ఆర్భాటం ఆపి, ‘సాయం'పై దృష్టి పెట్టండి

హైదరాబాద్, అక్టోబర్ 16: సీఎం చంద్రబాబు ప్రచార ఆర్భాటం చేస్తున్నారే తప్ప తుపాను సహాయక చర్యలపై పూర్తిగా దృష్టిని సారించడం లేదని వైఎస్సార్‌సీపీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు అంబటి రాంబాబు విమర్శించారు. బాధితులను ఆదుకునే అంశం పక్కనపెట్టి ఆయన మీడియాలో ప్రచారంపైనే ఆసక్తి చూపిస్తున్నారని ఎద్దేవా చేశారు. తుపాను సంభవించిన నాలుగు రోజుల తరువాత కూడా నిత్యావసర వస్తువులైన పాలు, నీళ్లు, పెట్రోలు, డీజిల్ సరఫరాను పునరుద్ధరించలేకపోయారన్నారు.

గురువారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అంబటి మాట్లాడారు. ‘హుదూద్ ఆకస్మికంగా విరుచుకుపడిందేమీ కాదు. తీవ్రత ఎక్కువగా ఉంటుందని అన్ని సాంకేతిక సంస్థలు హెచ్చరించాయి. కేంద్రం కూడా ప్రత్యేకంగా పరిశీలిస్తూ వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం అనుకున్నంత స్థాయిలో తన దృష్టిని దీనిపై కేంద్రీకరించలేదేమోననిపిస్తోంది. తుపాను హెచ్చరికలు ఈ నెల 6నుంచే వస్తూ ఉన్నాయి.

పదో తేదీన విశాఖలో జన్మభూమిలో పాల్గొనాల్సిన సీఎం చంద్రబాబు మార్పు చేసుకుని ఆ రోజు నెల్లూరు వెళ్లారు. తుపాను తాకిడికి విశాఖపట్నం విలవిల్లాడిన రోజున కూడా బాబు హైదరాబాద్‌లోనే ఉన్నారు. చివరకు ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేసి తట్టిలేపిన తర్వాత గానీ ఆయన విశాఖకు బయలుదేరలేదు. మోదీ ఫోన్ చేసే వరకు కుంభకర్ణుడి నిద్ర ఎందుకు పోయారు?’ అని అంబటి ప్రశ్నించారు. ఈ సమయంలో రాజకీయ విమర్శలు చేయాలన్నది తమ ఉద్దేశం కాదని, కానీ బాబు ప్రచారంపై చూపిస్తున్న ఆసక్తి, విశాఖ ప్రజలకు సేవ చేయడంలో చూపించడం లేదన్నారు.

తాను చేసేవన్నీ తమ అనుకూల మీడియాలో ప్రత్యక్ష ప్రసారాలు చేయించుకోవడానికే ప్రాధాన్యతనిస్తున్నారని దుయ్యబట్టారు. గురువారం బాబు గంటల తరబడి మీడియా ముందు ఉపన్యాసాలివ్వడం, ఆ తర్వాత సెల్‌ఫోన్ ఆపరేటర్ల సమావేశంలో వారిపై ఆగ్రహం వ్యక్తం చేయడం ఇవన్నీ అందులో భాగమేనన్నారు. ‘వైఎస్ విజయమ్మను ఓడించిన  విశాఖ ప్రజలకు దేవుడు విధించిన శిక్ష హుదూద్’ అంటూ ఎవరో ఇంటర్నెట్ లో రాస్తే దానిని పట్టుకుని నిత్యం జగన్‌పై విషం చిమ్మే పత్రిక ఒకటి వక్రీకరిస్తూ ప్రచురించడం దారుణమని అంబటి అన్నారు.

ఈ అంశంతో వైఎస్సార్‌సీపీకి లింకు పెట్టి ఆ పత్రిక రాయడం సరికాదని, తమ పార్టీ ఎప్పుడూ అలా భావించదని, అలాంటి వాటిని ప్రోత్సహించదని స్పష్టం చేశారు. ‘విజయమ్మ ఓటమి వేరు, హుదూద్ తుపాను రావడం వేరు. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజం. అంత మాత్రాన ఓటమికి, తుపాను రావడానికి లింకు పెట్టి ఎవరో వీరాభిమానులు లేదా వైఎస్సార్‌సీపీ శత్రువులు నెట్‌లో ఏదో రాస్తే దాన్ని ప్రచురించడం తగదు..’ అని చెప్పారు.

Back to Top