ప్యాకేజీ మేలనడం..

 • ఎన్టీఆర్‌ వెన్నుపోటు కంటే ఘోరం
 • నమ్మి ఓటేస్తే..కాటేస్తున్న చంద్రబాబు
 • వెంకయ్యను అసహ్యించుకుంటున్న రాష్ట్ర ప్రజలు
 • బాబు, వెంకయ్య ప్రతిపక్షంలో ఉంటేనే ప్రజలకు మేలు
 • గవర్నర్‌ స్పీచ్‌తో బయటపడ్డ బాబు ఎంవోయూల బాగోతం
 • మోడీకి భయపడితే మాతో కలిసిరా బాబూ
 • వైయస్‌ఆర్‌ సీపీ అధికార ప్రతినిధి కొలుసు పార్థసారధి

 • హైదరాబాద్‌:  ప్రత్యేక హోదా కంటే ప్యాకేజీ మేలని చంద్రబాబు చెప్పడం సొంత మామ స్వర్గీయ ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచినదానికంటే ఘోరమైందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి, మాజీ మంత్రి కొలుసు పార్థసారధి విమర్శించారు. కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు, సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదాను నీరుగార్చడమే పనిగా పెట్టుకొని ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన రాజకీయవేత్తల వ్యక్తిత్వాన్ని ప్రజలంతా అసహ్యించుకునే స్థాయికి దిగజారారని పార్థసారధి చెప్పారు. హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యాలయంలో మంగళవారం పార్థసారధి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా హోదాపై చంద్రబాబు, వెంకయ్యనాయుళ్ల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా విషయంలో వెంకయ్య నాయుడు పార్లమెంట్‌ సాక్షిగా ఎన్ని మాటలు మార్చారో ఈ మూడు సంవత్సరాల్లో రాష్ట్ర ప్రజానికానికి అర్థమైందన్నారు. చంద్రబాబు, వెంకయ్యలు ప్రతిపక్షంలో ఉంటే రాష్ట్ర సమస్యలు పరిష్కారం అవుతాయేమోనని అనిపిస్తోందన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రైతులు, కూలీలు, రాష్ట్ర సమస్యలపై బ్రహ్మాండంగా మాట్లాడతారు కానీ అధికారం గద్దెనెక్కగానే ఇద్దరు నాయుళ్లకు ఏదో మత్తు ఆవహించి ప్రజా సమస్యలను మర్చిపోయి స్వార్ధంతో ఆలోచించే స్వభావాన్ని పొందుతారని విమర్శించారు. 
  చేతగానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి అబద్ధాలు
  ప్రత్యేక హోదాతో లాభాలు లేకపోతే వెంకయ్య ఎన్నికల సమయంలో ఓట్ల కోసం ప్రధాని, ముఖ్యమంత్రి అభ్యర్థుల సాక్షిగా పుసక్తం వేసి మరీ నేనే ఛాంపియన్‌ అని ఎందుకు చెప్పుకున్నారని పార్థసారధి ప్రశ్నించారు. రాజ్యసభలో ఏపీ హోదాకు ఇతర రాష్ట్రాలు అభ్యంతరాలు చెప్పాయని చెప్పిన వెంకయ్య మొన్న జరిగిన సమావేశ్లాలో ఏ రాష్ట్రాలు అభ్యంతరం చెప్పలేదు. దీనికి వెంకయ్య సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. నిజంగా హోదా ఇవ్వలేక చేతగాని తనాన్ని కప్పిపుచ్చుకోవడానికి నీరుగారుస్తున్నారా అని వెంకయ్య నాయుడిని ప్రశ్నించారు. హోదా వల్ల ఉపయోగం లేదని ప్రచారం ఎందుకు ప్రజల్లోకి తీసుకెళ్తున్నారని ప్రశ్నించారు. 5 కోట్ల ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా బీజేపీ, టీడీపీ ప్రభుత్వాలు పనిచేస్తున్నాయని ధ్వజమెత్తారు. పార్లమెంట్‌ సాక్షిగా ఇచ్చిన హామీని అమలు చేయకపోతే అది బీజేపీ, టీడీపీల వైఫల్యమే అని స్పష్టం చేశారు. 
  ప్యాకేజీకి చట్టబద్దత కల్పించారా..?
  ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చిన పరిశ్రమలకు రాయితీలు రావని చంద్రబాబు ఆయన కోటరీ బరితెగించి అబద్ధాలు ఆడుతున్నారని పార్థసారధి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదాను చిన్నదిగా చేసి చూపించడానికి వెంకయ్యనాయుడు హోదా వల్ల రూ. 3,500 కోట్లే కదా అని అబద్ధాలు ఆడుతున్నారన్నారు.  
  ఏ గణాంకాల ఆధారంగా ఆ నిధులు ఎస్టిమేట్‌ చేశారని పార్థసారధి వెంకయ్యనాయుడిని ప్రశ్నించారు. ప్యాకేజీని తీసుకొచ్చామని గొప్పలు చెప్పుకుంటున్నారు కానీ ఇప్పటికీ ప్యాకేజీ వచ్చి 5 నెలలు గడిచింది ఇప్పటి వరకు చట్టబద్ధత కల్పించలేదని చెప్పారు. కేవలం చంద్రబాబు ముడుపుల కోసం ప్యాకేజీని స్వాగతించారని చెప్పారని మండిపడ్డారు.  సుజనా చౌదరి ప్రత్యేక హోదాను పందుల పందెలతో పోల్చడం నిజంగా దిగజారుడు రాజకీయమని పార్థసారధి వ్యాఖ్యానించారు. కేంద్రమంత్రి సుజనా చౌదరికి అసలు మెదడు పనిచేస్తుందో లేదో అర్థం కావడం లేదన్నారు. ఎందుకు ఆంధ్రరాష్ట్ర ప్రజల మనోభావాలను దెబ్బతీయాలనుకుంటున్నారని ప్రశ్నించారు. 
  లక్షలు కాదు వేల పెట్టుబడులే..
  గణతంత్ర దినోత్సవం రోజున సాక్షాత్తు గవర్నర్‌ స్పీచ్‌లో చంద్రబాబు ఎంవోయూల తతంగం అంతా బట్టబయలు అయ్యిందని పార్థసారధి అన్నారు. గతేడాది రూ. 15 లక్షల కోట్లు, ఈ ఏడు రూ. 10 లక్షల కోట్ల ఎంవోయూలు కుదుర్చుకున్నామని చంద్రబాబు గొప్పలు చెప్పుకుంటున్నారన్నారు. కానీ వాస్తవ పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయన్నారు. రూ. 5 వేల 980 కోట్లు ఇప్పటి వరకు వచ్చాయి. 102 ప్రాజెక్టులు పైపులైన్‌లో ఉన్నాయని గవర్నర్‌ చెప్పారని గుర్తు చేశారు.  ఆంధ్రప్రదేశ్‌లో రూ. 5,980 కోట్లు మాత్రమే పెడితే మహారాష్ట్రాలో దాదాపు రూ. 40 వేల కోట్ల పెట్టుబడులు పెట్టారని చెప్పారు. ప్రత్యేక హోదా వచ్చివుంటే ఇతర రాష్ట్రాల్లో ఏర్పాటు చేయాలనుకున్న పరిశ్రమలు రాష్ట్రానికి వచ్చేవి కావా అని వెంకయ్యను ప్రశ్నించారు. చంద్రబాబు క్యాబినెట్‌లో ఉన్నవారంతా మంచి వ్యాపార వేత్తలు కదా ఎందుకు మన రాష్ట్రంలో వారితో పరిశ్రమలు ఏర్పాటు చేయించలేకపోయారని చంద్రబాబును నిలదీశారు. అనుభవజ్ఞులని నమ్మి ఓటేస్తే కాటేస్తారా అని ధ్వజమెత్తారు. 
  వైయస్‌ జగన్‌తోనే హోదా సాధ్యం
  వైయస్‌ జగన్‌ నేతృత్వంలో ప్రత్యేక హోదా కోసం గల్లీ నుంచి ఢిల్లీ వరకు పోరాటాలు చేశామని పార్థసారధి గుర్తు చేశారు. చంద్రబాబుకు మోడీ అంటే భయం అయితే మాతో కలిసి రావాలని సూచించారు. ప్రత్యేక హోదాతో రాష్ట్రానికి అన్యాయం జరుగుతందని మీరు భావిస్తే చంద్రబాబు నిర్భయంగా మీడియా ముందుకు వచ్చి వాస్తవాలు  చెప్పాలని డిమాండ్‌ చేశారు. అంతేగానీ హోదా ఉద్యమాలపై ఉక్కుపాదం మోపితే సహించేది లేదని హెచ్చరించారు. ప్రత్యేక హోదా సాధించే వరకు వైయస్‌ఆర్‌ సీపీ పోరాడుతుందని స్పష్టం చేశారు. వైయస్‌ఆర్‌ సీపీ అధినేత, ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ద్వారా ఏపీకి ప్రత్యేక హోదా సాధ్యం అవుతుందని చెప్పారు.
Back to Top