వైయ‌స్ఆర్‌సీపీపై క‌క్ష‌సాధింపు

  • సోషల్‌ మీడియా విభాగంపై పోలీసులు దాడి
  • సిబ్బందిని భ‌య‌భ్రాంతుల‌కు గురి చేసిన ఏపీ పోలీసులు
  • వ్య‌క్తిగ‌త వివ‌రాల‌పై ఆరా తీసిన అడిష‌న‌ల్ ఎస్పీ
  • ఈ నెల 25న విచార‌ణ‌కు హాజ‌రుకావాల‌ని మీడియా ఇన్‌చార్జ్‌కు నోటీసులు
  • చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే సహించేది లేదు
  • పోలీసులు ప్రభుత్వానికి తొత్తులుగా వ్యవహరించొద్దుః విజయసాయిరెడ్డి
 హైదరాబాద్‌:  పోలీసుల‌ను అడ్డుపెట్టుకొని అధికార తెలుగు దేశం పార్టీ సోష‌ల్ మీడియాపై ఉక్కుపాదం మోపుతోంది. ప్ర‌తిప‌క్ష వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీపై క‌క్ష‌సాధింపు చ‌ర్య‌ల‌కు తెర లేపింది. మంత్రి నారా లోకేష్‌పై సోష‌ల్ మీడియాలో జ‌రుగుతున్న ప్ర‌చారాన్ని జీర్ణించుకోలేక‌, ఆ కోపాన్ని వైయ‌స్ఆర్‌సీపీపై చూపేందుకు చ‌ట్ట వ్య‌తిరేక చర్య‌ల‌కు పాల్పడుతున్నారు. ఈ క్ర‌మంలో శ‌నివారం ఉద‌యం ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి చెందిన పోలీసులు వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోష‌ల్ మీడియా విభాగంపై దాడులు చేశారు. ఏఎస్పీ, డీఎస్పీ, సీఐ, ఎస్ఐ, ప‌లువ‌రు పోలీసులు సోష‌ల్ మీడియా విభాగం సిబ్బందిని భ‌య‌భ్రంతుల‌కు గురి చేశారు. వ్య‌క్తిగ‌త వివ‌రాల‌పై ఆరా తీసి భ‌యాందోళ‌న‌కు గురి చేశారు. పోలీసుల తీరును వైయ‌స్‌ఆర్‌ సీపీ ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి ఎమ్మెల్యేలు శ్రీనివాసులు, అనిల్‌ కుమార్‌ యాదవ్‌, మాజీ ఎమ్మెల్యే కన్నబాబు, జోగి రమేష్‌ తదితరులు ఖండించారు. సోదాలు చేస్తున్న పోలీసుల చర్యలకు అభ్యంతరం తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడుతూ పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలే తప్ప, తాబేదారులుగా ఉండకూడదన్నారు. ఇవ్వాళ జరిగినవే రేపు జరుగుతాయని, ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని హెచ్చ‌రించారు. చట్టబద్ధంగా వ్యవహరిస్తే ఎవరికీ అభ్యంతరం ఉండదని, చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే ఊరుకునేది లేదని ఎంపీ విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. పోలీసుల సమక్షంలోనే ఏపీ అసెంబ్లీ సెక్రటరీకి ఫోన్‌ చేశారు. టీడీపీ ఎమ్మెల్సీ టీడీ జనార్ధన్ ఫిర్యాదుపై మీరెలా స్పందిస్తారంటూ ఈ సందర్భంగా అసెంబ్లీ కార్యదర్శిని విజయసాయిరెడ్డి నిలదీశారు.

లోకేష్ ప‌ప్పు, అస‌మ‌ర్థుడు
మంత్రి నారా లోకేష్ ప‌ప్పు, అస‌మ‌ర్థుడ‌ని ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి పేర్కొన్నారు. తానే ఈ విధంగా పోస్టులు పెడ‌తాన‌ని, త‌న‌పై కేసు న‌మోదు చేసుకోవాల‌ని ఆయ‌న సూచించారు. ప్రభుత్వ తప్పులు, లోపాలను సోషల్‌ మీడియా ఎత్తిచూపడంపై చంద్రబాబు క‌క్ష‌ సాధింపు చ‌ర్య‌ల‌కు దిగార‌ని మండిప‌డ్డారు. ఏపీ సర్కార్‌  నేరుగా ఎదుర్కోలేకే అరెస్ట్‌లు చేసి భయభ్రాంతులను చేయాలని వ్యూహంతో ముందుకు వెళుతోంద‌ని ధ్వ‌జ‌మెత్తారు. వైయ‌స్‌ జగన్ మోహ‌న్‌రెడ్డి, ఆయన కుటుంబసభ్యులపై అనేక అవాకులు, చవాకులు పేలారని, సభ్య సమాజం హర్షించలేని పోస్టింగ్‌లు వైయ‌స్‌ జగన్‌పై పెట్టారన్నారు. ఈ విషయంలో టీడీపీ కార్యాలయంలో సోదాలు చేసే శక్తి మీకు ఉందా అని సాయిరెడ్డి  ప్రశ్నించారు.  వైయ‌స్‌ఆర్‌ సీపీ సోష‌ల్ మీడియా విభాగానికి త‌న‌ను వైయ‌స్ జ‌గ‌న్ ఇన్‌చార్జ్‌గా నియ‌మించార‌ని పోలీసుల‌కు విజ‌య‌సాయిరెడ్డి తెలిపారు. ఏదైనా నోటీసులు ఇవ్వదలిస్తే తనకు ఇవ్వాలని విజయసాయిరెడ్డి అన్నారు. చర్యలు తీసుకుంటే తనపై తీసుకోవాలని ఆయన పోలీసులుతో తెలిపారు. వైయ‌స్‌ జగన్‌ను దూషిస్తూ మంత్రి లోకేశ్‌ పెట్టిన ట్వీట్లను వైయ‌స్‌ఆర్‌ సీపీ నేతలు పోలీసులకు చూపించారు. ఈ సంద‌ర్భంగా వైయ‌స్‌ఆర్‌సీపీ ఐటీ వింగ్‌కు చెందిన చల్లా మధుసూదన్‌ రెడ్డికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈనెల 24న విచారణకు హాజరు కావాలని ఏపీ పోలీసులు తెలిపారు. పోలీసుల చ‌ర్య‌ల‌ను పార్టీ నాయ‌కులు ఖండించారు. చంద్ర‌బాబు ప్ర‌భుత్వం ఇలాంటి దుశ్చ‌ర్య‌లు మానుకోక‌పోతే సోష‌ల్ మీడియాలో ఉద్య‌మం ఉధృత‌మ‌వుతుంద‌ని వైయ‌స్ఆర్‌సీపీ నేత‌లు హెచ్చ‌రించారు. 
Back to Top