టీడీపీ పుట్టుకే.. పొత్తు రాజకీయం


టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్‌ రాజకీయ శత్రువులన్నీ చెప్పినా..
స్థాయి దిగజారి మాట్లాడుతున్న టీడీపీ నేతలు
టీటీyî  వ్యవస్థనే నాశనం చేసిన వ్యక్తి చంద్రబాబు
బాబు ధర్మపోరాటానికి రూ. 30 కోట్ల ప్రజాధనం ఖర్చు
ఇంకా రాష్ట్ర ఖజానాకు ఎంత గండి కొడతారు
వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి

విజయవాడ: పొత్తులపై ఆధారపడి బతికే తెలుగుదేశం పార్టీ.. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీపై దుష్ప్రచారం చేయడం సమంజసం కాదని వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి విమర్శించారు. వైయస్‌ఆర్‌ సీపీ ఆవిర్భావం నుంచి ఏ పార్టీతో పొత్తు పెట్టుకోలేదని, టీడీపీ పుట్టుకే పొత్తే అని.. వారికి వైయస్‌ఆర్‌ సీపీని విమర్శించే అర్హత లేదన్నారు. విజయవాడ వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో గడికోట శ్రీకాంత్‌రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకపోవడం.. మరోపక్క దోపిడీ దారులు ఇళ్లలో దొంగతనాలు చేస్తూ రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణిస్తే.. దానిపై మాట్లాడాల్సిన హోంమంత్రి బీజేపీతో వైయస్‌ఆర్‌ సీపీ కలుస్తుందన్న వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఆరు ఎన్నికల్లో బీజేపీతో తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకుంది వాస్తవమా.. కాదా అని ప్రశ్నించారు. 

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీని రాజకీయంగా ఎదుర్కోలేని చంద్రబాబు దుష్ప్రచారం చేయడం అలవాటుగా మార్చుకున్నాడని గడికోట విమర్శించారు. 2011 ఉప ఎన్నికల్లో పోలీంగ్‌ తేదీకి ముందు రోజు బీజేపీతో వైయస్‌ జగన్‌ కలిశారని తప్పుడు ప్రచారం చేశారని మండిపడ్డారు. 2014 ఎన్నికల్లో ఎవరు పొత్తు పెట్టుకున్నారో ప్రజలంతా చూశారన్నారు. అదే విధంగా నంద్యాల ఉప ఎన్నికల్లో బీజేపీతో వైయస్‌ జగన్‌ కలిసిపోయారని ప్రచారం చేశారని, అప్పటికే టీడీపీ వారు బీజేపీలో.. బీజేపీ వారు టీడీపీలో మంత్రులుగా కొనసాగుతున్నారన్నారు. ప్రజలను మభ్యపెట్టేందుకు ఈ విధమైన డ్రామా ఆడడం ఎంత వరకు సమంజసం అని ప్రశ్నించారు. 

టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు రాజకీయంగా మాకు శత్రువులని వైయస్‌ జగన్‌ ప్రకటించినా స్థాయి దిగజారి టీడీపీ నేతలు మాట్లాడుతున్నారన్నారు. రాష్ట్రాన్ని విడగొట్టడానికి, విడిపోయిన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయని చంద్రబాబు ప్రథమ శత్రువని, అధికారంలోకి రాగానే ఆడిన మాట తప్పిన బీజేపీ రెండో శత్రువనీ, అడ్డగొలుగా రాష్ట్రాన్ని విడగొట్టిన కాంగ్రెస్‌ మూడవ శత్రువని చెప్పారని గుర్తు చేశారు. వీరితో పొత్తుపెట్టుకునే ప్రసక్తే లేదని చెప్పినా టీడీపీ నేతలు దిగజారి మాట్లాడుతున్నారన్నారు. 

టీటీడీ వ్యవస్థనే నాశనం చేసిన వ్యక్తి చంద్రబాబు అని గడికోట విమర్శించారు. మహారాష్ట్ర మంత్రి భార్యను మెంబర్‌గా చేయడం.. గతంలో శేఖర్‌రెడ్డి అనే వ్యక్తిని నియమించి అనేక అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. తిరుపతిలో ధర్మపోరాటం.. అని చంద్రబాబు ప్రభుత్వ సొమ్ము రూ. 30 కోట్లు విచ్చలవిడిగా ఖర్చు చేశారని మండిపడ్డారు. ఆర్టీసీ నష్టాల్లో ఉందనే ఇంకింతం లేకుండా మండలానికి 20 బస్సులు పంపించి బెదిరింపులకు గురి చేసి సభకు జనాన్ని పోగుచేశారన్నారు. ప్రజలను బంధించినట్లుగా కూర్చోబెట్టి చంద్రబాబు సోది చెప్పారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఒక్క రోజు భోజనం చేయనందుకు రాష్ట్ర ఖజానా నుంచి రూ. 30 కోట్లు ఖర్చు చేశారన్నారు. 13 జిల్లాల్లో పోరాటం అంటే ఇంకా డబ్బు ఖర్చు చేస్తారని ప్రశ్నించారు.  

టీడీపీ నేతలు చెప్పిన మాటకు తల ఊపే వారిని మాత్రమే కొనసాగిస్తున్నారని, వినకపోతే బదిలీ వేటుతో ఇబ్బందులకు గురిచేస్తున్నారని శ్రీకాంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. రాష్ట్రంలో 21 మంది ఐఏఎస్‌ అధికారులను బదిలీ చేశారన్నారు. భజన చేసే వారిని మాత్రమే అధికారిగా కొనసాగిస్తున్నారన్నారు. అదే విధంగా  మహిళా దినోత్సవం రోజు అసెంబ్లీ సాక్షిగా మహిళా రక్షణ కోసం విభాగం పెడతామన్న మాట.. ప్రతి ప్రాంతానికి ఒక అధికారిని నియమిస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నిస్తే అటువంటి ఆలోచన లేదని చెప్పారని గుర్తు చేశారు. ఇలాంటి వ్యక్తి మహిళలకు రక్షణ కల్పిస్తారా అని ప్రశ్నించారు. 
 
Back to Top