చంద్రబాబు తెలుగు దొంగల పార్టీ

చంద్రబాబుకు కొత్త పథకాల రూపకల్పన చేతగాదు
కనీసం కాపీ కొట్టిన పథకాలు కూడా అమలు చేయడం చేతగాకపోతే ఎలా
ఎన్టీఆర్ చావుకు కారణమైన వారే నాపైనా కుట్ర చేస్తున్నారు
ఎన్టీఆర్ తో పోల్చినందుకు గర్విస్తున్నాను
కొన్ని పచ్చపత్రికలు లేనివాటిని కల్పించి రాస్తున్నాయి
టీడీపీ సర్కార్ పై ధ్వజమెత్తిన రోజా
హైదరాబాద్ః  తెలుగుదేశం పార్టీని చంద్రబాబు తెలుగు దొంగల పార్టీగా మార్చారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రోజా నిప్పులు చెరిగారు. ప్ర‌జ‌ల‌కు మేలు చేసే కొత్త ప‌థ‌కాల రూప‌క‌ల్ప‌న చేయడం చేత‌కానీ చంద్ర‌బాబు... క‌నీసం కాపీ కొట్టిన ప‌థ‌కాల‌ను కూడా స‌క్ర‌మంగా అమ‌లు ప‌ర్చడం లేదని ఎద్దేవా చేశారు. దివంగత ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి  ప్ర‌వేశ పెట్టిన ఆరోగ్య‌శ్రీ ప‌థ‌కాన్నే చంద్రబాబు ఎన్టీఆర్ వైద్య సేవ‌గా పేరు మార్చారన్నారు. ఏదైతేనేం తమకు కావాల్సింది పేద‌ల సంక్షేమమ‌ని ఊరుకుంటే ....ఏకంగా బాబు ఈ ప‌థ‌కానికి రూ. 300 కోట్ల బ‌కాయిలు ఎగ్గొట్టారని రోజా మండిపడ్డారు.  

నమ్మి పిల్లనిచ్చి...పార్టీలో ఉన్నత పదవులు కట్టబెట్టిన మామనే వెన్నుపోటు పొడిచిన చరిత్ర చంద్రబాబుదని రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆనాడు ఎన్టీఆర్ చావుకు కారణమైన వారే ఇవాళ తనను కూడా రాజకీయంగా అణగదొక్కేందుకు కుట్రపన్నుతున్నారని రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. అస‌లు ఎన్టీఆర్ పేరంటేనే చంద్ర‌బాబుకు గిట్ట‌ద‌ని... అందుకే న‌మ్మిన మామ‌ను వెన్నుపోటు పొడిచిన చంద్ర‌బాబు, ఆయ‌న పేరు పెట్టుకున్న జూనీయ‌ర్ ఎన్టీఆర్‌ను సైతం ఎన్నిక‌ల ప్ర‌చారంలో వాడుకొని  వదిలేశారన్నారు. ప్ర‌స్తుతం జూనియ‌ర్ ఎన్టీఆర్ సినిమాల‌ను కూడా ఆడ‌కుండా చేసేందుకు చంద్రబాబు, లోకేష్‌లు కుట్ర‌లు ప‌న్నుతున్నార‌న్నారు. 

చంద్రన్న పథకం అమలు ఎలా ఉన్నా నిధులు మాత్రం ఫుల్ అని..అదే ఎన్టీఆర్ జలసిరి, ఎన్టీఆర్ వైద్యసేవ పథకాల దగ్గరకొచ్చేసరికి మాత్రం నిధులు నిల్ అని రోజా ఎద్దేవా చేశారు.  తెలుగోడి సంక్షేమం కోసం స్వ‌ర్గీయ ఎన్‌.టి.రామరావు తెలుగుదేశం పార్టీని స్థాపించి తెలుగోడి స‌త్తాను యావత్ దేశానికి చాటిచెబితే...చంద్రబాబు మాత్రం ఆపార్టీ పరువు దిగజార్చుతున్నారన్నారు. తెలుగుదేశం పార్టీని... చంద్రబాబు తెలుగు దొంగ‌ల పార్టీగా  న‌డిపిస్తున్నార‌ని రోజా విమ‌ర్శించారు. 

ఎన్టీఆర్‌తో పొల్చినందుకు గ‌ర్వ‌ప‌డుతున్నాను..
ఎన్టీఆర్  లాగే రోజాకు ఆహంభావం... ఆయ‌న క్ష‌మాప‌ణ చెప్ప‌మంటే చెప్ప‌కుండా శాస‌న‌స‌భ‌ను బ‌హిష్క‌రించి వెళ్లాడు. అదే వైఖ‌రి రోజా చేస్తే కాల‌గ‌ర్భంలో కలిసిపోతుంద‌ంటూ కొన్ని ప‌చ్చ మీడియా ప‌త్రిక‌లు క‌థ‌నాలు రాశాయ‌ని రోజా చెప్పారు.  అందుకు తాను భాద‌ప‌డ‌డం లేద‌ని, ఎన్టీఆర్‌తో పొల్చినందుకు గ‌ర్వ‌ప‌డుతున్నాన‌ని వివ‌రించారు. ఎన్టీఆర్‌కు అహంకారం అని చెప్పేది కొన్ని ప‌చ్చ మీడియా ఛాన‌ళ్లు త‌ప్ప‌, ప్ర‌జ‌లు కాద‌న్నారు.  ఇప్ప‌టికీ ఎన్టీఆర్ చరిష్మాకే ఓట్లు ప‌డుతున్నాయ‌న్న సంగ‌తి  తెలుసుకోవాల‌ని చంద్రబాబుకు హితవు పలికారు.  

తమ పార్టీ నాయకులను కాపాడుకోవడం కోసమే చంద్రబాబు కాల్ మనీ -సెక్స్‌రాకెట్‌లో మ‌హిళ‌లు అన్యాయ‌మైపోతున్నాప‌ట్టించుకోవ‌డం లేద‌ని నిప్పులు చెరిగారు. కాల్‌మ‌నీ-సెక్స్‌రాకెట్ స‌మ‌స్య చిన్న‌ది కాద‌ని, మూడు కోట్ల మంది మ‌హిళ‌ల‌కు సంబంధించిన విష‌య‌మ‌ని, దీనిపై స‌మ‌గ్రంగా చ‌ర్చ జ‌ర‌పాల‌ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాస‌న‌స‌భ స‌భ్యులు ప‌ట్టుప‌ట్టార‌ని రోజా చెప్పారు.  వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలంద‌రం చ‌ర్చ‌కు ప‌ట్టుబ‌డితే ఒక్క రోజాను మాత్ర‌మే ఎందుకు స‌స్పెండ్ చేశార‌ని నిల‌దీశారు. 

కాల్‌ చంద్ర‌బాబు, మ‌నీ చంద్ర‌బాబు అంటే అందులో తప్పేముందని రోజా అన్నారు.  కామా అంటే కాల్‌మ‌నీకి ష‌ర్ట్‌క‌ట్ అని తెలిపారు. డిసెంబ‌ర్ 11 నుంచి  16 వ‌ర‌కు అన్ని ఛానళ్లు, ప‌త్రిక‌ల్లో వ‌చ్చిన క‌థ‌నాల‌పైనే తాను స‌భ‌లో నిల‌దీయ‌డం జ‌రిగింద‌ని, ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష పార్టీ అయిన వైఎస్సార్‌సీపీ మ‌హిళా అధ్య‌క్షురాలిగా, ఒక మ‌హిళ ఎమ్మెల్యేగా సాటి మ‌హిళ‌ల‌కు జ‌రుగుతున్న అన్యాయాన్ని  ప్ర‌శ్నించాన‌ని పేర్కొన్నారు. త‌న 15 ఏళ్ల రాజ‌కీయ జీవితంలో మ‌హిళ‌ల‌కు జ‌రుగుతున్న అన్యాయాల‌పై పోరాటాలు చేస్తూనే ఉన్నానని స్ప‌ష్టం చేశారు. రిషితేశ్వ‌రీ, ఎమ్మార్వో వ‌న‌జాక్షి, కాల్ మనీ సెక్స్ రాకెట్,  అంగన్‌వాడీ మహిళల స‌మ‌స్య‌ల‌పై గ‌ట్టిగా మాట్లాడి, ప్ర‌భుత్వాన్ని ఇరుకున్న పెట్టినంద‌కే... తనను అసెంబ్లీ నుంచి స‌స్పెండ్ చేశార‌ని ఆవేదన వ్యక్తం చేశారు. 

రోజా అసెంబ్లీలోకి వెళ్ల‌వ‌చ్చని కోర్టు తీర్పు ఇచ్చినా కూడా....దాన్ని ధిక్కరిస్తూ సభలో రానీయకుండా అడ్డుకోవడంతోనే ప్రజలకు టీడీపీ వైఖ‌రి ఏంటో  అర్థ‌మైంద‌న్నారు. అసెంబ్లీ బ‌య‌టే ఇంత రాక్ష‌సంగా ప్ర‌వ‌ర్తిస్తుంటే... ఇక అసెంబ్లీ లోప‌ల ఇంకెంత రాక్ష‌సంగా ప్ర‌వ‌ర్తిస్తున్నారో ప్ర‌జ‌లు తెలుసుకుంటున్నార‌న్నారు. అధికారసభ్యులు త‌మ‌కు న‌చ్చిన కొన్ని ఛాన‌ళ్ల‌కు మొత్తం రికార్డుల‌ను ఇచ్చి, అందులో వారికి న‌చ్చిన‌వి మాత్రమే చూపిస్తున్నార‌న్నారని,  ప్ర‌జ‌ల కోసం ప్ర‌తిప‌క్షం చేస్తున్న పోరాటాల‌ను చూపించడం లేద‌ని ఆరోపించారు. ప్ర‌తిప‌క్షం ఒకలా మాట్లాడితే టీడీపీ దాన్ని వేరేవిధంగా మిమిక్రీ చేయించి చూపిస్తూ... ప్ర‌తిప‌క్ష నాయ‌కులు ఇలా బూతులు తిట్టార‌ని చెప్ప‌డం ఎంత‌వ‌ర‌కు స‌మంజ‌స‌మ‌ని ప్ర‌శ్నించారు. డివిజ‌న్ బెంచ్ ఇచ్చిన అర్డ‌ర్‌ను ఛాలెంజ్ చేస్తు ఎస్ఎల్‌పీ వేయ‌డం జ‌రిగింద‌ని రోజా స్పష్టం చేశారు.  
Back to Top