బాబుకు టీడీపీ ఎమ్మెల్యేలే గుణపాఠం చెబుతారు

  • మోసం చేయడంలో బాబుకు డాక్టరేట్లు సరిపోవు
  • ఎంపీ శివప్రసాద్‌ ప్రశ్నలకు బాబు సమాధానం చెప్పాలి
  • దళిత మహిళా మంత్రి పీతలను ఎందుకు తొలగించారు
  • దళితులను అన్ని రకాలుగా మోసం చేస్తున్న చంద్రబాబు
  • గురువును మోసం చేసినవాడు తారా చంద్రుడు
  • ప్రజలను మోసం చేసిన వాడు నారా చంద్రుడు
  • రాష్ట్రంలో రెండే పథకాలు లోకేష్‌... సూట్కేస్‌
  • వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డి
హైదరాబాద్‌: ప్రజలను మోసం చేయడంలో చంద్రబాబు ఆరితేరిపోయారని, మోసం చేయడంలో ఆయనకు ఎన్ని డాక్టరేట్‌లు ఇచ్చినా తక్కువేనని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డి విమర్శించారు. చంద్రబాబు పరిపాలనపై సొంత పార్టీ నేతలే విమర్శలు చేస్తున్నారని చెప్పారు. చంద్రబాబు దళితులను మోసం చేస్తున్నాడని, సొంత పార్టీ ఎంపీ శివప్రసాద్‌ ఆవేదన వ్యక్తం చేశారని గుర్తు చేశారు. ఎంపీ శివప్రసాద్‌ వేసిన ప్రశ్నలకు చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. దళితులకు అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేస్తే చంద్రబాబు దాన్ని వ్యక్తిగత అంశంగా మార్చి తన మంత్రులతో దళిత ఎంపీని తిట్టిస్తున్నారన్నారు. చంద్రబాబు ప్రభుత్వం దళితులకు సంబంధించిన అన్ని విషయాల్లోను నిర్లక్ష్యం వహిస్తోందని భూమన మండిపడ్డారు. గృహ నిర్మాణం, ఉద్యోగాల భర్తీ, డికేటీ భూముల పరిహారం ఇవ్వకుండా లాక్కోవడం, మంత్రి పదవుల విషయంలో, భూ పంపిణీ విషయంలో, చివరకు గ్రామీణ ఉపాధి విషయంలో ఇలా అన్ని రకాలుగా దళితులను మోసగిస్తూనే ఉన్నారని దుయ్యబట్టారు. దళితులకు మేలు చేయడమే నా లక్ష్యం, ధ్యేయమని ఉపన్యాలు దంచిన చంద్రబాబు ఇప్పుడు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఎంపీ శివప్రసాద్‌ ప్రశ్నలను పక్కదారి మళ్లించకుండా సమాధానాలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. 

ఒక్కరు కూడా సంతృప్తిగా లేరు
ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు పరిపాలన పట్ల సంతృప్తికరమైన జీవనం ఎవరూ గడపడం లేదని భూమన స్పష్టం చేశారు. గరువును మోసం చేసిన వాడు తారా చంద్రుడు అయితే నమ్మిన వారిని మోసం చేస్తున్న నారా చంద్రుడని అందరి చేత చంద్రబాబు కీర్తింపబడుతున్నాడని ఎద్దేవా చేశారు. దుష్టశక్తులను పార్టీలోకి చేర్చుకొని మంత్రి పదవులు కట్టబెట్టారని మీ పార్టీనేతలే అంటున్నా వినిపించడం లేదా అని చంద్రబాబును నిలదీశారు. మంత్రులందరిలోకెల్లా నెంబర్‌ వన్‌ మంత్రిగా ఉన్న దళిత మహిళా మంత్రి పీతల సుజాతను ఎందుకు డిస్‌మిస్‌ చేశారో ప్రజలకు సమాధానం చెప్పాలని భూమన డిమాండ్‌ చేశారు. నెంబర్‌ వన్‌గా పనిచేసినందుకు తీసేశారా.. లేక ప్రతిపక్ష ఎమ్మెల్యే రోజా మీద విపరీతంగా దాడి చేయించి మీ పబ్బ గడిచిన తరువాత వేటు వేశారా అని ప్రశ్నించారు. పల్లె రఘునాథరెడ్డిని ఎందుకు తొలగించారని నిలదీశారు. కాపుల గొంతు కోశారని మీ పార్టీ ఎమ్మెల్యే బోండా ఉమా చేసిన ప్రకటనకు మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా విమర్శలు చేసిన టీడీపీ ఎమ్మెల్యేలు పయ్యావుల కేశవులు, ముద్ద కృష్ణమనాయుడు, చింతమనేని ప్రభాకర్, బుచ్చయ్యచౌదరి లాంటి వాళ్లు వేసిన ప్రశ్నలకు కూడా చంద్రబాబు సమాధానం చెప్పాలన్నారు. 

అన్నం పెట్టినవాడిని తన్నడం.. బాబు నీతి
ఒకటి లోకేష్‌ మరొకటి సూట్కేస్‌ రాష్ట్రంలో రెండే పథకాలు నడుస్తున్నాయని భూమన ఎద్దేవా చేశారు. అన్నం పెట్టే వాడిని అడ్డంగా తన్నడం.. నీరిచ్చిన వారిని నిలువునా మోసం చేయడం చంద్రబాబు నీతి అని మండిపడ్డారు. రాష్ట్రంలో చంద్రబాబు పరిపాలన పట్ల ఒక్క లోకేష్‌ తప్ప మరెవరూ సంతోషంగా లేరని భూమన అన్నారు. ప్రభుత్వం అన్యాయంగా, దారుణంగా అవినీతితో నిండిపోయి దుర్మార్గంగా పరిపాలిస్తుందని సాక్షాధారాలతో చెబుతున్నప్పటికీ బాబు ప్రతిపక్షంపై నిరంతరం దాడి చేయిస్తున్నారు. ఇప్పుడు ఆయన సొంత పార్టీ దళిత ఎంపీ అడిగిన ప్రశ్నలకు బాబు సమాధానం చెప్పాలన్నారు. ఆ రోజున పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్‌ను, ఈ రోజున ప్రజలను వెన్నుపోటు పొడుస్తూ వెన్న రాస్తువస్తున్నాడని ఆరోపించారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా విఫలం.. పార్టీ అధ్యక్షుడిగా విఫలం.. కేవలం తండ్రిగానే సఫలం అయ్యాడని ఎద్దేవా చేశారు. అతి తొందరలోనే టీడీపీ ఎమ్మెల్యేలే చంద్రబాబు గుణపాఠం చెప్పే రోజులు వస్తాయని హెచ్చరించారు. 
Back to Top