టీడీపీకి 17 సీట్లు కూడ రావు

  • చంద్రబాబు పాలన ఆంధ్రదేశానికి చీకటి యుగం
  • అవినీతి, అరాచకాలు, దోపిడీలు దౌర్జన్యాలతో కసాయి పాలన
  • దొంగబలం చూసి ప్రజాబలం ఉందనుకోవడం భ్రమే
  • బాబుకు స్కాములే తప్ప స్కీములు తెలియవు
  • ఇత పార్టీ ఎమ్మెల్యేలకు పచ్చకండువాలు కప్పడం దుర్మార్గం
  • ఆ పచ్చకండువాలే రేపు నాగుపాములుగా మారతాయి
  • తెలుగుద్రోహుల పార్టీపై ప్రజల తిరుగుబాటు తప్పదు
  • వైయస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్ రెడ్డి
హైదరాబాద్ః చంద్రబాబు పాలన ఆంధ్రదేశానికి చీకటియుగమని వైయస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్ రెడ్డి విమర్శించారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి  21 మంది వైయస్సార్సీపీ ఎమ్మెల్యేలను బెదిరించి, కోట్ల రూపాయలు- మంత్రి పదవులు ఆశచూపి మభ్యపెట్టి  పచ్చకండువాలు కప్పడం సిగ్గుచేటని చంద్రబాబుపై మండిపడ్డారు. తన పాలనపై విశ్వాసం, ఆత్మస్థైర్యం కోల్పోయి ఇతర పార్టీ ఎమ్మెల్యేలను కొనడం ద్వారా ప్రజా ఆమోదం పొందామని బాబు అనుకోవడం భ్రమేనన్నారు. సిగ్గులేకుండా టీడీపీ కండువాలు కప్పి చేర్చుకున్నారంటే బాబు రాజ్యాంగాన్ని ఎంత గొప్పగా ఉల్లంఘిస్తున్నారో చెప్పడానికి ఉప్పులేటి కల్పనను చేర్చుకోవడంతో మరోసారి బట్టబయలైందన్నారు. ఆ పచ్చకండువాలే రేపు నాగుపాములుగా మారుతాయన్న విషయాన్ని తెలుసుకోవాలని బాబుకు హితవు పలికారు. హైదరాబాద్ లో పార్టీ కేంద్ర కార్యాలయంలో భూమన కరుణాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. 

గత ఎన్నికల్లో 600 హామిలిచ్చి ఒక్కటి నెరవేర్చని మూలంగా ప్రజలు తీవ్ర వ్యతిరేకత తెలుపుతూ ప్రభుత్వంపై తిరుగుబాటుకు సిద్ధమవుతుంటే.... ఎమ్మెల్యేలను కొనడం ద్వారా జగన్ పార్టీ బలహీనపడుతుందన్న సంకేతాలు ప్రజలకు అందించాలన్న వక్ర మార్గాలకు బాబు పాల్పడుతున్నారని భూమన ఫైర్ అయ్యారు. పక్కరాష్ట్రం తెలంగాణలో ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ పార్టీలోకి వెళితే అక్కడ కోర్టులను ఆశ్రయించిన తెలుగుదేశం పార్టీ...ఏపీలో మాత్రం నిస్సిగ్గుగా రాజకీయ విలువలను దిగజార్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.  బాబుకు స్కాములే తప్ప స్కీములు తెలియవని భూమన దుయ్యబట్టారు.  ఏ రాజ్యాంగ నిబంధన కల్పించిన అవకాశంతో ఎమ్మెల్యేలను చేర్చుకున్నారో సమాధానం చెప్పాలన్నారు.  టీడీపీ అభ్యర్థులను ఓడించిన ఎమ్మెల్యేలను లోబర్చుకొమ్మని లోకేష్ రాజ్యాంగం రచించారా బాబు అని నిప్పులు చెరిగారు. 

నీకు అమ్ముడుపోయిన వాళ్లు, ప్రజాద్రోహులుగా మారిన వాళ్లు నీవైపు వచ్చినంత మాత్రాన ప్రజావ్యతిరేకత పెరుగుతుందే తప్ప బలం పెరుగుతుందనుకోవడం మూర్ఖత్వమని బాబుపై విరుచుకుడ్డారు.  వచ్చే ఎన్నికల్లో 175 స్థానాల్లో మా పార్టీ గెలుస్తుందని బాబు చెప్పడం హాస్యాస్పదమన్నారు. 175 కాదు కదా 17 సీట్లు కూడా రావని అన్నారు. అసెంబ్లీ సీట్లు పెరుగుతాయని మభ్యపెట్టి ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలను కొనగలడేమో గానీ ప్రజల ఆమోదాన్ని, అంగీకారాన్ని పొందలేడని భూమన స్పష్టం చేశారు. ఒక్క వర్గం కూడా బాబుకు ఓటేసేందుకు సిద్ధంగా లేరని చెప్పారు. తన అభివృద్ధి, సంక్షేమాన్ని చూసి ఓటు వేయమని చెప్పే ధైర్యం బాబుకు ఏ కోశాన లేదని చురక అంటించారు. పక్కింటి కాయల్ని కోసి మా పంట అని చెప్పుకునే దొంగ రాజకీయ నాయకుడు చంద్రబాబు అని భూమన మండిపడ్డారు. దొంగ బలాన్ని చూసి ప్రజాబలం ఉందనుకుంటే అంతకంటే దుర్మార్గం మరొకటి ఉండదని తూర్పారబట్టారు. 

బాబు ప్రభుత్వం కసాయి పరిపాలన సాగిస్తుంది తప్ప ప్రజాస్వామ్యబద్ధ రాజకీయాలతో, మానవతతో కూడిన ఆలోచనతో రాజకీయాలు చేయడం లేదని భూమన విమర్శించారు. ప్రజలకు మంచి పనులు చేసి ఆదరణ పొందాలే గానీ ఎమ్మెల్యేలను కొని ప్రజలు తనవైపు ఉన్నారని చెప్పుకోవడం సిగ్గుచేటు అన్నారు. రాజ్యాంగాన్ని ఏమాత్రం గౌరవించకుండా టీడీపీ శిక్షణా తరగుతుల శిబిరాల్లో, పార్టీ సమావాశాల్లో పచ్చకండువాలు కప్పుకొని ప్రసంగిస్తున్న వ్యక్తి స్పీకర్ గా ఉండడం దారుణమన్నారు.  పైన బీజేపీ, కింద డీజీపీ ఉన్నాడన్నఏకైక లక్ష్యంతో అవినీతి, అరాచకాలు, దోపిడీలు, దారుణాలతో ప్రజాస్వామ్యులను అణగదొక్కే పైశాచిక ఆనందంతో పరిపాలన సాగిస్తే ఎల్లకాలం మీ పాలన ఉండదన్న సంగతి తెలుసుకోవాలని బాబుకు హితవు పలికారు. మీ మోసపు వాగ్దానాలు నమ్మి తెలుగుజాతి అంతా బలైపోయారని..వచ్చే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. 

బాబు ద్వారా కొనబడ్డ ఎమ్మెల్యేలంతా బ్లాక్ మనీకి అమ్ముడుపోయిన బ్లాక్ ఎమ్మెల్యేలు అని భూమన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.  ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసే అధికారాన్ని స్పీకర్ కు కాకుండా ఈసీకి ఇవ్వాలని తమ నాయకుడు వైయస్ జగన్ గతంలో రాష్ట్రపతిని, కేంద్ర పెద్దలను కోరడం జరిగిందని చెప్పారు. ఇప్పటికైనా కేంద్రప్రభుత్వం రాజ్యాంగ సవరణ చేయడం ద్వారా స్పీకర్ అధికారాలను ఈసీకి ఇచ్చేలా తగు చర్యలు తీసుకోవాలన్నారు. నీచ రాజకీయాలు మాని ప్రజలకు ఇచ్చిన ప్రమాణాలను పూర్తి చేయాలని బాబును డిమాండ్ చేశారు. అంతేగానీ, ఈ రకంగా ఎమ్మెల్యేలను కొని 175 సీట్లు మావే అంటే ప్రజలు ఎవరు ఓట్లు వేయరన్నారు. 

ద్రోహంతో, నీచపు ఎత్తుగడలతో బాబు తన కుమారుడిని ముఖ్యమంత్రిని చేయాలన్న కుటిల యత్నాలకు పాల్పడుతున్నారని భూమన ఫైర్ అయ్యారు. మీ పార్టీ జడ్పీచైర్మన్ మీద మీ మంత్రే దౌర్జన్యం చేసే దుష్ట సంప్రదాయానికి రాజకీయాలు వచ్చాయంటే ఇతరుల గురించి మాట్లాడే అర్హత లేని వ్యక్తులు మీరు అని చంద్రబాబు సర్కార్ పై నిప్పులు చెరిగారు. బాబు ఇప్పటికైనా రాజకీయ శైలిని మార్చుకొని ప్రతిపక్షంపై పైశాచిక దాడి చేయడం మానుకోవాలన్నారు. ప్రజల పట్ల బాధ్యతాయుతంగా మేలు చేసే రీతిలో ప్రభుత్వ తప్పిదాలకు వ్యతిరేకంగా పోరాటం చేసే స్థితిలో హేతుబద్దంగా మా నాయకుడు పోరాడుతున్నారని భూమన చెప్పారు. వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్సీపీ తప్ప దేశంలో ఇన్ని వీరోచిత పోరాటాలు ఏ పార్టీ చేయడం లేదని నొక్కి వక్కానించారు. బాబు కుటిల రాజకీయాలను సమర్థిస్తే వచ్చే ఎన్నికల్లో టీడీపీకి పట్టే గతే బీజేపీకి పడుతుందని హెచ్చరించారు.  తమిళనాడు చీఫ్ సెక్రటరీతో బాబుకు నేరుగా సంబంధాలున్నాయని, బాబు డబ్బు కూడా సీఎస్ దగ్గర ఉండే అవకాశాలున్నాయని భూమన అన్నారు.  బాబుకు ఏమాత్రం  చిత్తశుద్ధి ఉన్నా తునిఘటనపై సీబీఐ విచారణ జరిపించాలని భూమన డిమాండ్ చేశారు. అప్పుడు తుసంఘటనలో బాబు మొదటి ముద్దాయిగా జైలుకు వెళ్లడం ఖాయమన్నారు. 
Back to Top