తెలంగాణ సెంటిమెంట్‌ను గౌరవిస్తున్నాం

హైదరాబాద్, 28 డిసెంబర్ 2012:

నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల సెంటిమెంట్‌ను గౌరవిస్తున్నామని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు పిల్లి సుభాష్‌చంద్రబోస్, అధికార ప్రతినిధులు జనక్ ప్రసాద్, అంబటి రాంబాబు స్పష్టం చేశారు. రాజకీయ ప్రయోజనాలకోసం కాంగ్రెస్ పార్టీ తమ వైఖరి వెల్లడించకుండా అధికారంలోలేని ఇతర పార్టీలు అభిప్రాయాలు చెప్పాలని ఒత్తిడి  చేస్తోందని వారు ఆరోపించారు. కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మొదట తన వైఖరి  స్పష్టం చేసి తీరాల్సిందేనని డిమాండ్ చేశారు. 2011లో ఇడుపులపాయలో జరిగిన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమావేశాల్లోనే పార్టీ వైఖరిని అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహనరెడ్డి స్పష్టం చేశారని అన్నారు.

     పార్టీ మొదటి ప్లీనరీలో తెలంగాణపై చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నామని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి జనక్ ప్రసాద్ చెప్పారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో స్పష్టత లేదనడం అర్థరహితమని ఆయన కొట్టి పారేశారు. అఖిలపక్షం పెడుతామని కొన్నాళ్లు, పెట్టమని కొన్నాళ్లు చెప్పిన కాంగ్రెస్ పార్టీలోనే స్పష్టత లేదన్నారు. తమ తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలను మచ్చిక చేసుకుని ఎఫ్‌డీఐ బిల్లు పాస్ చేసుకోవడానికి ఆడిన డ్రామాలో భాగమే అఖిల సమావేశమన్నారు. ప్లీనరీలో శ్రీ జగన్మోహనరెడ్డి చెప్పినట్లుగా ఆర్టికల్ 3 ప్రకారం కేంద్రం నిర్ణయం తీసుకోవచ్చని అన్నారు. కేంద్రం ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటామని తాము ఏనాడో చెప్పామన్నారు.

     తెలంగాణలో బలపడుతున్న వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేడర్‌ను చూసి టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖరరావు భయపడి అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు. తెలంగాణపై స్పష్టత ఇవ్వలేదంటూ విమర్శలు చేస్తున్నారన్నారు. మూడు నెలల్లో తెలంగాణ వస్తుందన్న కేసీఆర్ కాంగ్రెస్‌ను కాకుండా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విమర్శించే నైతిక హక్కు లేదని జనక్ ప్రసాద్ అన్నారు.

      తెలంగాణ కోసం ప్రాణాలర్పించిన 700 మంది విద్యార్థులకు ఇడుపులపాయలో జరిగిన ప్లీనరీలో నివాళులు అర్పించిన విషయం ఇతర పార్టీల నేతలు గుర్తుంచుకోవాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. తెలంగాణ ప్రజల్లో సెంటిమెంట్ ఉన్న మాట వాస్తవమని, అన్ని పార్టీలు గౌరవించి నిర్ణయాలు తీసుకోవాల్సిందేనని అన్నారు. అయితే, ఆ నిర్ణయం తీసుకునే అధికారం, శక్తి ఒక్క కాంగ్రెస్ పార్టీకే ఉన్నాయని అన్నారు. ఆ దిశగా కాంగ్రెస్ ఆలోచన చేయకుండా ఇతర పార్టీలను దెబ్బతీయాలనే కుటిల రాజకీయాలకు పాల్పడుతోందన్నారు. ఎలాంటి అభిప్రాయాలు చెప్పని కాంగ్రెస్ ప్రతినిధులు అఖిలపక్ష సమావేశానికి ఎందుకు వెళ్లారని అంబటి ప్రశ్నించారు.

Back to Top