పట్టిసీమ నీళ్లు సముద్రం పాలు

ఏపీ అసెంబ్లీ: పట్టిసీమ నుంచి తెచ్చిన 55 టీఎంసీల నీళ్లు సముద్రంపాలు చేశారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి మండిపడ్డారు. పట్టిసీమ లిప్టింగ్‌ కోసం రూ.136 కోట్ల విద్యుత్‌ బిల్లులు కట్టిన ప్రభుత్వం ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీ కింది రూ.120 కోట్లు తెలంగాణకు కట్టి ఉంటే పులిచింతలలో 40 టీఎంసీలు స్టోర్‌ చేసే అవకాశం ఉండేదని వైయస్‌ జగన్‌ చెప్పారు. మంగళవారం ప్రశ్నోత్తరాల సమయంలో ప్రతిపక్ష నేత నీటి సమస్యపై ప్రభుత్వాన్ని నిలదీశారు. వేల కోట్లు ఖర్చు చేసి గోదావరి నీళ్లు తెచ్చామని, అలా తెచ్చిన నీళ్లు సముద్రంలో కలిపేశారని విమర్శించారు.


అదేవిధంగా పట్టిసీమ నుంచి తెచ్చిన 40 టీఎంసీలు ప్రకాశం బ్యారేజీకి తరలిస్తే కృష్టా బేసిన్‌లో 40 శాతం ఇన్‌ఫ్లో తగ్గిపోయిందని చెప్పారు. శ్రీశైలంలో 584 టీఎంసీల నీరున్నా.. రాయలసీమకు ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గండికోటలో 26 టీఎంసీలు, పైడీపాలెం, సర్వరాయసాగర్, వాయికొండలో నీరు నిల్వ చేసుకోవచ్చు అన్నారు. గండికోటకు 6 టీఎంసీలు తెచ్చి కడపకు నీరు ఇచ్చారని గొప్పలు చెప్పుకోవడం సిగ్గు చేటు అన్నారు. గండికోటకు గతంలోనే కలెక్టర్‌ నీరు తీసుకొనివచ్చారని గుర్తు చేశారు. ప్రతిపక్ష నేత మాట్లాడుతుండగానే మంత్రి దేవినేని ఉమ లేచి పొంతన లేని విషయాలతో సభను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేశాడు. 
Back to Top