బాబుతో తస్మాత్‌ జాగ్రత్త

* ఏపీలో ఫోన్‌ ట్యాపింగ్‌ రాజకీయం
* ఎవర్నీ వదలని చంద్రబాబు  
* ఫోన్‌ ట్యాపింగ్‌లపై ప్రజా ఉద్యమం
* వైయస్‌ఆర్‌ సీపీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డి

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబుతో అందరూ జాగ్రత్తగా ఉండాలని వైయస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డి హెచ్చరించారు. అవినీతి ప్రభుత్వంపై వ్యతిరేకంగా పోరాడుతున్న ప్రతిపక్ష నేతలు, ప్రజా సంఘాల నేతల ఫోన్‌ ట్యాపింగ్‌లు చేస్తూ వారి వ్యక్తిగత జీవితంతో బాబు చెలగాటం ఆడుతున్నారని ధ్వజమెత్తారు. చివరకు సొంత పార్టీ నేతలు, మిత్రపక్షాల ఫోన్లు కూడా వదలడం లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం భూమన కరుణాకర్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఓటుకు కోట్ల కేసులో ఫోన్‌ ద్వారా ఆడియో, వీడియో టేపుల్లో అడ్డంగా దొరికిపోయి  ప్రజల ముందు దోషిగా నిలబడ్డ చంద్రబాబు అదే ఆయుధాన్ని తన స్వార్థ రాజకీయాల కోసం ఉపయోగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతల ఫోన్‌లను ట్యాపింగ్‌ చేస్తూ తీవ్ర ఒత్తిళ్లకు గురిచేస్తున్నారని చెప్పారు. ట్యాపింగ్‌కు సంబంధించి మా వద్ద కచ్చితమైన ఆధారాలున్నాయని స్పష్టం చేశారు. కేవలం ప్రతిపక్ష వైయస్‌ఆర్‌ సీపీ నేతలపైనే కాకుండా రాష్ట్రంలోని పారిశ్రామిక వేత్తలు, బాబు మాటలు వినని పోలీస్‌ అధికారులు, పత్రికా యజమానులు, విలేకరులు, సొంత పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులపై కూడా బాబు ఫోన్‌ ట్యాపింగ్‌ నిఘాను ఏర్పాటు చేశాడని మండిపడ్డారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడాలనుకునే ప్రసార మాధ్యమాలను బెదిరించి తనకు అనుకూలంగా మల్చుకుంటున్నారని ఫైరయ్యారు. 
ఇంత దుర్మార్గమా?

చట్టాన్ని ఉల్లంఘించి టెక్నాలజీ వాడుకుంటూ ప్రజలకు వ్యతిరేకంగా ఫోన్‌ ట్యాపింగ్‌ అనే మారణాయుధాన్ని చంద్రబాబు నడుపుతున్నారని భూమన ధ్వజమెత్తారు. ఇండియన్‌ టెలిగ్రామ్‌ యాక్ట్‌ 1971 చట్టం ప్రకారం దేశ ద్రోహులపై, అనేక నేరారోపణలు ఉన్న వ్యక్తుల ఫోన్‌లు మాత్రమే ట్యాప్‌ చేయాలన్నారు. అది కూడా కేంద్ర హోం శాఖ అనుమతితో చేయాల్సిన టెలిఫోన్‌ ట్యాపింగ్‌ను చంద్రబాబు తన స్వార్థ రాజకీయాల కోసం వాడుకుంటున్నారని భూమన మండిపడ్డారు. బాబు అవినీతిపై పోరాడుతున్న వ్యక్తులపై ట్యాపింగ్‌ నిఘా వేసి ప్రజల ఆలోచనలపై నిఘా వేసే లఫంగిలా చంద్రబాబు ప్రభుత్వం మారిందన్నారు. చివరకు తన పార్టీ నేతలను కూడా వదల కుండా ఇంత దుర్మార్గానికి ఒడిగట్టాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై చంద్రబాబు వివరణ ఇచ్చుకోవాలని సూచించారు. దమ్ముంటే ప్రజల ముందుకు వచ్చి ఎవరి ఫోన్‌లు ట్యాపింగ్‌ చేయట్లేదని ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ ట్యాపింగ్‌ వ్యవహారంపై పార్లమెంట్‌లో గళమెత్తి దీనిపై విచారణ జరిపించాలని డిమాండ్‌ చేస్తామన్నారు. అవసరమైతే ప్రజా సంఘాలు, ప్రతిపక్షాలను కలుపుకొని ఉద్యమాలు చేయడానికైనా వెనకాడమని భూమన కరుణాకర్‌రెడ్డి హెచ్చరించారు.

రాష్ట్ర ప్రజలంతా అప్రమత్తంగా ఉండండి
పెరిగిన టెక్నాలజీని ప్రజా అవసరాలకు, అభివృద్ధికి ఉపయోగించకుండా వ్యక్తిగత జీవితాల్లోకి చొరబడడం నిజంగా సిగ్గుచేటని భూమన చురకలంటించారు. ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేదన్నారు. తన పార్టీలోనే ప్రత్యేక విభాగాన్ని ఏర్పరుచుకొని ట్యాపింగ్‌ను నడుపుతున్నారని స్పష్టం చేశారు. ఆఖరికి బీజేపీ నేతలను కూడా చంద్రబాబు ప్రభుత్వం వదిలిపెట్టడం లేదని, వాళ్లను కూడా తన ఆధీనంలోకి తెచ్చుకునే ప్రయత్నం జరుగుతుందన్నారు. తన పరిపాలన ద్వారా ప్రజల మనస్సును గెలిచే ప్రయత్నం చేయకుండా ట్యాపింగ్‌లకు పాల్పడుతూ అనైతిక కార్యక్రమాలకు నాంధి పలికారని దుయ్యబట్టారు. 5 కోట్ల మంది ప్రజల జీవనం బాబు నిర్వాకం కారణంగా అభద్రతకు గురవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు చేసే కోవర్టు ఆపరేషన్స్‌ అని వైయస్‌ఆర్‌ సీపీ బయటపెడుతుందన్నారు. ఫోన్‌ల ట్యాపింగ్‌ జరుగుతున్నట్లు ప్రభుత్వ అధికారుల నుంచి తనకు పూర్తి సమాచారం ఉందని చెప్పారు. ప్రజలు, ప్రతిపక్షనేతలు, వ్యాపారవేత్తలు, టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు.
Back to Top