ప్రతిపక్షంపై టీడీపీ కక్షసాధింపు

హైదరాబాద్ః  లోటస్ పాండ్ లోని పార్టీ కార్యాలయంలో వైఎస్సార్ సీఎల్పీ సమావేశం జరిగింది.  వైఎస్ జగన్ అధ్యక్షతన జరిగిన ఈసమావేశానికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ ముఖ్యనేతలు హాజరయ్యారు. సమావేశానికి ముందు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు మాట్లాడుతూ...టీడీపీ సర్కార్ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అధికారమదంతో అహంకారపూరితంగా వ్యవహరిస్తూ, ప్రతిపక్షం గొంతు నొక్కాలని చూస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.  

మేకా ప్రతాప్ అప్పారావు( నూజివీడు ఎమ్మెల్యే)
ఒక మ‌హిళ ప‌ట్ల ప్రభుత్వం ఇలాంటి చ‌ర్య‌ల‌కు పూనుకోవ‌డం దుర‌దృష్ట‌క‌రమ‌ని ఎమ్మెల్యే మేక‌ప్ర‌తాప్ అప్ప‌ారావు అన్నారు. వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేల పట్ల స్పీకర్ తీరు దారుణంగా ఉందని ఫైరయ్యారు. కోర్టు ఉత్త‌ర్వులు ప‌ట్టుకొని అసెంబ్లీకి వ‌చ్చినా...రోజాను సభలోకి అనుమతించకపోవడం దుర్మార్గమన్నారు. మహానేత వైఎస్సార్ ప్రతిదాన్ని ఎంతో స్పోర్టివ్ గా తీసుకునే వారని...కానీ, ఈప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఈ విష‌యంపై తమ అధినేత వైఎస్ జగన్ తో చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటామన్నారు.   అధికారపార్టీ నేతలు ప్ర‌తిప‌క్ష నాయ‌కుడిని పట్టుకొని కొవ్వెక్కిందని, అసెంబ్లీలోనే పాతేస్తామ‌ని ...ఎన్నిసార్లు రెచ్చ‌గొట్టే వ్యాఖ్యలు చేసినా వైఎస్ జగన్  ఎంతో ఓర్పుతో స‌భ సంప్ర‌దాయాల‌ను పాటించి మౌనంగా ఉన్నారని అప్పారావు తెలిపారు. ప్రజాసమస్యలపై పోరాడుతున్న ప్రతిపక్షాన్ని  టీడీపీ  అణ‌గ‌దొక్కాల‌ని చూస్తోందని,  ఇది స‌రైన పద్ధతి కాదని హితవు పలికారు. ఇప్ప‌టికైనా టీడీపీ తన వైఖరి మార్చుకోవాలని హితవు పలికారు. 

రక్షణనిధి (తిరువూరు ఎమ్మెల్యే)
ప్రభుత్వ అవినీతి, అక్రమాలను నిలదీస్తున్న ప్రతిపక్ష సభ్యులపై ప్రభుత్వం కక్షసాధింపుకు పాల్పడుతోందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రక్షణనిధి మండిపడ్డారు. కాల్ మనీ సెక్స్ రాకెట్ పై ప్రభుత్వ అరాచకాలను నిలదీసినందుకే రోజాను అకారణంగా సస్పెండ్ చేశారన్నారు.  ప్రభుత్వం తమ వైఫల్యాలను  ప్రజల్లోకి వెళ్లకుండా చేయాలన్న ఉద్దేశ్యంతోనే... ప్రతిపక్ష సభ్యులను అసెంబ్లీలో లేకుండా చేయాలని కక్షపూరిత చర్యలకు పాల్పడుతుందని దుయ్యబట్టారు. ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా, రోజా ధైర్యంగా కోర్టుకెళ్లి ఆర్డర్ తెచ్చుకున్నారని చెప్పారు. కోర్టుల కన్నా తామే సుప్రీం అంటూ ప్రభుత్వం రోజాను సభలోకి అనుమతించకపోవడం దారుణమన్నారు. కోర్టులో రోజాకు న్యాయం జరుగుతుందని, ఆమెకు అండగా తాము పోరాటం కొనసాగిస్తామని రక్షణనిధి స్పష్టం చేశారు. 

విశ్వేశ్వర్ రెడ్డి( ఉరవకొండ ఎమ్మెల్యే)
టీడీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర్నుంచి ప్రతిపక్షం గొంతు నొక్కాలన్న ధోరణితోనే ముందుకు పోతుందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. కోర్టు ఆదేశాలను ధిక్కరించిన ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వస్తుందన్నారు. ప్రభుత్వం తాను చేసిన  తప్పులను సరిదిద్దుకోకుండా శాసనసభ వ్యవస్థకు, న్యాయవ్యవస్థకు మధ్య తగాదా పెట్టేవిధంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. రూల్ 340(2) ప్రకారం రోజాను సస్పెండ్ చేసే అధికారం సభకు లేదని తమ అధ్యక్షులు వైఎస్ జగన్ చెప్పినా కూడా ప్రభుత్వం పట్టించుకోలేదని, మాకు మాత్రమే రూల్స్ తెలుసంటూ అధికారాన్ని అడ్డంపెట్టుకొని అంహకూరపూరితంగా వ్యవహరించిందని విశ్వేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. హైకోర్టు స్టేను సైతం ఏమాత్రం గౌరవించకుండా ప్రభుత్వం మొండి వైఖరి అవలంభిస్తోందని ధ్వజమెత్తారు. ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. 

గిడ్డి ఈశ్వరి( పాడేరు ఎమ్మెల్యే)
రోజాను ఏడాదిపాటు సస్పెండ్ చేసే అధికారం స్పీకర్ కు లేదని, సభలో జరిగిన సంఘటనలపై స్పీకర్ కు ఓ సెషన్ మాత్రమే సస్పెండ్ చేసే అధికారం ఉంటుందని ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి అన్నారు. రోజా తన హక్కులకు భంగం కలిగిందనే అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకు వెళ్లి న్యాయం పోరాటం చేశారన్నారు. హైకోర్టు విచారణ చేపట్టి మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చినా కూడా..రోజాను సభలోకి అనుమతించకపోవడం మహిళలను కించపర్చడమేనన్నారు. ప్రభుత్వం, స్పీకర్ వ్యవహరించిన తీరు సిగ్గుచేటన్నారు. టీడీపీ, బీజేపీ ఏకపక్షంగా తీసుకుంటున్న నిర్ణయాలను ప్రజలంతా గమనిస్తున్నారని ఈశ్వరి పేర్కొన్నారు.  ఇక ప్రివిలేజ్ కమిటీ తీసుకున్న నిర్ణయం దారుణంగా ఉందని ఈశ్వరి మండిపడ్డారు. టీడీపీ ఎమ్మెల్యే అనిత చెప్పిన దాన్నే యాక్సెప్ట్ చేస్తున్నారని ఫైరయ్యారు. గతంలో తాము మంత్రులు అచ్చెన్నాయుడు, దేవినేని, గోరంట్ల, ఎమ్మెల్యే బోండా ఉమ తదితరులపై  ప్రివిలేజ్ కమిటీలో ఫిర్యాదు చేస్తే దానిపై ఎందుకు విచారణ చేపట్టలేదని ప్రశ్నించారు. టీడీపీ వాళ్ల దగ్గరకు వచ్చేసరికి క్షమాపణ, మాదగ్గరికొచ్చే సరికి శిక్షనా..?  ఇదెక్కడి న్యాయమని ఈశ్వరి  ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారపార్టీ అహంకారపూరిత చర్యల్ని ఖండిస్తున్నామన్నారు.  ప్రజావ్యవస్థను, న్యాయవ్యవస్థను గౌరవిస్తూ న్యాయపోరాంట కొసాగిస్తామని ఈశ్వరి తేల్చిచెప్పారు.  
Back to Top