ఏకపక్షంగా తెలంగాణ విభజన: విజయమ్మ

హైదరాబాద్ 19 ఆగస్టు 2013:

జవహర్ లాల్ నెహ్రూ ప్రధానిగా ఉండగా రాష్ట్రాల పునర్విభజనకు ఫజల్ అలీ నాయకత్వంలో మొదటి ఎస్.ఆర్.సి. ఏర్పాటుచేశారని విజయమ్మ చెప్పారు. గుంటూరులో సోమవారం నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభించిన సందర్భంగా ఆమె తెలంగాణ విభజనపై దివంగత మహానేత అభిప్రాయాలను వివరిస్తూ అనేక విషయాలను ప్రస్తావించారు. భాష ప్రాతిపదికన రాష్ట్రాల ఏర్పాటు సాగాలని ఆ కమిటీ చెప్పిన విషయాన్ని ఆమె గుర్తుచేశారు. ఆ కమిటీ సూచన మేరకే ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటక, తదితర రాష్ట్రాలు ఆవిర్భవించాయన్నారు. నేడు 30 లక్షలున్న నాగాలాండ్ జనాభా ఆ రోజుల్లో చాలా తక్కువనీ, కానీ భాషా ప్రయుక్త రాష్ట్రాల ప్రాతిపదికన ఆ రాష్ట్రాన్ని ఏర్పాటుచేశారనీ ఆమె వివరించారు. గూర్ఖాల్యాండ్, బోడోల్యాండ్, తదితర 15రాష్ట్రాలు కావాలనే డిమాండ్లు ప్రస్తుతం వినిపిస్తున్నాయన్నారు. డిమాండును బట్టి 2001లో కేంద్రం రెండో ఎస్సార్సీని నియమించిందని తెలిపారు. దాని ప్రకారం తీసుకున్న మార్గదర్శకాలు పాటించారన్నారు.  అప్పట్లో తెలంగాణ డిమాండు ఉంది కాబట్టి రాజశేఖరరెడ్డి గారు రెండో ఎస్సార్సీకి మొగ్గుచూపారని తెలిపారు. 2004లో కేసీఆర్ రెండో ఎస్సార్సీపై సంతకం కూడా చేశారని చెప్పారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం మరిచిపోయిందని ఆమె విమర్శించారు. రెండో ఎస్సార్సీలో చెప్పిన అంశాలను పరిగణనలోకి తీసుకోకుండానే ప్రస్తుతం ఏకపక్షంగా తెలంగాణ విభజనంటూ నిర్ణయించిందని శ్రీమతి విజయమ్మ మండిపడ్డారు.

2009 ఎన్నికల అనంతరం తొమ్మిది అంశాలతో రాజశేఖరరెడ్డిగారు రోశయ్య కమిటీని నియమించారని తెలిపారు. ఈ తొమ్మిది అంశాలకు సంబంధించి ఆయన జివో 99ని విడుదల చేశారన్నారు. ఆర్థిక అంశాలు, ఉద్యోగాలలో అన్యాయం అన్న డిమాండులో వాస్తవం ఎంతనే విషయం తెలుసుకోవాలని రాజన్న స్పష్టంగా సూచించారన్నారు. మైనారిటీల మనోభావాలు, మెట్రోపాలిట్ నగరానికి వచ్చి ఉన్న వారి భయాందోళనలు చూడాలని కూడా ఆలోచించారన్నారు. తెలంగాణను విడదీస్తే మావోయిస్టు కార్యకలాపాలు పెరుగుతాయన్న అంశంపై కూడా సునిశిత పరిశీలన చేయాలని రాజన్న కోరారన్నారు. నీటి పంపకాలు, పరిష్కారాలు చూడాలని కోరారన్నారు. ప్రత్యేక రాష్ట్ర వాదనలు ఎందుకు వస్తున్నాయో కూడా పరిశీలించాలని మహానేత వైయస్ఆర్ కమిటీకి సూచించారన్నారు. విభజించాల్సి వస్తే.. ఏ సంస్థని ఏ ప్రాంతానికి పంపగలమో కూడా సూచించాలని కమిటీని ఆదేశించారన్నారు. తెలంగాణను విడదీయాల్సి వస్తే  రెండు ప్రాంతాలలో సుహృద్భావ వాతావరణాన్ని ఎలా నెలకొల్పాలో కూడా సూచించాలని కోరారన్నారు. వీటన్నింటికి పరిష్కరాలు దొరికితేనే ముందడుగు వేయాలనీ, లేకపోతే లేదనీ మహానేత స్పష్టంగా కోరారన్నారు.

మనదనే భావనతో యావదాంధ్ర ప్రజలు హైదరాబాద్ మహానగరాన్ని అభివృద్ధి చేసుకున్నారన్నారు. ఈ కారణంగా అన్ని రకాల సంస్థలు ఈ నగరంలోనే నెలకొన్నాయన్నారు. బీహెచ్ఈఎల్, బీడీఎల్, ఐడీపీఎల్, హెచ్ సీఎల్, ఆయుధ కర్మాగారం ఇలాగా.. ఎన్నో సంస్థలు నెలకొన్నాయనీ, వీటిపై ఆధారపడి ఒక్కొక్క దానిపై కనీసం వంద పరిశ్రమలు ఏర్పడ్డాయనీ శ్రీమతి విజయమ్మ వివరించారు. ఇవి కాక ఎన్నో పరిశోధనాత్మక సంస్థలు, ఉన్నత విద్యా సంస్థలు ఏర్పాటయ్యాయన్నారు. దీనివల్లే రాష్ట్ర ఆదాయంలో 45శాతం హైదరాబాద్ నగరంలోనే ఉందన్నారు. హైదరాబాద్ లో 54వేల కోట్ల రూపాయల ఆదాయం లభిస్తోందన్నారు. సీమాంధ్ర ఆదాయం కేవలం 200 కోట్ల రూపాయలు మాత్రమేనని చెప్పారు. పని దొరక్కపోతే హైదరాబాద్ వెళదామని ప్రతి ఒక్కరు అనుకునే స్థాయికి హైదరాబాద్ చేరిందన్నారు. ఆస్పత్రులు 90శాతం అక్కడే ఉన్నాయన్నారు.
చంద్రబాబు చెప్పినట్లు నాలుగైదు లక్షల కోట్ల రూపాయలతో మరో రాజధాని నిర్మించుకోవడం సాధ్యం కాదన్నారు. అంతకు నాలుగైదింతలు ఖర్చుచేసిన హైదరాబాద్ లాంటి నగరాన్ని నిర్మించుకోవడం అసాధ్యమని పేర్కొన్నారు.
ఆఖరుగా ఆమె సమైక్యాంధ్ర కోసం మరణించిన వారికోసం శ్రీమతి విజయమ్మ రెండు నిముషాలు మౌనం పాటించి సంతాపం తెలిపారు.

తాజా ఫోటోలు

Back to Top