దాడులు చేయడం టీడీపీ నైజం

  • అఖిలప్రియపై ఎలాంటి దాడి జరగలేదు
  • వైయస్‌ జగన్‌ పర్యటనలో వచ్చిన సమస్యలను పక్కదారి పట్టించేందుకు టీడీపీ కుట్రలు
  • దమ్ముంటే భూమా, ఆయన కూతురు రాజీనామా చేసి గెలవాలి
  • దాడులకు పాల్పడిన టీడీపీ ఎమ్మెల్యేలను ఎందుకు అరెస్టు చేయడం లేదు
  • తుళ్లూరు ప్రాంతంలో పంటలకు నిప్పుపెట్టిన వారిని ఎందుకు శిక్షించలేదు
  • వైయస్‌ఆర్‌సీపీ కార్యకర్తలను అదుపులో తీసుకోవడం దారుణం
  • వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు
గుంటూరు: రాజధాని ప్రాంతంలో పర్యటించిన వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డికి ప్రజలు బ్రహ్మరథం పట్టడంతో ఓర్వలేక టీడీపీ కట్టుకథలు అల్లి ఎమ్మెల్యే భూమా అఖిలప్రియపై దాడి జరిగినట్లు చిత్రీకరిస్తున్నారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు పేర్కొన్నారు. దాడులు చేయడం వైయస్‌ఆర్‌సీపీ నైజం కాదని, టీడీపీ ఎమ్మెల్యేలు దాడులకు పాల్పడ్డారని, అయినా వారిని పోలీసులు అరెస్టు చేయకపోవడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే వైయస్‌ జగన్‌ దృష్టికి వచ్చిన సమస్యలకు పరిష్కార మార్గాలు చూపాలని, ఇలాంటి దిగజారుడు రాజకీయాలు తగదని ఆయన హెచ్చరించారు. ఘటన జరిగిన సమయంలో తాను అక్కడే ఉన్నానని, అఖిలప్రియపై ఎలాంటి దాడి జరగలేదని అంబటి రాంబాబు తేల్చి చెప్పారు. శుక్రవారం గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడారు.  రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులందరికీ ప్లాట్లు ఇస్తామని చెప్పిన చంద్రబాబు మాట తప్పారని ఫైర్‌ అయ్యారు. రెండు సంవత్సరాల క్రితం భూములు తీసుకొని ఇవాళ చిత్తు కాగితాలు ఇచ్చారని మండిపడ్డారు. లంక భూములు, అసైన్డ్‌ భూములు ఇచ్చిన రైతులకు  వేరువేరుగా ప్లాట్లు ఇస్తున్నారని ఆరోపించారు. 

నిన్న జరిగిన వైయస్‌ జగన్‌ పర్యటనలో రైతులు ప్రతిపక్ష నేతకు చెప్పిన సమస్యలకు పరిష్కార మార్గాలు కనుక్కోవాలి తప్ప..ప్రతిపక్ష నేతపై చౌకబారు విమర్శలు చేయడం సరికాదని సూచించారు. ఇలా చేస్తే భవిష్యత్తులో టీడీపీ నేతలు మూల్యం చెల్లించుకోకతప్పదని హెచ్చరించారు.  ప్రజలు తండోపతండాలు వచ్చి వైయస్‌ జగన్‌కు సమస్యలు మొరపెట్టుకున్నారని తెలిపారు. ఎమ్మెల్యే అఖిలప్రియ వస్తున్నప్పుడు దాడి జరిగిందని, పోలీసుల సాయంతో ఆమె తప్పుకున్నదని చెప్పి ఉత్తుత్తి కార్యక్రమానికి తెర లేపారన్నారు. వైయస్‌ జగన్‌ పర్యటించినపుడు వచ్చిన సమస్యలు పక్కదారి పట్టించుకోవడం బాధాకరమన్నారు. ఆ సంఘటన జరిగినప్పుడు తాను అక్కడే ఉన్నానని, అఖిలప్రియ కంటే ముందు జూపూడి ప్రభాకర్‌ వెళ్లాడని,  ఆ తరువాత అఖిలప్రియ వచ్చిందన్నారు.  ఆమెను చూసి జనం వచ్చారని తెలిపారు.  అక్కడ ఎలాంటి దాడి జరగలేదని, కానీ మంత్రి  దేవినేని ఉమా అక్కడ దాడి జరిగిందని చెప్పడం హాస్యాస్పదమన్నారు.  దాడి చేయాల్సిన అవసరం వైయస్‌ఆర్‌సీపీకి లేదు. అది మా నైజం కాదు. ఇవాళ వైయస్‌ఆర్‌సీపీకి చెందిన 8 మంది కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకోవడం సరికాదని ఖండించారు. 

టీడీపీ ఎమ్మెల్యేలకు అలాంటి బుద్ధి ఉందని, ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ మహిళా అధికారిపై దాడి చేసిన ఎలాంటి చర్యలు తీసుకోదన్నారు.  మొన్న ఎమ్మెల్సీ సతీష్‌ టూరిజం అధికారిపై ఎలా వ్యవహరించారో అందరం చూశామన్నారు. ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి ఓ కాంట్రాక్టర్‌ను ఎంత దౌర్జన్యంగా బెదిరించారో వాట్సప్‌లో చూశామని గుర్తు చేశారు. ఇవన్నీ చంద్రబాబుకు కనిపించవా అని ప్రశ్నించారు. అఖిలప్రియ కారును తిప్పుకొని పొమ్మని చెబితే అది దాడి అంటున్నారని తప్పుపట్టారు. వైయస్‌ జగన్‌ నంద్యాలకు  ఎలా వస్తారో అని బెదిరించడం సరికాదని, ఆయనకు చిత్తశుద్ధి ఉంటే తాను, తన  కూతురు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్లీ గెలవాలని భూమాకు సవాల్‌ విసిరారు. వైయస్‌ జగన్‌ తప్పనిసరిగా నంద్యాలకు వస్తారని, ప్రచారం చేస్తానని చెప్పారు. దివంగత ఎమ్మెల్యే భూమా శోభానాగిరెడ్డి అంటే మాకు అమితమైన అభిమానం ఉందని, భూమా నాగిరెడ్డి మీ స్థాయి దిగజార్చుకోవద్దని హితవు పలికారు. ఇంతకుముందు వైయస్‌ జగన్‌పై టీడీపీ నేతలు ఎంత ఆరోపణలు చేశారో చూశామన్నారు.. 2015లో తుళ్లూరు ప్రాంతంలో పంటలకు నిప్పుపెట్టించింది వైయస్‌ జగన్‌ అని ఆరోపించారన్నారు. అయితే ఇంతవరకు ఆ కేసులో ఒక ముద్దాయినైనా పట్టుకున్నారా? అని నిలదీశారు. అంటే ఆ దుశ్చర్యకు పాల్పడింది టీడీపీ నేతలు కాబట్టి ఎలాంటి చర్యలు తీసుకోలేదని దుయ్యబట్టారు.  కాంట్రాక్టర్లను బెదిరించి ఎమ్మెల్యేలు, దాడి చేసే ఎమ్మెల్సీలపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో పోలీసులు సమాధానం చెప్పాలన్నారు. ఇవాళ పత్రికల్లో ఓ వార్త చదివాను. ప్యాన్సీ నెంబర్‌ కోసం పోటీకి వచ్చిన వ్యక్తిపై టీడీపీ ఎమ్మెల్యే ఇష్టారాజ్యంగా ప్రవర్తించారని. ఆ వీడియోలో బూతులు కూడా ఉన్నాయని వినిపించారు. అలాంటి సంస్కృతి టీడీపీ నేతలదే అని గుర్తు చేశారు. ఇప్పటికైనా చంద్రబాబు రాజధాని ప్రాంతంలో ప్రతిపక్ష నేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి వచ్చిన సమస్యలకు పరిష్కార మార్గాలు చూపాలని అంబటి రాంబాబు డిమాండ్‌ చేశారు.
 
Back to Top