‘తెలుగు కాంగ్రెస్’గా మారిన ఆ రెండు పార్టీలు

హైదరాబాద్ : అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం రెండూ కలిసిపోయాయని, ప్రస్తుతం అవి‌ రాష్ట్రంలో ‘తెలుగు-కాంగ్రెస్’గా వ్యవహరిస్తున్నాయని వై‌యస్‌ఆర్ కాంగ్రె‌స్‌ పార్టీ ఎమ్మెల్యేలు మండిపడ్డారు. సోమవారంనాడు శాసనసభ సమావేశాలు ప్రారంభం కావడానికి ముందు వీరు కాంగ్రెస్-‌టిడిపి కండువాలను‌ అతికించి మీడియా పాయింట్ వద్ద ప్రదర్శించారు.‌ టిడిపి పసుపు రంగు సగం, కాంగ్రెస్‌ పార్టీకి చెందిన మూడు రంగులు సగం సగం కలిపిన కండువాలను వారు ప్రదర్శించి అందరి దృష్టినీ ఆకర్షించారు.

పసుపు - మూడు రంగుల ఈ కండువాలు అసెంబ్లీలో తాజాగా నెలకొన్న రాజకీయ పరిస్థితికి అద్దం పడతాయని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి మీడియా ప్రతినిధులతో అన్నారు. అవిశ్వాసం సందర్భంగా ప్రధాన ప్రతిపక్షం నిస్సిగ్గుగా అధికార పక్షానికి కొమ్ముకాసిందని ఆయన దుయ్యబట్టారు. ఎమ్మెల్సీ, సహకార ఎన్నికల్లో కలిసి పోటీ చేసిన కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల ఎజెండా ఒక్కటే అని, అందుకే ఈ కండువాలు ప్రదర్శించామని అన్నారు. దేశంలోని చిల్లర వర్తకంలో విదేశీ పెట్టుబడుల (ఎ‌ఫ్‌డిఐ) బిల్లు సందర్భంగా కాంగ్రెస్ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి, అవిశ్వాసం సందర్భంగా రాష్ట్ర‌ ప్రభుత్వానికి చంద్రబాబు మద్దతు ఇచ్చారన్నారు. ఇదేవిధంగా రెండు పార్టీలు కలిసి రానున్న ఎన్నికల్లో ‘తెలుగు-కాంగ్రెస్’గా పోటీ చేసినా చేయ‌వచ్చని భూమన ఆక్షేపించారు.
Back to Top