్గుపడాల్సిన విషయమని పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు చెప్పారు. తెలుగు ప్రజలను ఈ చర్య ద్వారా వారు అవమానించినట్లేనని తెలిపారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన వేడులలో పాల్గొన్న తరవాత ఆయన మీడియాతో మాట్లాడారు.

తెలుగు ప్రజల 102 ఏళ్ళ కోరికయిన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఆవిర్భావానికి శ్రీ పొట్టి శ్రీరాములు ప్రాణ త్యాగం చేసిన విషయాన్నీ, సమైక్య రాష్ట్రం కోసం బూర్గుల రామకృష్ణారావు తన ముఖ్యమంత్రి పదవిని త్యజించిన అంశాన్నీ గట్టు గుర్తుచేశారు. వీటిని మరిచి కొందరు తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టేలా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. వరంగల్ ప్రాంతానికి చెందిన ప్రసిద్ధ పద్యకారుడు బమ్మెర పోతన రచించిన ఆంధ్ర భాగవతం నుంచి ఆంధ్ర శబ్దాన్ని అనుసరించి ఆంధ్ర ప్రదేశ్ రాష్ర్టానికి పేరు పెట్టారన్నారు. మంత్రులు జానా రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి తమ ప్రవర్తనతో తెలుగు ప్రజలందరి గౌరవాన్నీ కించపరిచేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. సమైక్య ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ ప్రాంత జిల్లాలో శుక్రవారం జాతీయ జెండాలు ఎగురవేసిన కలెక్టర్లను ఆ మంత్రులు అరెస్టు చేయించే సాహసానికి పూనుకోగలరా అని ప్రశ్నించారు. ఆ మంత్రులకు పదవులలో కొనసాగే హక్కు లేదని ఆయన స్పష్టంచేశారు.

ఆంధ్ర ప్రదేశ్ సమైక్యంగా ఉంటేనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని గట్టు చెప్పారు. రాష్ట్ర విభజన పెత్తందారి వ్యవస్థ పునరుద్ధరణకు మాత్రమే ఉపయోగపడుతుందని హెచ్చరించారు. నల్గొండ జిల్లాలో తమ పార్టీ గౌరవాధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ పర్యటనను తమ అనుచరుల ద్వారా అడ్డుకున్న మంత్రులు జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి వారి పెత్తందారీ మనస్తత్వాన్ని బహిర్గతం చేసుకున్నారని ఆయన విమర్శించారు. తెలంగాణ ప్రజలు సైతం వారి ప్రవర్తనను హర్షించడం లేదనీ, సిగ్గుతో తలదించుకున్నారనీ చెప్పారు.

మహానేత డాక్టర్ వైయస్ఆర్ మరణానంతరం ఆ విషాదాన్ని తట్టుకోలేక తెలంగాణ ప్రాంతంలోనే 375మంది ప్రాణాలు విడిచిన విషయన్ని గట్టు గుర్తుచేశారు. అలాంటి గడ్డపై డాక్టర్ వైయస్ఆర్ విగ్రహాలను ధ్వంసం చేయడంపై అభ్యంతరం తెలిపారు. డాక్టర్ వైయస్ఆర్ ప్రజల గుండెల్లో శాశ్వత స్థానాన్ని సంపాదించుకున్నారని చెప్పారు. ఆయన విగ్రహాలను ధ్వంసం చేసినంత మాత్రాన ఆయన జ్ఞాపకాలను తెలంగాణ ప్రజల హృదయాలనుంచి చెరిపివేయలేరని జానా, ఉత్తమ్ కుమార్ సహచరులకు గట్టు స్పష్టంచేశారు.
టీఆర్ఎస్‌పై ఆధిపత్యం సాధించడం కోసం ఇతర పార్టీలను లక్ష్యంగా చేసుకోవడం ఎంత సబబో జానారెడ్డి నిర్ణయించుకోవాలనీ, అలాగే తెలంగాణపై ఆయనకున్న ప్రేమాభిమానాలేపాటివో తేల్చుకోవాలనీ సూచించారు. టీఆర్ఎస్‌పై ఆధిపత్యం సాధించడానికి నేరుగా వారితోనే తలపడాలని గట్టు హితవు పలికారు.

జాతీయ జెండా ఆవిష్కరించిన జగన్

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రావతరణ సందర్భంగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. పార్టీ సీనియర్ నేతలు, వందల సంఖ్యలో కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మహాత్మా గాంధీ, శ్రీ  పొట్టి శ్రీరాములు, డాక్టర్ వైయస్ఆర్ చిత్రపటాలకు ఆయన పూలతో నివాళులర్పించారు.

Back to Top