వైఎస్సార్సీపీ నేతలపై టీడీపీ వర్గీయుల దాడి

నందలూరు:  వైెఎస్సార్ కడప జిల్లా నందలూరు మండలం చింతకాయలపల్లె గ్రామానికి చెందిన వైఎస్సార్ సీపీ వర్గీయులపై తెలుగుదేశం పార్టీ వర్గీయులు శనివారం రాత్రి ఇనుపరాడ్లతో, కర్రలతో దాడులు చేసి  తీవ్రంగా గాయపరిచారు. గాయపడిన వారిలో వైఎస్సార్ సీపీకి చెందిన మాజీ సర్పంచ్ గంగినాయుడు, శంకరయ్య, రమేష్, ఎల్లయ్యలు ఉన్నారు. తీవ్రంగా గాయపడిన వీరిని రాజంపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బాధితుల కథనం మేరకు వివరాలిలావున్నాయి.

తెలుగుదేశం పార్టీకి చెందిన వారు ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారని, అయితే తాము అధికారులకు చెప్పామన్న అనుమానంతో దేశం పార్టీకి చెందిన మాజీ ఎంపీపీ బోనబోయిన లక్ష్మీనరసయ్య, శివయ్య, పెంచలయ్యలతో పాటు మరో పది మంది మూకుమ్మడిగా రాడ్లు, కర్రలు తీసుకొని తీవ్రంగా గాయపరిచారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే కనికరం లేకుండా మహిళలపై కూడా దాడులు చేశారని ఆరోపించారు. అంతేకాక తన ఇంటిని దేశం వర్గీయులు ధ్వంసం చేశారని గంగినాయుడు ఆవేదన వ్యక్తం చేశాడు.

వైఎస్సార్ సీపీకి మద్దతుగా ఉన్న వారందరిని భయబ్రాంతులకు గురిచేసినట్లు ఆయన తెలిపారు. దీంతో గ్రామంలోని వారు గాయపడిన తమను వైద్యం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.   ఇదిలావుండగా అదే గ్రామానికి చెందిన దేశం పార్టీ వర్గీయులు తమపై  వైఎస్సార్ సీపీకి చెందిన వారు దాడులు చేసి గాయపరిచినట్లు నందలూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు దేశం వర్గీయుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

గాయపడిన వారిని పరామర్శించిన ఆకేపాటి అనీల్‌కుమార్‌రెడ్డి
తెలుగుదేశం వర్గీయుల దాడిలో గాయపడి రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శంకరయ్య, గంగినాయుడు, రమేష్, ఎల్లయ్యలను శనివారం రాత్రి వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్‌నాధ్‌రెడ్డి సోదరుడు ఆకేపాటి అనీల్‌కుమార్‌రెడ్డి పరామర్శించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ వైఎస్సార్ సీపీ వర్గీయులపై దేశం వర్గీయుల దాడులు రోజు, రోజుకు అధికమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.  
ప్రతిపక్ష  పార్టీకి మద్దతుగా ఉండేవారిపై కక్ష సాధింపు ధోరణులకు దిగడంతో పాటు, కేవలం తమ అక్రమాలపై ఫిర్యాదులు చేస్తున్నారన్న అనుమానంతోనే దాడులు చేయడం సరైనది కాదని తెలిపారు.   గాయపడిన వారిని పరామర్శించిన వారిలో  నందలూరుకు చెందిన వైఎస్సార్ సీపీ వివిధ విభాగాల కన్వీనర్లు గడికోట సుబ్బారెడ్డి,  కుందానెల్లూరు గోపిరెడ్డి, సౌమిత్రి, అరిగెల దినేష్, నడివీధి సుధాకర్, గీతాల ప్రతాప్‌రెడ్డి, అమీర్ తదితరులు ఉన్నారు.
Back to Top