టీడీపీ ఎమ్మెల్యే వీరంగం

పశ్చిమగోదావరి(ఏలూరు) : పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మరోసారి రెచ్చిపోయారు. అటవీ అధికారులపై  వీరంగం సృష్టించారు. ప్రభుత్వ ఉద్యోగులపై తరచూ దాడులకు పాల్పడే చింతమనేని మరోసారి తన నోటికి పని చెప్పారు. తాజాగా అటవీ శాఖ అధికారి వినోద్ కుమార్ ను ఫోన్లో అసభ్యంగా దూషించారు. రహదారి పనులను అడ్డుకుంటే సహించేది లేదని, నువ్వో నీనో తేల్చుకుందామంటూ అధికారిపై బెదిరింపులకు దిగారు.  

చింతమనే ప్రభాకర్ కొల్లేరు ప్రాంతంలో అటవీశాఖ నిబంధనలకు విరుద్ధంగా రహదారిని నిర్మించారు. దీనిపై ప్రశ్నించిన అధికారులపై గతంలో కూడా ఓసారి దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటనకు సంబంధించి ఎమ్మెల్యేపై కేసు కూడా నమోదు అయింది. కాగా మరోసారి అధికారులను ఇష్టమొచ్చినట్లు తిట్టారు. గతంలో ఇసుక అక్రమ తవ్వకాలను అడ్డుకునేందుకు వెళ్లిన కృష్ణాజిల్లా ముసునూరు ఎమ్మార్వో డి.వనజాక్షిపైనా చింతమనేని ప్రభాకర్ అతి అనుచరగణం దాడులకు తెగబడ్డారు.  అప్పట్లో ఈసంఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. చంద్రబాబు అండచూసుకొని చింతమనేని దాడులు, దౌర్జన్యాలతో బరితెగిస్తుండడంతో అధికారులు బెంబేలెత్తుతున్నారు. 
Back to Top