తెలంగాణ సస్య శ్యామలానికి రాజన్న తపించారు

ఆత్మకూర్:

ప్రత్యేక తెలంగాణకు వైయస్ఆర్ కాంగ్రెస్ కట్టుబడి ఉందని చెప్పినప్పటికీ తమ పార్టీ అధినేత జగన్మోహన్‌ రెడ్డి, మహానేత వైయస్ఆర్ పై కేసీఆర్ విమర్శలు చేయడం సరికాదని ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి బాజిరెడ్డి గోవర్ధన్‌ రెడ్డి, సీఈసీ సభ్యులు ఆది శ్రీనివాసులు హితవు పలికారు. తమ అధినేత జగన్మోహన్‌ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎంపీగా ఉన్నప్పుడు ఆ పార్టీ ఆదేశాల మేరకే పార్లమెంట్‌లో ప్లకార్డులు ప్రదర్శించారని చెప్పారు. ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించి, ప్రత్యేక తెలంగాణకు అనుకూలమని ప్రకటించిన విషయాన్ని వారు గుర్తు చేశారు. వైయస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక జిల్లాను స స్యశ్యామలం చేసేందుకు వేల కోట్ల నిధులతో నాలుగు ప్రాజెక్టులు ప్రారంభించారన్నారు. మహానేత హయాంలో 85 శా తం పనులు పూర్తయినా, ఈ మూడేళ్లలో ప్రభుత్వం మిగిలిన 15 శాతం పనులను పూర్తి చేయించలేక పోయిందని విమర్శించారు. అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం టీడీపీలతో పాటు టీఆర్‌ఎస్ కుట్రలను ప్రజలు గమనిస్తున్నారని, ఎవరెన్ని కుట్రలు చేసినా జగన్మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రవ్వడం ఖాయమన్నారు. జిల్లాలో షర్మిల నిర్వహిస్తున్న ‘మరో ప్రజా ప్రస్థానం’పాదయాత్ర విజయవంతంగా కొనసాగుతోందని, ఈ పాదయాత్రతో అన్ని ప్రాంతాల్లోని ప్రజలకు రాజన్న రాజ్యం రానుందనే భరోసా కలుగుతోందన్నారు.

Back to Top