3,200 మంది చావుకు టీడీపీయే కారణం

టీడీపీ పాలనలో ప్రజలకు అన్నీ కష్టాలే
అప్పుల ఊబిలో రైతులు
తాగునీటి కోసం ప్రజలు విలవిల
ప్రభుత్వాసుపత్రుల నిర్వహణ దారుణం
ప్రభుత్వాసుపత్రిలోని మరణాలన్నీ ప్రభుత్వ హత్యలే
టీడీపీ సర్కార్ పై ధ్వజమెత్తిన వేణుగోపాలకృష్ణ

హైదరాబాద్ః  టీడీపీ అధికారంలో వ‌చ్చిన‌ప్పటి నుంచి రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు క‌ష్టాలు త‌ప్ప‌డం లేద‌ని వైఎస్సార్‌సీపీ అధికార ప్ర‌తినిధి శ్రీ‌నివాస వేణుగోపాల కృష్ణ అన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వాసుపత్రుల నిర్వహణ దారుణంగా ఉందని మండిపడ్డారు. అందుకు ప్ర‌ధాన కార‌ణం ప్ర‌భుత్వానికి ముందు చూపు లేక‌పోవ‌డం వ‌ల్లేనని విమర్శించారు.  ప్ర‌భుత్వాసుప‌త్రుల్లో వెంటిలేటర్స్ లేకపోవడంతో 3,200 మంది మ‌ర‌ణించారని, అవన్నీ ప్రభుత్వ హత్యలేనని తూర్పరబట్టారు. రాజధాని ప్రాంతమైన ఒక్క గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో 552 మంది మ‌ర‌ణించార‌ని వేణుగోపాలకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. 

లోటస్ పాండ్ లోని పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ... గుంటూరు ఆస్ప‌త్రిలో ఎల‌ుక‌లు సంచరిస్తున్నా ప్రభుత్వం కనీసం పట్టించుకోవడం లేదని ఫైరయ్యారు. గతంలో ఆస్పత్రిలో ఎలుకలు కరిచి ఓ పసికందు చనిపోయిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రభుత్వ దవాఖానాల్లో వెంటిలేట‌ర్లు లేని కార‌ణంగా పెద్ద ఎత్తున మరణాలు సంభవిస్తున్నా టీడీపీ సర్కార్ నిమ్మ‌కునీరెత్తిన‌ట్లు వ్య‌వ‌హరిస్తుంద‌ని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది కేవ‌లం ప్ర‌భుత్వ నిర్ల‌క్ష్యం, జాప్యంతో జ‌రుగుతున్న మరణాలేనని, ప్ర‌భుత్వమే అందుకు పూర్తి బాధ్య‌త వ‌హించాల‌న్నారు. 

పేద‌ల‌కు నాణ్య‌మైన వైద్యం అందించాల‌న్న సంక‌ల్పంతో మహానేత వైఎస్ . రాజశేఖర్ రెడ్డి ఆరోగ్య‌శ్రీ ప‌థ‌కాన్ని ప్ర‌వేశ‌పెడితే... చంద్రబాబు ప్రభుత్వం ఆపథకానికి నిధులు తగ్గించే పనిలో ఉండడం దారుణమన్నారు. ఆరోగ్య‌శ్రీ ట్ర‌స్టుకు సుమారు రూ. 400 కోట్లు త‌గ్గించడం హేయ‌మైన చ‌ర్య అన్నారు. నిధులు త‌గ్గించడం ఎంత‌వ‌ర‌కు స‌మంజ‌స‌మ‌ని ప్ర‌శ్నించారు. ఇప్ప‌టికైనా చంద్ర‌బాబు మేల్కొని ఆరోగ్య‌శ్రీ‌కి పూర్తిస్థాయిలో నిధులు మంజూరు చేయాల‌ని వేణుగోపాల కృష్ణ డిమాండ్ చేశారు. 

ప్ర‌జ‌ల అవ‌స‌రాల‌మేర‌కు ప‌ని చేయాల్సిన ప్ర‌భుత్వం వారి స్వార్థ్యం కోసం ప‌ని చేయ‌డం సిగ్గు చేట‌న్నారు. గ‌డిచినా రెండేళ్ల కాలంలో ఎక్కడ కూడా చంద్రబాబు  ప్ర‌భుత్వాసుప‌త్రుల‌పై శ్రద్ధ వహించిన పాపాన పోలేదన్నారు. ప్ర‌భుత్వాస్ప‌త్రికి వెళ్తే మ‌ర‌ణ‌మే శ‌ర‌ణం అనే ధోర‌ణి క‌న‌బ‌డుతుంద‌ని ఆయన వాపోయారు. జ‌న‌వ‌రిలో వెంటిలేట‌ర్ల‌ను కొనుగోలు చేసిన‌ట్ల‌యితే 3,200 మంది ప్రాణాలు ద‌క్కేవ‌న్నారు. ఇప్పటికైనా వాస్తవాలను గుర్తించి ప్రజల ప్రాణాలను రక్షించాలని ప్రభుత్వానికి సూచించారు. 

ఎర్ర‌చంద‌నం దొంగ‌ల‌ను అరిక‌ట్ట‌డంలో  ప్రాధాన్యత ఇచ్చామని చంద్రబాబు చెబుతున్నారని.... ఆయ‌న సొంత ఊరిలోనే ఎర్ర‌చంద‌నం దుంగలు దాచి ఉంచిన సంఘటనలకు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. చంద్ర‌బాబు నోరువిప్పితే న‌దుల అనుసంధానం అనే మాట‌లు త‌ప్ప రాష్ట్రంలో తాండ‌విస్తున్న క‌రువును ప‌ట్టించుకోవ‌డం లేద‌న్నారు. న‌దుల అనుసంధానం జ‌రిగితే కృష్ణా, గోదావ‌రి జిల్లాల్లో నీటి ఎద్ద‌డిని ఎందుకు గుర్తించ‌లేక‌పోతున్నార‌ని వేణుగోపాల కృష్ణ నిల‌దీశారు. ప్ర‌చార‌ాల‌కే త‌ప్ప ప్ర‌జావ‌స‌రాల‌కు టీడీపీ ప‌ని చేయ‌డం లేద‌ని చెప్ప‌డానికి ఇదొక ఉదాహ‌ర‌ణ అని చెప్పారు. ఇప్ప‌టికైనా బాబు స‌ర్కార్ ప్ర‌జా అవ‌స‌రాల‌కు క‌ట్టుబ‌డి ప్రణాళిక‌లు చేయాల‌ని సూచించారు. 

ప్రభుత్వ మోసపూరిత విధానాల వల్ల రాష్ట్రంలో రైతులు అప్పుల పెనుభారంతో విలవిలలాడుతున్నారని వేణుగోపాలకృష్ణ మండిపడ్డారు. టీడీపీ సర్కార్ నిర్వాకం కారణంగా  రాష్ట్రం 85వేల  కోట్ల నుంచి 93వేల కోట్ల అప్పుల‌కు చేరుకుంద‌ని అన్నారు. భూగ‌ర్భజ‌లాలు పుష్క‌లంగా ఉన్నాయ‌ని, తాగునీటి కోసం ఎలాంటి ఇబ్బందులు లేవ‌ని చంద్రబాబు చెప్ప‌డం హాస్య‌ాస్ప‌ద‌మ‌న్నారు. మహిళ‌లు కిలోమీట‌ర్ల కొద్దీ దూరం  వెళ్లి మంచినీరు తెచ్చుకోవాల్సిన దుస్థితి నెల‌కొంద‌న్నారు. ఏ స‌మ‌స్య‌పై కూడా స్ప‌ష్ట‌మైన నిర్ణ‌యం తీసుకోలేని ప‌రిస్థితిలో చంద్ర‌బాబు స‌ర్కార్ ఉంద‌ని దుయ్య‌బట్టారు. 
Back to Top